ISRO | ఇస్రో ఎస్ఎస్ఎల్వీ- డీ3 ప్రయోగం విజయవంతం
ఇస్రో చేపట్టిన ఎస్ఎస్ఎల్వీ- డీ3 ప్రయోగం విజయవంతమైంది. తిరుపతి జిల్లా శ్రీహరికోటలోని షార్ నుంచి ప్రయోగించిన ఎస్ఎస్ఎల్వీ- డీ3 వాహక నౌక విజయవంతంగా నింగిలోకి దూసుకెళ్లింది

విధాత, హైదరాబాద్ : ఇస్రో చేపట్టిన ఎస్ఎస్ఎల్వీ- డీ3 ప్రయోగం విజయవంతమైంది. తిరుపతి జిల్లా శ్రీహరికోటలోని షార్ నుంచి ప్రయోగించిన ఎస్ఎస్ఎల్వీ- డీ3 వాహక నౌక విజయవంతంగా నింగిలోకి దూసుకెళ్లింది. ఈ ప్రయోగం ద్వారా 175 కిలోల ఈవోఎస్-08 ఉపగ్రహాన్ని విజయవంతంగా కక్ష్యలోకి ప్రవేశపెట్టారు. మొత్తం 17 నిమిషాల పాటు ఈ ప్రయోగం సాగింది. విపత్తు నిర్వహణలో సమాచారం ఇచ్చేందుకు ఈ ఉపగ్రహం ఉపయోగపడనుంది. పర్యావరణం, ప్రకృతి విపత్తులు, అగ్ని పర్వతాల పరిస్థితులను ఇది పర్యవేక్షించనుంది. ఇస్రోకు చెందిన యూఆర్ రావు శాటిలైట్ సెంటర్లో ఈవోఎస్ ను అభివృద్ధి చేశారు.
SSLV-D3/EOS-08 Mission
Tracking images 📸 pic.twitter.com/1TSVx19ZDk
— ISRO (@isro) August 16, 2024
ఇందులో ఉండే ఎలక్ట్రో ఆప్టికల్ ఇన్ఫ్రారెడ్ (ఈవోఐఆర్) పేలోడ్ మిడ్-వేవ్, లాంగ్ వేవ్ ఇన్ఫ్రా-రెడ్ చిత్రాలను క్యాప్చర్ చేస్తుంది. విపత్తు నిర్వహణలో ఈ సమాచారం ఉపయోగపడుతుందని ఇస్రో పేర్కొంది. ప్రయోగం విజయవంతం కావడంతో శాస్త్రవేత్తలను ఇస్రో చైర్మన్ అభినందించారు. ఎస్ఎస్ఎల్వీ- డీ3 ప్రయోగం విజయంవతం పట్ల ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు శాస్త్రవేత్తలకు అభినందనలు తెలిపారు. భారత అంతరిక్ష నైపుణ్య కీర్తి మరోసారి సత్తా చాటిందని పేర్కొన్నారు. ఇస్రో బృందం భవిష్యత్ ప్రయత్నాలకు శుభాకాంక్షలు తెలిపారు.