హర్యానా ప్రభుత్వాన్ని దించేయండి

ముగ్గురు స్వతంత్ర ఎమ్మెల్యేలు మద్దతు ఉపసంహరించడంతో మంగళవారం మైనార్టీలో పడిపోయిన హర్యానాలోని నాయబ్‌సింగ్‌ సైని ప్రభుత్వం మర్నాడే మరింత సంక్షోభంలోకి వెళ్లిపోయింది

హర్యానా ప్రభుత్వాన్ని దించేయండి

గవర్నర్‌ను కలిసి పరిస్థితి వివరించండి
కాంగ్రెస్‌ నేత హుడాకు జేజేపీ నేత సూచన
తమతో సంప్రదింపులు ప్రారంభించాలని సలహా

చండీగఢ్‌: ముగ్గురు స్వతంత్ర ఎమ్మెల్యేలు మద్దతు ఉపసంహరించడంతో మంగళవారం మైనార్టీలో పడిపోయిన హర్యానాలోని నాయబ్‌సింగ్‌ సైని ప్రభుత్వం మర్నాడే మరింత సంక్షోభంలోకి వెళ్లిపోయింది. ఈ ముగ్గురు ఎమ్మెల్యేలు కాంగ్రెస్‌కు మద్దతు ప్రకటించారు. ఈలోపే గతంలో బీజేపీ ప్రభుత్వానికి మద్దతు ఇచ్చిన జననాయక్‌ జనతాపార్టీ (జేజేపీ) నేత దిగ్విజయ్‌సింగ్‌ చౌతాలా.. ప్రజల విశ్వాసం కోల్పోయిన ప్రభుత్వాన్ని పడగొట్టేందుకు చర్యలకు ఉపక్రమించాలని ప్రతిపక్ష కాంగ్రెస్‌ నేత భూపిందర్‌సింగ్‌ హుడాను కోరారు.

అయితే.. కాంగ్రెస్‌ ప్రభుత్వం ఏర్పడితే మద్దతు ఇస్తారా? అన్న ప్రశ్నపై మాత్రం ఆయన స్పష్టతనివ్వలేదు. దీంతో ఆయన రాజకీయ వ్యూహం ఏంటన్న అంశం సస్పెన్స్‌గా మారింది. గవర్నర్‌ను కలిసి, పరిస్థితిని వివరించాలని హుడాకు దిగ్విజయ్‌సింగ్‌ చౌతాలా విజ్ఞప్తి చేశారు. ఈ ప్రభుత్వాన్ని పడగొట్టేందుకు జేజేపీ ప్రయత్నిస్తుందని చెప్పారు. ‘జేజేపీ, స్వతంత్ర సభ్యులతో హుడా మాట్లాడాలి. కొత్త ప్రభుత్వం ఏర్పాటుకు అవకాశం కోరాలి’ అని ఆయన అన్నారు.

జేజేపీ గతంలో హర్యానాలో బీజేపీకి మిత్రంపక్షంగా ఉండేది. లోక్‌సభ ఎన్నికల్లో సీట్ల కేటాయింపు విషయంలో ఆ పార్టీతో తెగతెంపులు చేసుకున్నది. హర్యానాలో తమకు రెండు లోక్‌సభ సీట్లు ఇవ్వాలన్న జేజేపీ విజ్ఞప్తిని బీజేపీ తిరస్కరించడంతో ప్రభుత్వానికి మద్దతు ఉపసంహరించుకున్నది.
కాంగ్రెస్‌ కనుక ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తే మద్దతు ఇస్తారా? అన్న ప్రశ్నకు ఆయన సూటిగా సమాధానం ఇవ్వలేదు. కాంగ్రెస్‌కు మద్దతు ఇచ్చి, ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని నేను చెప్పడం లేదు. కనీసం ప్రజల విశ్వాసాన్ని కోల్పోయిన ప్రభుత్వాన్ని గద్దె దించేందుకు హుడా చొరవ చేయాలి.

జేజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందా? కాంగ్రెస్‌ ఏర్పాటు చేస్తుందా? ఎవరు ఎవరికి మద్దతు ఇస్తారు? అనేది రాజకీయ ప్రశ్న’ అని ఆయన బదులిచ్చారు. జేజేపీతో సంప్రదింపులను కాంగ్రెస్‌ ప్రారంభిస్తే ఆ పార్టీతో మాట్లాడేందుకు తాము సిద్ధమని చెప్పారు. హర్యానాలో జేజేపీకి పది మంది సభ్యులు ఉన్నారు. ‘ప్రభుత్వానికి సంఖ్యాబలం లేదని హుడా చెబుతుంటే.. మరి ఆయన దేనికోసం ఎదురు చూస్తున్నారు? పరిస్థితిని బీజేపీ చక్కదిద్దుకోవడం కోసం ఆయన ఎదురు చూస్తున్నారా?’ అని దిగ్విజయ్‌సింగ్‌ చౌతాలా ప్రశ్నించారు. ఈ విషయంలో ఆయన ఎలాంటి సాకులు చెప్పరాదని అన్నారు.

ప్రభుత్వం నుంచి జేజేపీ వైదొలిగినప్పటికీ ఆ పార్టీ ఎమ్మెల్యేలు కొందరు బీజేపీకి మద్దతు ఇవ్వొచ్చన సంకేతాలు ఇస్తున్నారని ప్రస్తావించగా.. ‘అది అంశమే కాదని తమ నేత దుష్యంత్‌ వెంట మూడొంతుల మంది సభ్యులు ఉన్నారని చెప్పారు. ఒకరిద్దరు ఎమ్మెల్యేలు బీజేపీకి మద్దతు ఇస్తే తగిన చర్యలు తీసుకుంటామని ఆయన సంకేతాలు ఇచ్చారు. రోహతక్‌లో మీడియా సమావేశం పెట్టి, దాన్ని ఒక రాజకీయ అంశంగా మార్చేబదులు హుడాకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే.. గవర్నర్‌ను కలవాలి. పది మంది ఎమ్మెల్యేలు ఉన్న జేజేపీతో సంప్రదింపులు మొదలు పెట్టాలి’ అని చౌతాలా అన్నారు. అవిశ్వాసం వస్తుందా? లేదా? అన్నది హుడా నిర్ణయించేది కాదని, రాజ్యాంగ అధినేతగా అది గవర్నర్‌ పని అని చెప్పారు.