JNUSU Election Results 2025 | జేఎన్‌యూ విద్యార్థి సంఘ ఎన్నికల్లో దూసుకుపోతున్న వామపక్ష సంఘాలు

ఢిల్లీలోని జవహర్‌లాల్‌ నెహ్రూ యూనివర్సిటీ విద్యార్థి సంఘ ఎన్నికల్లో అన్ని విభాగాల్లోనూ వామపక్ష విద్యార్థి సంఘాలు స్పష్టమైన ఆధిక్యాన్ని ప్రదర్శించాయి. 11 ఏళ్ల విరామం తర్వాత బీపీఎస్‌ఏ (బిర్సా అంబేడ్కర్‌ పూలే స్టూడెంట్స్‌ అసోసియేషన్‌ అధ్యక్ష పదవిని దక్కించుకున్నది. ఈ సంఘానికి చెందిన కోమల్‌దేవి.. స్కూల్‌ ఆఫ్‌ సోషల్‌ సైన్సెస్‌ కౌన్సిలర్‌ సీటును గెలుచుకుంది.

  • By: TAAZ |    national |    Published on : Nov 06, 2025 5:58 PM IST
JNUSU Election Results 2025 | జేఎన్‌యూ విద్యార్థి సంఘ ఎన్నికల్లో దూసుకుపోతున్న వామపక్ష సంఘాలు

JNUSU Election Results 2025 | ఢిల్లీలోని ప్రఖ్యాత జేఎన్‌యూ విద్యార్థి సంఘ ఎన్నికల్లో వామపక్ష విద్యార్థి సంఘాలు స్పష్టమైన ఆధిక్యం ప్రదర్శించాయి.  వామపక్ష కూటమికి చెందిన అదితి మిశ్రా అధ్యక్ష స్థానాన్ని కైవసం చేసుకునే దిశగా దూసుకుపోతున్నారు. ఏబీవీపీ అభ్యర్థులు కార్యదర్శుల పోస్టులలో ఎదురొడ్డుతున్నారు. ఈ ఏడాది సుమారు 9వేల మంది విద్యార్థులు ఓటింగ్‌లో పాల్గొన్నారు. అంటే.. 67 శాతం ఓటింగ్‌ నమోదైంది. లెఫ్ట్‌ యూనిటీ అభ్యర్థులు.. అధ్యక్ష, ఉపాధ్యక్ష, ప్రధాన కార్యదర్శి, సంయుక్త కార్యదర్శి పోస్టులు గెలుచుకునే దిశగా సాగుతున్నట్టు తాజా ఫలితాల సరళి చాటుతున్నది. 11 ఏళ్ల విరామం తర్వాత బీపీఎస్‌ఏ (బిర్సా అంబేడ్కర్‌ పూలే స్టూడెంట్స్‌ అసోసియేషన్‌ అధ్యక్ష పదవిని దక్కించుకున్నది. ఈ సంఘానికి చెందిన కోమల్‌దేవి.. స్కూల్‌ ఆఫ్‌ సోషల్‌ సైన్సెస్‌ కౌన్సిలర్‌ సీటును గెలుచుకుంది.

ప్రెసిడెంట్‌ పోస్టుకు మొత్తం ఏడుగురు పోటీ పడ్డారు. అందులో ఆదితి మిశ్రా (లెఫ్ట్‌ యూనిటీ), వికాస్‌ పటేల్‌ (ఏబీవీపీ), వికాశ్‌ బైష్ణోయి (ఎన్‌ఎస్‌యూఐ), రాజ్‌ రతన్‌ రాజోరియా (బీఏపీఎస్‌ఏ), శిర్శవ ఇందు (డీఐఎస్‌ఎహ్‌ఏ – దిశ), షిండే విజయలక్ష్మి (ప్రోగ్రెసివ్‌ స్టూడెంట్స్‌ అసోసియేషన్‌), అంగద్‌ సింగ్‌ (ఇండిపెండెంట్‌) ఉన్నారు. ఉపాధ్యక్ష పోస్టుకు లెఫ్ట్‌ యూనిటీ నుంచి కిళకూట్‌ గోపికా బాబు, ఎన్‌ఎస్‌యూఐకి చెందిన షేక్‌ షానవాజ్‌ ఆలం, ఏబీవీపీ నుంచి తన్య కుమారి ఉన్నారు. మొత్తం నాలుగు పోస్టులకు 20 మంది పోటీపడ్డారు. ఆలిండియా స్టూడెంట్స్‌ అసోసియేషన్‌ (ఏఐఎస్‌ఏ), భారత విద్యార్థి ఫెడరేషన్‌ (ఎస్‌ఎఫ్‌ఐ), డెమోక్రటిక్‌ స్టూడెంట్స్‌ ఫెడరేషన్‌ (డీఎస్‌ఎఫ్‌) లెఫ్ట్‌ యూనిటీ పేరుతో కూటమిగా ఏర్పడాయి. గత ఏడాది వామపక్ష కూటమి టాప్‌ మూడు పోస్టులను దక్కించుకుంది. అరెస్సెస్‌ అనుబంధ ఏబీవీపీ పదేళ్ల తర్వాత జాయింట్ సెక్రటరీ పోస్టును దక్కించుకోగలిగింది.

ఇవీ ఓట్ల వివరాలు..

అధ్యక్షుడు:
అదితి (లెఫ్ట్ యూనిటీ – AISA): 1861 ఓట్లు
వికాస్ (ABVP): 1447 ఓట్లు
ఉపాధ్యక్షుడు:
గోపిక (లెఫ్ట్‌ యూనిటీ SFI): 2966 ఓట్లు
తాన్య (ABVP): 1730 ఓట్లు

జనరల్ సెక్రటరీ:
రాజేశ్వర్ (ABVP): 1915 ఓట్లు
సునీల్ (లెఫ్ట్ యూనిటీ SFI): 1841 ఓట్లు

జాయింట్ సెక్రటరీ:
డానిష్ (లెఫ్ట్‌ యూనిటీ): 1991 ఓట్లు
అనుజ్ (ABVP): 1762 ఓట్లు

11 ఏళ్ల విరామం తర్వాత బీఏపీఎస్‌ఏ గెలుపు

ప్రధాన పోస్టుల వివరాలు అలా ఉంటే.. క్యాంపస్‌ రాజకీయాల్లో కోమల్‌ దేవి గెలుపు తీవ్ర చర్చనీయాంశమైంది. బిర్సా అంబేద్కర్‌ ఫూలే స్టూడెంట్స్‌ అసోసియేషన్‌కు చెందిన కోమల్‌.. స్కూల్‌ ఆఫ్‌ సైన్సెస్‌ (ఎస్‌ఎస్‌ఎస్‌) కౌన్సిలర్‌గా ఎన్నికయ్యారు. ఈమె ఎన్నికతో 11 ఏళ్ల విరామాన్ని బీఏపీఎస్‌ఏ అధిగమించినట్టయింది. సామాజిక న్యాయం, అణగారినవర్గాలకు ప్రాతినిధ్యం విషయంలో దీర్ఘకాలంగా క్యాంపస్‌లో బీఏపీఎస్‌ఏ పోరాడుతున్నది. సాధారణంగా వామపక్ష, ఏబీవీపీ మధ్యే పోటీ నెలకొని ఉండే జేఎన్‌యూలో మూడో శక్తి రావడం క్యాంపస్‌ రాజకీయాల్లో గణనీయ మార్పులకు కారణమవుతుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.