కర్నాటకలో సర్ కత్తి.. మారనున్న రాజకీయ ముఖ చిత్రం?

కర్ణాటకలో కొనసాగుతున్న సర్‌ ప్రక్రియ ఆ రాష్ట్ర ప్రజల్లో గుబులు రేపుతున్నది. రెసెడెన్షియల్‌ సర్టిఫికెట్లతో లింకు పెట్టడంతో ఓటర్లు తాసిల్దార్‌ కార్యాలయాలకు పరుగులు పెడుతున్నారు.

sir confusion in karnataka ai generated image

స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (ఎస్ఐఆర్) ప్రక్రియ పలు రాష్ట్రాలలో నిజమైన, అర్హులైన ఓటర్లను నిద్ర లేకుండా చేస్తోంది. కర్నాటకలో సర్ వేగవంతంగా జరుగుతున్న తరుణంలో పర్మినెంట్ రెసిడెన్సీ సర్టిఫికెట్ (శాశ్వత నివాస ధృవపత్రం) కోసం ఓటర్లు తహశీల్దార్ కార్యాలయాలకు పరుగులు పెడుతున్నారు. ఆన్‌లైన్‌ వెబ్ పోర్టళ్లు పనిచేయకపోవడంతో పౌరులు ప్రభుత్వం తీరుపై దుమ్మెత్తిపోస్తున్నారు. నిర్ణీత గడువులోగా ధృవపత్రాలు అందుతాయా లేదా అనే టెన్షన్‌లో ఉన్నారు. పెద్ద ఎత్తున ఓటర్ల తొలగింపు మూలంగా అర్హులైన ఓటర్లు తమ ఓటు హక్కు కోల్పోవచ్చనే భయాలు పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో ధృవపత్రాల కోసం తహశీల్దార్ కార్యాలయాలకు వెళ్లి దరఖాస్తులు సమర్పిస్తున్నారు. అయితే వెబ్ ఫోర్టల్ లో సాంకేతిక సమస్యల మూలంగా పత్రాల జారీలో అనేక సమస్యలు ఎదురవుతున్నాయి. సర్ ప్రక్రియ పూర్తయిన తరువాత రాష్ట్రంలో రాజకీయ ముఖచిత్రమే మారిపోతుందని, ఓటర్ల తొలగింపు రాజకీయ నాయకుల తలరాతలను మార్చుతుందని పౌర సమాజం హెచ్చరిస్తున్నది.

కోటి ఓట్లు గాయబ్‌?

సర్ ప్రక్రియ ఇలాగే కొనసాగితే కర్నాటకలో ఒక కోటి ఓటర్ల పేరు ముసాయిదా ఓటర్ల జాబితాలో మాయం అవుతాయని పౌర సమాజం అంచనా వేస్తున్నది. రాష్ట్రంలో సర్ ప్రారంభం కాకముందు అనగా జూన్ 30వ తేదీ నాటికి 5.54 కోట్ల ఓటర్లు ఉన్నారు. బూత్ స్థాయి సిబ్బంది పరిశీలన తరువాత 84 లక్షల ఓటర్ల పేర్లు ముందస్తుగానే పక్కన పెట్టారు. వీరిలో ఇతర ప్రాంతాలకు మారిన వారు, ఇంట్లో లేని వారు, డూప్లికేట్ వంటి కారణాల మూలంగా ఈ పేర్లను పక్కనపెట్టినట్లు ఎన్నికల అధికారులు చెబుతున్నారు. అయితే వీరిలో చాలా మందికి శాశ్వత నివాస ధృవపత్రం లేకపోవడం మూలంగా ఓటు హక్కును కోల్పోతున్నారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. తాము ఇక్కడే పుట్టి, ఇక్కడే పెరిగిన వారమని, తమ తాతలు తల్లిదండ్రులు ఈ ప్రాంతం వారు అనే విధంగా వారి వద్ద సరైన పత్రాలు లేకపోవడం ప్రధాన కారణంగా ఇటీవల వెలుగు లోకి వచ్చింది. ఇలాంటి వారి ఓటు హక్కు రద్ధు కాకుండా రక్షించేందుకు కర్నాటక ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నా ఆ దిశగా చర్యలు తీసుకోవడంలో విఫలమైందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. సేవా సింధు ఆన్ లైన్ కేంద్రాలు లేదా తహశీల్దార్ కార్యాలయాలు, నడకచ్చేరి కేంద్రాలలో నివాస ధృవ పత్రాల మంజూరు కోసం దరఖాస్తులు సమర్పించాలని ప్రజలను కోరింది. దరఖాస్తులను పరిశీలించి తహశీల్దార్లు, డిప్యూటీ తహశీల్దార్లు శాశ్వత నివాస ధృవపత్రాలు జారీ చేస్తారని ప్రభుత్వం ప్రకటించింది.

గుబులు రేపిన డీకే వ్యాఖ్యలు

ఈ నేపథ్యంలో కర్నాటక ముఖ్యమంత్రి డీకే శివకుమార్ చేసిన వ్యాఖ్యలు ఓటర్లలో మరింత గుబులును రేకెత్తిస్తున్నాయి. ప్రభుత్వ సంక్షేమ పథకాలు, సేవలు పొందేందుకు ఓటు హక్కకు విడదీయరాని బంధం ఉందని పేర్కొన్నారు. దీంతో ఈ ధృవపత్రం తీసుకోవాలని కోరుతూ కాంగ్రెస్ నాయకులు రాష్ట్ర వ్యాప్తంగా ప్రచారం చేస్తున్నారు. అయితే సేవా సింధు, నడకచ్చేరి కేంద్రాలలో పరిస్థితులు విభిన్నంగా ఉన్నాయని పౌరులు ఆరోపిస్తున్నారు. ఈ ఆన్ లైన్ వెబ్ ఫోర్టళ్లు సరిగా పనిచేయడం లేదని, మొరాయిస్తున్నాయని విమర్శిస్తున్నారు. దరఖాస్తు సమర్పించే సమయంలో ఓటీపీలు తమ మొబైల్ ఫోన్లకు సకాలంలో రావడం లేదని, దీంతో దరఖాస్తు ప్రక్రియ ముగియడం లేదంటున్నారు. ఆధార్ కార్డుతో ఇంటిగ్రేట్ చేయడం కూడా సమస్యగా మారిందంటున్నారు. ఆన్ లైన్ ఫోర్టల్ లో సాంకేతిక సమస్యల కారణంగా పలువురు తహశీల్దార్ కార్యాలయాలకు ఉరుకులు పరుగులు పెడుతూ నానా యాతన పడుతున్నారు. ప్రభుత్వానికి చెందిన అన్ని విభాగాలకు కలిపి ఒకే సేవా సింధు ఆన్ లైన్ వెబ్ ఫోర్టల్ నిర్వహించడం ప్రధాన సమస్యగా మారిందని, సాంకేతికంగా సమస్యలు తలెత్తుతున్నాయని పౌరులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఒకేసారి రద్దీ పెరగడం మూలంగా ఫోర్టల్ మొరాయిస్తున్నదని అధికారులు సైతం అంగీకరిస్తున్నారు. దీంతో ఈ సమస్య నుంచి గట్టెక్కేందుకు కార్మిక శాఖ గతంలో ప్రత్యేకంగా ఒక వెబ్ ఫోర్టల్ ను ఏర్పాటు చేసుకుని, సేవా సింధు గండం నుంచి బయటపడిందని ఒక అధికారి పేర్కొన్నారు. బోగస్ ఓటర్ల ఏరివేత పేరుతో సర్ ను కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఆయుధంగా మలుచుకుందని, చట్టప్రకారం చేస్తున్నామని చెబుతూ కర్నాటకలో ఒక కోటి ఓటర్ల పేర్లను జాబితా నుంచి మాయం చేస్తున్నారని పీసీసీ అధికార ప్రతినిధి ఎం లక్ష్మణ ఆరోపించారు. ప్రక్రియ ప్రారంభం కాక ముందే ఓటర్ల మ్యాపింగ్ లో 50 లక్షల ఓట్లను మాయం చేశారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాంటి తొలగింపుల మూలంగానే పలు రాష్ట్రాలలో బీజేపీ సునాయసంగా పాగా వేసిందని ఆయన విమర్శించారు. ప్రభుత్వం జారీ చేస్తున్న శాశ్వత నివాస ధృవపత్రం, పౌరసత్వ పత్రం కాదని… నిజమైన, అర్హులైన ఓటర్ల హక్కులను కాపాడేందుకు మాత్రమే వీటిని జారీ చేస్తున్నామని అధికారులు చెబుతున్నారు.

ఇదిలా ఉండగా కర్నాటక రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి వి అన్బుకుమార్ మాట్లాడుతూ, కేంద్ర ఎన్నికల కమిషన్ చట్టాలు, మార్గదర్శకాల ప్రకారమే నడుచుకుంటున్నామని స్పష్టం చేశారు. ఓటర్ల జాబితాలో అనర్హుల పేర్లను తొలగించేందుకు అన్ని పత్రాలను పరిశీలిస్తున్నామని ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. ముసాయిదా ఓటర్ల జాబితా ప్రకటించిన తరువాత పేర్లు లేని వారు అవసరమైన డాక్యుమెంట్లు సమర్పిస్తే సరిచేసి తుది జాబితాలో చేర్చుతామని ఆయన వివరించారు.

Latest News