Working Hours | ఐటీ ఉద్యోగ సంఘం కీలక గెలుపు.. పని గంటలపై వెనక్కు తగ్గిన కాంగ్రెస్‌ ప్రభుత్వం

ఐటీ రంగంలో ఉద్యోగ సంఘాలను ఊహించలేం. కానీ.. కర్ణాటకలో ఏకైక రిజిస్టర్డ్‌ ఐటీ సంఘం కేఐటీయూ ఘన విజయం సాధించింది. పని గంటలను 12 గంటలకు పెంచాలన్న ప్రభుత్వ ప్రతిపాదనకు వ్యతిరేకంగా ఉద్యమించి.. ఆ ప్రతిపాదనను రద్దు చేయించింది.

Working Hours | ఐటీ ఉద్యోగ సంఘం కీలక గెలుపు.. పని గంటలపై వెనక్కు తగ్గిన కాంగ్రెస్‌ ప్రభుత్వం

Working Hours | ఐటీ రంగంలో కార్మిక సంఘాలు పనిచేయలేవని, పని చేసినా ప్రభుత్వాల మెడలు వంచలేదని ఇప్పటి వరకూ ఉన్న అపోహలను కర్ణాటక స్టేట్‌ ఐటీ/ఐటీఈఎస్‌ ఎంప్లాయీస్‌ యూనియన్‌ (KITU) పటాపంచలు చేసింది. ఇటీవల దక్షిణ భారత దేశంలో కీలక ఐటీ హబ్‌ (India’s IT hub) రాష్ట్రంగా ఉన్న కర్ణాటక(Karnataka)లో ప్రభుత్వం ఐటీ, ఐటీ అనుబంధ సంస్థ(IT/ITes sector)ల్లో పని గంటల పెంచేందుకు (working hours extension) ప్రతిపాదన చేసిన విషయం తెలిసిందే. దీనిపై కేఐటీయూ ఆధ్వర్యంలో ఐటీ ఉద్యోగులు పెద్ద ఎత్తున ఉద్యమించడంతో ప్రభుత్వం ఆ ప్రతిపాదనలు వెనక్కు తీసుకుంటున్నట్టు ప్రకటించింది. రాష్ట్ర అదనపు లేబర్‌ కమిషనర్‌తో సమావేశం అనంతరం తమ విజయాన్ని కేఐటీయూ మంగళవారం ప్రకటించింది. దీంతో బెంగళూరులో వేర్వేరు ప్రాంతాల్లో ఐటీ ఉద్యోగులు రోడ్లపైకి వచ్చి సంబరాలు చేసుకున్నారు.

దక్షిణ భారతదేశంలో అతిపెద్ద ఐటీ హబ్‌లలో కర్ణాటక/బెంగళూరు ఒకటి. ఇక్కడ కొన్ని వేల సంఖ్యలో ఐటీ, ఐటీ అనుబంధ సర్వీసుల కంపెనీలు ఉన్నాయి. వీటిల్లో లక్షల మంది ఐటీ ఉద్యోగులు పని చేస్తున్నారు. కర్ణాటకలో గుర్తింపు పొందిన (registered union) ఏకైక ఐటీ రంగ యూనియన్‌ కేఐటీయూ. పనిగంటలను గరిష్ఠంగా పది నుంచి 12 గంటలకు పెంచాలని కర్ణాటక ప్రభుత్వం చేసిన ప్రతిపాదనలపై కేఐటీయూ రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు చేపట్టింది. బడా కార్పొరేట్‌ కంపెనీలను మెప్పించేందుకే ప్రభుత్వం ఈ ప్రతిపాదనలు చేసిందని కేఐటీయూ పేర్కొన్నది. ఇది ఐటీ ఉద్యోగులకు ఆమోదయోగ్యం కాదని తేల్చి చెప్పింది.

వాస్తవానికి ఈ ప్రతిపాదనను 2023లో బీజేపీ నేతృత్వంలోని ప్రభుత్వ హయాంలోనే తెరపైకి తెచ్చారు. ఏకంగా 14 గంటలకు పని దినాన్ని పెంచాలని ప్రయత్నించింది. అదే ఏడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఓడిపోయి, కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చింది. అప్పటికే పనిగంటల పెంపు ప్రతిపాదనపై తీవ్ర వ్యతిరేకతలు ఉన్నప్పటికీ.. కాంగ్రెస్‌ ప్రభుత్వం కూడా అదే పని చేసేందుకు ప్రయత్నించింది. గరిష్ఠ పని గంటలను 12 గంటలకు పెంచుతూ ప్రతిపాదనలు చేసింది. ఈ మేరకు కర్ణాటక షాప్స్‌ అండ్‌ కమర్షియల్‌ ఎస్టాబ్లిష్‌మెంట్ యాక్ట్‌ 1961కు సవరణలు ప్రతిపాదించింది. దీనిపై జూన్‌ 18న అన్ని భాగస్వామ్య పక్షాలతో కాంగ్రెస్‌ ప్రభుత్వం చర్చలు జరిపింది. ఈ చర్చల సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వ ప్రతిపాదనను కేఐటీయూ తీవ్రంగా వ్యతిరేకించింది. దీన్ని అమలు చేయనిచ్చే ప్రసక్తే లేదని తేల్చి చెప్పింది. ఈ ప్రతిపాదనలు తేవడం.. కార్మికుల వ్యక్తిగత జీవితానికి సంబంధించిన ప్రాధమిక హక్కులపై దాడి చేయడమేనని పేర్కొన్నది. ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా పోరాడుతామని ప్రకటించింది.

దీనిపై పెద్ద ఎత్తున సాగిన పోరాటాలతో రాష్ట్ర ప్రభుత్వం వెనక్కు తగ్గిందని కేఐటీయూ ఒక జూలై 29న ఒక ప్రకటనలో పేర్కొన్నది. ఈ పోరాటంలో కలిసి వచ్చిన అందరు ఐటీ, ఐటీ అనుబంధ సర్వీసుల ఉద్యోగులకు కృతజ్ఞతలు తెలిపింది. ప్రభుత్వ ప్రయత్నాలకు వ్యతిరేకంగా ఐటీ ఉద్యోగులందరూ ఐకమత్యంతో నిలిచారని, అందుకే ఈ విజయం సాధ్యమైందని పేర్కొంటూ వారందరినీ అభినందించింది.

పని గంటల పెంపు ఉద్యోగుల ఆరోగ్యాలను తీవ్రంగా ప్రభావితం చేస్తుందని కేఐటీయూ వాదిస్తున్నది. దీని వల్ల ఉత్పాదకత కూడా తగ్గిపోతుందని ఆందోళన వ్యక్తం చేసింది. దీర్ఘకాలం పని చేయడం వల్ల ప్రతికూల ఫలితాలు వస్తాయని, ఉద్యోగుల ఆరోగ్యాలు నాశనమవుతాయని అనేక అధ్యయనాలు చెబుతున్నప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం మూర్ఖంగా ఈ విషయంలో ముందుకు వెళ్లేందుకు ప్రయత్నించిందని కేఐటీయూ నాయకులు పేర్కొన్నారు.

భారతదేశంలో ఐటీ రంగంలో పనిచేస్తున్న ఉద్యోగుల్లో 90 శాతం మంది 25 ఏళ్లలోపు వారేనని కొన్ని అధ్యయనాలు సూచిస్తున్నాయి. వారు పని ఒత్తిడితో తీవ్ర మానసిక ఆందోళనకు గురవుతున్నారు. కొంత మంది తీవ్ర మానసిక అనారోగ్యాలను కూడా ఎదుర్కొంటున్నారు. ఉత్పాదకత పెంపు, వర్కర్ల ఆరోగ్యం దృష్టిలో ఉంచుకుని ప్రపంచ వ్యాప్తంగా అనేక కంపెనీలు పని గంటలను తగ్గించుకుంటూ వెళుతున్న విషయాన్ని కేఐటీయూ ఎత్తిచూపుతున్నది.

భారతదేశపు అతిపెద్ద సాఫ్ట్‌వేర్‌ కంపెనీ టీసీఎస్‌ ఒకేసారి వేల సంఖ్యలో ఉద్యోగులను తొలగించడంపై కూడా కేఐటీయూ పోరాటం చేస్తున్నది.