maharastra | అసైన్డ్‌ భూములపై ఆంక్షల ఎత్తివేత.. మహారాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం

అసైన్డ్‌ భూముల విషయంలో మహారాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్నది. మరఠ్వాడా ప్రాంత ఎనిమిది జిల్లాల పరిధిలో 1.4 లక్షల ఎకరాల అసైన్‌మెంట్‌ భూములను (క్లాస్‌-2) విముక్తి చేస్తూ మహారాష్ట్ర మంత్రిమండలి మంగళవారం నిర్ణయం తీసుకుంది.

  • By: Subbu |    national |    Published on : Aug 13, 2024 7:56 PM IST
maharastra | అసైన్డ్‌ భూములపై ఆంక్షల ఎత్తివేత.. మహారాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం

మరఠ్వాడాలోని ఎనిమిది జిల్లాల్లో విముక్తి

ముంబై: అసైన్డ్‌ భూముల విషయంలో మహారాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్నది. మరఠ్వాడా ప్రాంత ఎనిమిది జిల్లాల పరిధిలో 1.4 లక్షల ఎకరాల అసైన్‌మెంట్‌ భూములను (క్లాస్‌-2) విముక్తి చేస్తూ మహారాష్ట్ర మంత్రిమండలి మంగళవారం నిర్ణయం తీసుకుంది. ఈ భూములను కలిగిన వారు ఇకపై స్వేచ్ఛగా వినియోగించుకోవచ్చు. అభివృద్ధి చేసుకోవచ్చు. క్లాస్‌-2 భూములకు శాశ్వత పట్టాలు ఇవ్వాలని గత ఆరు దశాబ్దాలుగా స్థానిక ప్రజలు డిమాండ్‌ చేస్తున్నారు. ఆధ్యాత్మిక కేంద్రాల నిర్వహణ (దేవాదాయ భూములు), బహుమానం వంటి రకరకాల కారణాల కింద పౌరులకు ఇచ్చిన భూములను క్లాస్‌-2 భూములుగా పరిగణిస్తారు. ఈ భూములను పొందినవారు అనుభవించడం తప్ప అమ్ముకోవడానికి వీలు లేదు. ప్రభుత్వం ఇప్పుడా ఆంక్షలనుంచి ఈ భూములను విడుదల చేసిందని ఉన్నతాధికార వర్గాలు తెలిపాయి. ఈ భూములన్నీ హైదరాబాద్‌ రాష్ట్రం నుంచి విడివడి మహారాష్ట్రలో కలిసిన జిల్లాల పరిధిలో ఉన్నాయి. ఈ భూములపై శాశ్వత హక్కులు పొందడానికి ప్రభుత్వానికి ఇప్పుడున్న విలువలో ఐదు శాతం మాత్రం ప్రభుత్వానికి చెల్లించాల్సి ఉంటుందని ఆ వర్గాలు తెలిపాయి. సీనియర్‌ ఐఎఎస్‌ అధికారి అవినాశ్‌ పాఠక్‌ కమిటీ ఇచ్చిన నివేదిక ప్రాతిపదికగా ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.