Own house | కేంద్ర ప్రభుత్వ పథకంతో సొంతింటి కల సాకారం.. దరఖాస్తు ఇలా..!

Own house : కేంద్ర ప్రభుత్వం అమలుచేస్తున్న 'ప్రధానమంత్రి ఆవాస్ యోజన (PMAY)' ద్వారా మీ సొంతింటి కలను సాకారం చేసుకోవచ్చు. చాలామందికి సొంతిల్లు కట్టుకోవాలనే కోరిక ఉంటుంది. కానీ అందుకుతగ్గ ఆర్థికస్తోమత లేక ఎక్కువమంది ఆ కలను సాకారం చేసుకోలేక పోతుంటారు. అలాంటి వారి కోసమే కేంద్ర ప్రభుత్వం పీఎంఏవై స్కీమ్‌ను తీసుకొచ్చింది.

Own house | కేంద్ర ప్రభుత్వ పథకంతో సొంతింటి కల సాకారం.. దరఖాస్తు ఇలా..!

Own house : కేంద్ర ప్రభుత్వం అమలుచేస్తున్న ‘ప్రధానమంత్రి ఆవాస్ యోజన (PMAY)’ ద్వారా మీ సొంతింటి కలను సాకారం చేసుకోవచ్చు. చాలామందికి సొంతిల్లు కట్టుకోవాలనే కోరిక ఉంటుంది. కానీ అందుకుతగ్గ ఆర్థికస్తోమత లేక ఎక్కువమంది ఆ కలను సాకారం చేసుకోలేక పోతుంటారు. అలాంటి వారి కోసమే కేంద్ర ప్రభుత్వం పీఎంఏవై స్కీమ్‌ను తీసుకొచ్చింది. పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లోని పేదలకు కేంద్రం ఈ పథకం ద్వారా ఇళ్లు నిర్మిస్తోంది. ఈ పథకం ఏమిటి..? దీనికి ఎవరు అర్హులు..? ఎలా దరఖాస్తు చేసుకోవాలి అనే వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..

పథకం ఏమిటి..?

దేశంలోని ప్రతి ఒక్కరికీ సొంతింటి సదుపాయం కల్పించాలనే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం 2015-16లో ఈ పథకాన్ని తీసుకొచ్చింది. దీని ద్వారా పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లోని పేద ప్రజలకు మౌలిక వసతులతో కూడిన ఇళ్లు నిర్మించి ఇస్తారు. ఈ పథకం కింద లబ్ధిదారులకు రూ.6.50 శాతం వార్షిక వడ్డీ రేటుతో రుణం లభిస్తుంది. ఈ పథకం కింద గత పదేళ్లలో దాదాపు 4.21 కోట్ల ఇళ్లను నిర్మించారు. మరోసారి అధికారంలోకి వచ్చిన ఎన్డీయే ప్రభుత్వం మరో 3 కోట్ల ఇళ్లు నిర్మించాలని ఇప్పటికే నిర్ణయం తీసుకుంది. తొలి కేబినెట్ సమావేశంలోనే ఈ నిర్ణయం చేశారు.

ఈ పథకం కింద నిర్మించే ఇంటిలో తప్పనిసరి అవసరమయ్యే అన్ని రకాల మౌలిక వసతులు ఉంటాయి. టాయిలెట్ వసతి, ఎల్‌పీజీ కనెక్షన్, విద్యుత్ కనెక్షన్, నీటి సౌకర్యం ఉంటుంది. ప్రధాన మంత్రి ఆవాస్ యోజనలో అర్బన్‌, రూరల్ అనే రెండు రకాలు ఉంటాయి. లబ్ధిదారుల వార్షిక ఆదాయం ఆధారంగా ఈ పథకాన్ని 4 కేటగిరీలుగా విభజించారు. ఆ నాలుగు కేటగిరీలు కింది విధంగా ఉన్నాయి.

1. ఆర్థికంగా వెనుకబడిన తరగతి (EWS) – రూ.3 లక్షల వరకు ఆదాయం
2. తక్కువ ఆదాయ సమూహం (LIG) – రూ.3 లక్షలు – రూ.6 లక్షల ఆదాయం
3. మధ్య ఆదాయ సమూహం-1 (MIG-1) – రూ.6 లక్షలు – రూ.12 లక్షల ఆదాయం
4. మధ్య ఆదాయ సమూహం-2 (MIG-2) – రూ.12 లక్షలు – రూ.18 లక్షల ఆదాయం

ఎవరు అర్హులు..?

ఈ పథకం కింద లబ్ధి పొందగోరే వ్యక్తి భారతదేశ నివాసి అయి ఉండాలి. ఇప్పటికే శాశ్వత ఇల్లు ఉండి ఉండకూడదు. వయస్సు 18 ఏళ్లు పైబడి ఉండాలి. లబ్ధిదారుని పేరు రేషన్‌కార్డు లేదా PBL జాబితాలో ఉండాలి. లబ్ధిదారుడు తన పేరును ఎలక్టోరల్ రోల్‌లో నమోదు చేసుకోవాలి. అలాగే ఏదైనా చెల్లుబాటు అయ్యే గుర్తింపు కార్డు కలిగి ఉండాలి. లబ్ధిదారుని కుటుంబంలో ఎవరికీ ప్రభుత్వ ఉద్యోగం ఉండకూడదు.

దరఖాస్తు ఎలా..?

ముందుగా అధికారిక వెబ్‌సైట్ https://pmaymis.gov.in/ ను సందర్శించాలి. హోమ్‌పేజీలో కనిపించే ‘PM Awas Yojana’ పై క్లిక్ చేయాలి. ఇక్కడ అవసరమైన సమాచారాన్ని, పేరును నమోదు చేసుకోవాలి. అవసరమైన పత్రాలను అప్‌లోడ్ చేయాలి. వివరాలను ఒకసారి తనిఖీ చేసుకుని సబ్మిట్‌ ఆప్షన్‌పై క్లిక్‌ చేయాలి. ఆన్‌లైన్‌లోగాక ఆఫ్‌లైన్‌లో కూడా ఈ పథకం కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. అవసరమైన పత్రాలతో సమీపంలోని సాధారణ సేవా కేంద్రాన్ని సందర్శించాలి. మరింత సమాచారం కోసం 1800-11-3377, 1800-11-3388 నంబర్లకు కాల్ చేయాలి.

దరఖాస్తు అవసరమైన డాక్యుమెంట్స్‌

1. ఆధార్ కార్డు
2. దరఖాస్తుదారు ఫోటో
3. లబ్ధిదారుని జాబ్ కార్డు
4. బ్యాంకు పాస్ బుక్
5. స్వచ్ఛ భారత్ మిషన్ రిజిస్ట్రేషన్ నెంబర్‌
6. మొబైల్ నెంబర్‌