మోదీ ప్రజలకు దూరమయ్యారు.. మండిపడ్డ ప్రియాంక గాంధీ
పదేండ్లు అధికారం అనుభవించిన ప్రధాని నరేంద్ర మోదీ ప్రజలకు దూరమయ్యారని, వారి సమస్యలను పట్టించుకోవడం లేదని కాంగ్రెస్ పార్టీ జనరల్ సెక్రటరీ ప్రియాంక గాంధీ వాద్రా నిప్పులు చెరిగారు
జైపూర్ : పదేండ్లు అధికారం అనుభవించిన ప్రధాని నరేంద్ర మోదీ ప్రజలకు దూరమయ్యారని, వారి సమస్యలను పట్టించుకోవడం లేదని కాంగ్రెస్ పార్టీ జనరల్ సెక్రటరీ ప్రియాంక గాంధీ వాద్రా నిప్పులు చెరిగారు. రాజస్థాన్ మాజీ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ కుమారుడు వైభవ్ గెహ్లాట్ జలోర్ లోక్‌సభ స్థానం నుంచి పోటీ చేస్తున్నారు. ఈ క్రమంలో జలోర్‌లో నిర్వహించిన కాంగ్రెస్ ర్యాలీలో ప్రియాంక గాంధీ పాల్గొని ప్రసంగించారు. ఈ పదేండ్లు అధికారాన్ని అనుభవించిన మోదీ.. ఎవరి మాట వినడం లేదని, ఆయనకు చెప్పేందుకు ఎవరూ సాహసం చేయడం లేదని ప్రియాంక పేర్కొన్నారు. దేశంలో నెలకొన్న నిజమైన పరిస్థితిని మోదీకి వివరించేందుకు కూడా ఆయన చుట్టు ఉన్న వారు భయపడుతున్నారని పేర్కొన్నారు.
దేశంలో ద్రవ్యోల్బణం అతి పెద్ద సమస్యగా మారిందన్నారు. ఆ సమస్యను మోదీ అర్థం చేసుకోవడం విఫలమయ్యారు. ఇక అధికారులు, నాయకుల మాట కూడా మోదీ వినిపించుకోవడం లేదన్నారు. ఇవాళ నరేంద్ర మోదీ దేశ ప్రజలకు దూరమయ్యారని భావిస్తున్నానని ప్రియాంక పేర్కొన్నారు. ప్రస్తుతం దేశంలో ద్రవ్యోల్బణం, నిరుద్యోగం అతి పెద్ద సమస్యలుగా మారాయన్నారు. కానీ ఈ రెండు సమస్యలను పట్టించుకునే నాథుడే లేకుండా పోయాడని ఆమె అసహనం వ్యక్తం చేశారు. జీ20 సమ్మిట్ జరిగినప్పుడు చాలా గొప్పగా ఫీలయ్యాం. ఎందుకంటే ఆ సమ్మిట్‌కు ఇండియా వేదికైనందుకు. కానీ వాస్తవానికి వస్తే ద్రవ్యోల్బణంతో పేద ప్రజలు, నిరుద్యోగంతో యువత బాధపడుతున్నారని ప్రియాంక గాంధీ ధ్వజమెత్తారు. ప్రస్తుత బీజేపీ ప్రభుత్వం అవినీతికి వ్యతిరేకంగా పోరాడడం లేదన్నారు. కేవలం నోటి మాటలకే అవినీతి కట్టడి పరిమితమైందన్నారు. ఇక దేశంలోని ప్రతిపక్షాలను బీజేపీ టార్గెట్ చేసి కుట్ర రాజకీయాలు చేస్తుందని ప్రియాంక మండిపడ్డారు.
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram