Trump Nobel dream | చెదిరిన ట్రంప్ నోబెల్ కల : మోదీ కాదనడంతోనే 50% సుంకాలు – న్యూయార్క్ టైమ్స్
ట్రంప్ నోబెల్ కోరికను మోదీ తిరస్కరించడంతో అమెరికా–భారత్ సంబంధాలు కఠినతరమయ్యాయని న్యూయార్క్ టైమ్స్ వెల్లడించింది. ఆ తర్వాతే ట్రంప్ భారత్‌పై 50% దిగుమతి సుంకాలు విధించినట్లు రిపోర్ట్ పేర్కొంది.

Modi’s ‘No’ to Trump’s Nobel Dream Triggers 50% Tariffs on India – New York Times Report
న్యూఢిల్లీ, అక్టోబర్ 10 (విధాత):
భారత్–అమెరికా సంబంధాలు ఇటీవల క్షీణించడానికి ప్రధాన కారణం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నోబెల్ కోరిక అని న్యూయార్క్ టైమ్స్ సంచలన కథనం వెల్లడించింది.
భారత్–పాకిస్తాన్ కాల్పుల విరమణలో అమెరికా పాత్ర లేదని మోదీ స్పష్టం – ట్రంప్ అసహనం
ఆ పత్రిక కథనం ప్రకారం, జూన్ 17న జరిగిన ఒక ఫోన్ కాల్‌లో ట్రంప్ భారత ప్రధాని నరేంద్ర మోదీ మాట్లాడుతూ, “భారత్–పాకిస్తాన్ మధ్య సైనిక ఘర్షణను నేను పరిష్కరించాను. అందుకే పాకిస్తాన్ నన్ను నోబెల్ శాంతి బహుమతికి నామినేట్ చేయనుంది. భారత్ కూడా అలానే చేయాలి” అని అనగా, తక్షణమే భారత ప్రధాని స్పందిస్తూ, “భారత్–పాకిస్తాన్ కాల్పుల విరమణ పూర్తిగా ఇరు దేశాల మధ్యే జరిగింది. అమెరికా దీనిలో ఎలాంటి పాత్ర పోషించలేదు” అని విస్పష్టంగా చెప్పారు. ఆ సమాధానం ట్రంప్‌కు తీవ్ర అసహనాన్ని కలిగించిందని కథనం పేర్కొంది. అయినప్పటికీ ట్రంప్ ఆ తర్వాత కూడా పబ్లిక్‌గా తానే కాల్పుల విరమణ సాధించానని పలుమార్లు వ్యాఖ్యానించడంతో, న్యూఢిల్లీ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది.
ఈ సంభాషణ తర్వాత ఇరువురు నాయకులు మళ్లీ మాట్లాడుకోలేదని న్యూయార్క్ టైమ్స్ తెలిపింది. ఇదే విషయంపై బ్లూమ్‌బర్గ్ కూడా ఓ వార్తను ప్రచురించింది. ఆ పత్రిక కథనాన్ని బట్టి, ఆ కాల్ సుమారు 35 నిమిషాలపాటు సాగిందని, ఆ సమయంలో మోదీ ట్రంప్ వ్యాఖ్యలను నిర్ద్వందంగా తిరస్కరించి, భారత్ ఎప్పటికీ మధ్యవర్తిత్వాన్ని అంగీకరించదని చాలా కఠినంగా చెప్పారని వివరించింది. ఆ ఫోన్ సంభాషణకు ముందు ట్రంప్ మోదీని వైట్ హౌస్‌కు ఆహ్వానించి, పాకిస్తాన్ సైన్యాధ్యక్షుడు అసిం మునీర్‌తో డిన్నర్ ఏర్పాటు చేయాలనుకున్నారని, ఆ విషయం ముందే తెలుసుకున్న మోదీ, వైట్‌హౌస్ ఆహ్వానాన్నిసున్నితంగా తిరస్కరించి, క్రొయేషియా పర్యటనను ప్రాధాన్యంగా నిర్ణయించారు.
తర్వాతే దిగుమతులపై భారీ సుంకాలు – వీసా పరిమితులు
న్యూయార్క్ టైమ్స్ కథనం ప్రకారం, ఈ సంఘటనల తర్వాతే ట్రంప్ భారత్‌పై ఆర్థిక ఒత్తిడి తెచ్చారు. ముందుగా ఆయన భారత దిగుమతులపై 25 శాతం సుంకాలు విధించగా, ఆపై వాటిని 50 శాతానికి పెంచారు. ఈ నిర్ణయం భారత్ రష్యా చమురు కొనుగోళ్లను సాకుగా చూపి తీసుకున్నదని పేర్కొంది. ఈ సుంకాల పెంపుతో భారత ఎగుమతులపై తీవ్రమైన ప్రభావం పడిందని ఆర్థిక వర్గాలు చెబుతున్నాయి. వాణిజ్య పరిమితులతోపాటు, ట్రంప్ పరిపాలనా విభాగం భారతీయ వీసాదారులపై కూడా కఠిన చర్యలు తీసుకుందని పత్రిక వెల్లడించింది. H-1B వీసా పరిశీలన కఠినతరం చేయడం, విద్యార్థుల వీసాలపై పరిమితులు, అక్రమ వలసదారుల తరలింపు — ఇవన్నీ భారత్‌పై మరింత ఒత్తిడి తెచ్చే చర్యలేనని NYT అభిప్రాయపడింది.
ఈ పరిణామాల మధ్య ప్రధానమంత్రి మోడి చైనా పర్యటనకు వెళ్లి అధ్యక్షుడు జిన్‌పింగ్, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌లను కలవడం అంతర్జాతీయ వేదికపై చర్చనీయాంశమైంది. నిపుణుల అభిప్రాయం ప్రకారం, అమెరికాతో సంబంధాలు మసకబారుతున్న వేళ భారత్ తూర్పు వైపు దౌత్య సమీకరణాలను బలోపేతం చేసుకుంటోందనే సంకేతాలివి.
అమెరికా–భారత్ మధ్య ఉత్కంఠ కొనసాగుతున్న నేపథ్యంలో, ఈ న్యూయార్క్ టైమ్స్ రిపోర్ట్ రెండు దేశాల మధ్య ఉన్న సున్నిత సంబంధాలపై కొత్త చర్చకు దారితీసింది. మోడి ట్రంప్ నోబెల్ కలను తిరస్కరించిన ఫోన్‌కాల్ ఇప్పుడు భారత్–అమెరికా దౌత్య చరిత్రలో కీలక మలుపుగా నిలుస్తోంది.