• Telugu News
  • /National

లొంగిపోనున్న మోస్ట్‌ వాంటెడ్‌ మావోయిస్టు పాపారావు

మోస్ట్ వాంటెడ్ మావోయిస్టు పాపారావు లొంగుబాటుకు సిద్ధం. ఆపరేషన్ కగార్ డెడ్‌లైన్ దగ్గరపడుతుండగా భద్రతా బలగాల ఒత్తిడితో కీలక పరిణామం.

Reported by: Tejaswini Nanna | జాతీయం | Mar 24, 2026, 1:10 pm IST
Read Time: 4 mins
లొంగిపోనున్న మోస్ట్‌ వాంటెడ్‌ మావోయిస్టు పాపారావు

విధాత : మావోయిస్టుల లొంగుబాటుకు సంబంధించి కేంద్రం విధించిన మార్చి 31వ తేదీ డెడ్ లైన్ దగ్గర పడుతున్న వేళ మావోయిస్టు పార్టీ మరో కీలక నేత లొంగుబాటుకు సిద్దమయ్యారు. మోస్ట్‌ వాంటెడ్‌ మావోయిస్టు, పశ్చిమ బస్తర్‌ డివిజన్‌ కమాండర్‌ పాపారావు ఎలియాస్‌ సున్నం చంద్రయ్య లొంగుబాటుకు సిద్ధమైనట్లు సమాచారం. సుమారు 17 మంది సహచరులతో కలిసి పాపారావు బీజాపూర్‌ ఎస్పీ ఎదుట లొంగిపోనున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు మధ్యవర్తులు ఛత్తీస్‌గఢ్‌లోని నేషనల్‌ పార్క్‌ అటవీ ప్రాంతంలోకి వెళ్లి పాపారావు బృందంతో చర్చలు జరిపినట్లుగా సమాచారం. పాపారావు కోసం భద్రతా బలగాలు ప్రత్యేక కూంబింగ్ ఆపరేషన్ చేపడుతూనే.. అతని లొంగుబాటుకు ప్రయత్నాలు చేయడం విశేషం.

దగ్గర పడుతున్న డెడ్ లైన్

దేశంలో మావోయిస్టుల నిర్మూలన లక్ష్యంతో కేంద్రం చేపట్టిన ఆపరేషన్ కగార్ గడువు మార్చి 31తో ముగియ్యనుంది. ఇప్పటికే ఆపరేషన్ కగార్ లో భాగంగా కీలక నేతలతో పాటు వందలాది మంది మావోయిస్టులు ఎన్ కౌంటర్లలో హతమవ్వడం లేదా లొంగిపోవడం, అరెస్టవ్వడం జరిగింది. కేంద్రం డెడ్ లైన్ దగ్గరపడుతున్న వేళ మావోయిస్టు పార్టీ అగ్రనేతలు దేవ్ జీ, మల్లోజుల వేణుగోపాల్ సహా చాలమంది అగ్రనేతలు తమ అనుచరులతో కలిసి లొంగిపోయారు. అయితే ఇంకా అజ్ఞాతంలో జర్ఖండ్ కు చెందిన మిసెల్ బెస్రా, తెలంగాణకుచెందిన మావోయిస్టు పార్టీ మాజీ చీఫ్ గణపతి, నరహరి, పాపారావు వంటి అగ్రనేతలు ఉండిపోయారు. వీరిలో గణపతి, నరహరి ఆచూకీ సమాచారం భద్రతా బలగాలకు అందకపోవడంతో…తమ రాడార్ లో ఉన్న పాపారావు లొంగుబాటు కోసం ప్రయత్నించి చివరకు సఫలీకృతమైనట్లుగా తెలుస్తుంది. అటు మిసెల్ బెస్రా లొంగుబాటు లేదా ఎన్ కౌంటర్ కోసం భద్రతా బలగాలు తీవ్రంగా ప్రయత్నిస్తున్నాయి. మార్చి 31లోగా లొంగిపోని వారిని ఎన్ కౌంటర్లతో ఏరివేయక తప్పదని భద్రతాధికారులు స్పష్టం చేస్తున్నారు.

ఇవి కూడా చదవండి :

క్రైస్తవంలోకి మారితే ఎస్సీ హక్కులు పొందలేరు: సుప్రీంకోర్టు
Cabinet Meeting | తెలంగాణ హేట్ స్పీచ్ తో పాటు పలు బిల్లులకు ఆమోదం.. అసెంబ్లీ ఆవరణ లో మంత్రి మండలి భేటీ