Ashok Mahto | ఎన్నిక‌ల్లో పోటీ కోసం 62 ఏండ్ల వ‌య‌సులో పెళ్లి.. కానీ ఓట‌మి పాలైన భార్య‌

Ashok Mahto | బీహార్‌కు చెందిన‌ క‌రుడుగ‌ట్టిన నేర‌స్థుడు అశోక్ మ‌హ‌తో 62 ఏండ్ల వ‌య‌సులో వివాహం చేసుకుని భార్య‌ను లోక్‌స‌భ ఎన్నిక‌ల్లో పోటీ చేయించారు. కానీ ఆమె ఓట‌మి పాల‌య్యారు. ఈ వ‌య‌సులో పెళ్లి చేసుకున్నా లాభం లేకుండా పోయింది ఆ నేర‌స్థుడికి.

  • By: raj |    national |    Published on : Jun 05, 2024 8:09 AM IST
Ashok Mahto | ఎన్నిక‌ల్లో పోటీ కోసం 62 ఏండ్ల వ‌య‌సులో పెళ్లి.. కానీ ఓట‌మి పాలైన భార్య‌

Ashok Mahto | పాట్నా : చాలా నియోజ‌క‌వ‌ర్గాల్లో భ‌ర్త‌ల ప్రాబ‌ల్యం అత్య‌ధికంగా ఉన్నప్ప‌టికీ.. అక్క‌డ మాత్రం వుమెన్ రిజ‌ర్వ్‌డ్ స్థానాలు ఉంటాయి. అలాంట‌ప్పుడు భ‌ర్త‌లు త‌మ భార్య‌ల‌ను పోటీలో నిల‌బెడుతారు. ఇక భార్య‌ల గెలుపు కోసం భ‌ర్త‌లు ప‌డ‌రాని కష్టాలు ప‌డుతుంటారు. అలా చాలా మంది భ‌ర్త‌లు త‌మ భార్య‌ల‌ను గెలిపించుకున్న సంద‌ర్భాలు ఉన్నాయి.

అయితే బీహార్‌కు చెందిన‌ క‌రుడుగ‌ట్టిన నేర‌స్థుడు అశోక్ మ‌హ‌తో 62 ఏండ్ల వ‌య‌సులో వివాహం చేసుకుని భార్య‌ను లోక్‌స‌భ ఎన్నిక‌ల్లో పోటీ చేయించారు. కానీ ఆమె ఓట‌మి పాల‌య్యారు. ఈ వ‌య‌సులో పెళ్లి చేసుకున్నా లాభం లేకుండా పోయింది ఆ నేర‌స్థుడికి.

బీహార్‌లోని ముంగేర్ నియోజ‌క‌వ‌ర్గంలో జేడీయూ అభ్య‌ర్థి రాజీవ్ రాజ‌న్ సింగ్ అలియాస్ ల‌లాన్ సింగ్ 80 వేల ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. ల‌లాన్ సింగ్ చేతిలో అశోక్ మ‌హ‌తో భార్య‌, ఆర్జేడీ నాయ‌కురాలు కుమారి అనిత ఓట‌మి పాల‌య్యారు. ల‌లాన్ సింగ్‌కు 5,50,146 ఓట్లు పోల‌వ్వ‌గా, అనిత‌కు 4,69,276 ఓట్లు వ‌చ్చాయి. ముంగేర్ నుంచి ల‌లాన్ సింగ్ గెలుపొంద‌డం వ‌రుస‌గా రెండోసారి.

ఎవ‌రీ అశోక్ మ‌హ‌తో..?

బీహార్‌లోని న‌వాదా జిల్లాలోని కోన‌న్‌పూర్ గ్రామానికి చెందిన అశోక్ మ‌హ‌తో గ్యాంగ్‌స్ట‌ర్‌. షేక్‌పురా జేడీయూ ఎమ్మెల్యే ర‌ణ‌ధీర్ కుమార్ సోనీపై హ‌త్యాయ‌త్నం ఆరోప‌ణ‌ల‌తో పాటు న‌వాదా జైలు బ‌ద్ద‌లుగొట్టిన కేసులో నేర‌స్థుడిగా 17 ఏండ్ల పాటు జైలు శిక్ష అనుభ‌వించాడు. గ‌తేడాది జైలు నుంచి బ‌య‌ట‌కు వ‌చ్చాడు. ఈ ఎన్నిక‌ల్లో ఆర్జేడీ అభ్య‌ర్థిగా ముంగేర్ నియోజ‌క‌వ‌ర్గం నుంచి పోటీకి సిద్ధ‌మ‌య్యాడు అశోక్ మ‌హ‌తో. దోషిగా తేలిన నేరస్థుడు, శిక్షాకాలం ముగిసిన తర్వాత ఆరేళ్లపాటు ఎన్నికల్లో పోటీ చేయకుండా చట్టం నిషేధించింది. దీంతో లాలు ప్ర‌సాద్ యాద‌వ్ సూచ‌న మేర‌కు అశోక్ పెళ్లి చేసుకోవాల‌నుకున్నాడు. ముంగేర్ బరియాపూర్ గ్రామానికి చెందిన అనిత‌(46)ను ఈ ఏడాది మార్చిలో వివాహం చేసుకున్నాడు. ఆమె ఢిల్లీలోని ఓ ప్ర‌యివేటు సంస్థ‌లో ప‌ని చేసేది.