ఓలా సీఈవో భవీశ్‌పై వేధింపులొద్దు.. కర్ణాటక హైకోర్టు ఆదేశం
ఓలా ఎలక్ట్రిక్ కంపెనీ ఉద్యోగి ఆత్మహత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఓలా సీఈవో భవీశ్ అగర్వాల్‌ను వేధింపులకు గురిచేయరాదని కర్ణాటక హైకోర్టు పోలీసులను ఆదేశించింది.

ఓలా ఎలక్ట్రిక్ కంపెనీ ఉద్యోగి ఆత్మహత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఓలా సీఈవో భవీశ్ అగర్వాల్‌ను వేధింపులకు గురిచేయరాదని కర్ణాటక హైకోర్టు పోలీసులను ఆదేశించింది. బెంగళూరు నగరంలోని సుబ్రహ్మణ్యపుర పోలీసు స్టేషన్‌లో భవీశ్‌పై ఎఫ్ఐఆర్ నమోదు అయ్యింది. ఘటనకు సంబంధించి ఫిర్యాదు అందడంతో పోలీసులు కేసు నమోదు చేసి విచారిస్తున్నారు.
కంపెనీ యాజమాన్యం కొద్ది నెలలుగా కే అరవింద్ (38) అనే ఉద్యోగి కి జీతం ఇవ్వకుండా మానసికంగా వేధింపులకు పాల్పడుతున్నదనే ఆరోపణలు ఉన్నాయి. 2022 నుంచి అరవింద్ హోమోలోగేషన్ ఇంజనీర్ గా పనిచేస్తున్నాడు. ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకోకపోవడంతో అరవింద్ సెప్టెంబర్ 28వ తేదీ చిక్కలసండ్రలోని తన నివాసంలో ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడని బంధువులు చెబుతున్నారు. వెంటనే కుటుంబ సభ్యులు అతన్ని మహారాజా అగ్రసేన్ హాస్పిటల్ కు తరలించగా, చికిత్స పొందుతూ మరణించాడు.
ఈ ఘటనపై ఆయన సోదరుడు అశ్విన్ కన్నన్ పోలీసు స్టేషన్ లో ఫిర్యాదు చేయగా, భవీశ్ అగర్వాల్ పై ఎఫ్ఐఆర్ నమోదు అయింది. అయితే తన మూడేళ్ల ఉద్యోగంలో ఏనాడు కూడా అరవింద్ తనకు ఎదురైన సమస్యలపై ఫిర్యాదు చేయలేదని కంపెనీ యాజమాన్యం పోలీసులకు తెలిపింది. కంపెనీ యాజమాన్యంతో ఆయనకు ప్రత్యక్ష సంబంధాలు కూడా ఉండవని, అలాంటప్పుడు వేధింపులు ఎలా ఉంటాయని అభ్యంతరం వ్యక్తం చేశారు. ఆత్మహత్య చేసుకున్న తరువాత కుటుంబ సభ్యులకు సానుభూతి తెలియచేయడంతో పాటు అతనికి చెందాల్సిన మొత్తాన్ని కూడా చెల్లించినట్లు కంపెనీ ప్రతినిధులు తెలిపారు. తమ యజమాని భవీశ్‌పై నమోదు చేసిన ఎఫ్ఐఆర్‌ను సవాల్ చేస్తూ కర్ణాటక హైకోర్టులో కేసు వేయగా, వేధింపులకు గురి చేయవద్దని పోలీసులను ఆదేశిస్తూ ఉత్తర్వులు ఇచ్చారని పేర్కొన్నారు.