25న వన్ నేషన్.. వన్ ఎలక్షన్ కమిటీ మలి భేటీ
విధాత : ‘ఒక దేశం ఒకే ఎన్నికలు’ నిర్వహణపై విధివిధానాలను పరిశీలించేందుకు ఏర్పాటు చేసిన కమిటీ తదుపరి సమావేశం ఈనెల 25న జరుగనుంది. కమిటీ తొలి భేటీ మాజీ రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ అధ్యక్షతన గత నెలలో జరిగింది. హోంమంత్రి అమిత్‌షా, న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ సహా కమిటీ సభ్యులు ఈ సమావేశానికి హాజరయ్యారు.
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వన్ నేషన్ వన్ ఎలక్షన్ కోసం ఆసక్తి చూపుతుండటంతో ఈ దిశగా సాధ్యాసాధ్యాలపై రామ్‌నాథ్ కోవింద్ కమిటీ వేశారు. ఏకకాలంలో అటు పార్లమెంటు, ఇటు రాష్ట్ర అసెంబ్లీలకు ఎన్నికలు జరగడం వల్ల ఆర్థిక భారం తగ్గుతుందని, పథకాల అమలు సమర్ధవంతంగా నిర్వహించేందుకు వీలవుతుందని మోడీ చెబుతున్నారు.
గతంలో జమిలి ఎన్నికల సాధ్యాసాధ్యాలను లా కమిషన్, నీతి ఆయోగ్, పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ చర్చించాయి. కాగా రామ్‌నాథ్ కమిటీ నివేదిక వచ్చాక పబ్లిక్ డొమైన్‌లో చర్చకు ఉంచుతామని, నివేదిక పార్లమెంటుకు రాగానే దానిపై చర్చిస్తామని గతంలో పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి ప్రహ్లాద్ జోషి ప్రకటించారు.
రామ్‌నాథ్ కమిటీలో హోం మంత్రి అమిత్‌షా, కాంగ్రెస్ ఎంపీ అధీర్ రంజన్ చౌదరి, రాజ్యసభ మాజీ ఎంపీ గులాం నబీ ఆజాద్, మాజీ ఫైనాన్స్ కమిషన్ చైర్మన్ ఎన్‌కే సింగ్, లోక్‌సభ మాజీ సెక్రటరీ జనరల్ సుభాష్ సి.కశ్యప్, సీనియర్ న్యాయవాది హరీష్ సాల్వే, మాజీ చీఫ్ విజిలెన్స్ కమిషర్ సంజయ్ కొఠారీ ఈ కమిటీలో సభ్యులుగా ఉన్నారు. న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘవాల్ ప్రత్యేక ఆహ్వానితుడిగా హాజరవుతారు.
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram