Operation Sindoor | “రా” అధినేతగా ఆపరేషన్ సిందూర్ వ్యూహకర్త
Operation Sindoor | దేశ గూఢచార వ్యవస్థలో కీలక మార్పుకు నాంది పలుకుతూ, సీనియర్ ఐపీఎస్ అధికారి పరాగ్ జైన్‌ను భారత రీసెర్చ్ అండ్ అనాలసిస్ వింగ్ (‘రా’) కొత్త చీఫ్‌గా నియమించారు. ఇది దేశ భద్రత, అంతర్జాతీయ ముప్పుల నేపథ్యంలో అత్యంత ప్రాధాన్యత గల నియామకం. పరాగ్ జైన్(Parag Jain) నియామకం వెనుక ఆయన అనుభవం, సమర్థత, మరియు ఇటీవల విజయవంతంగా నిర్వహించిన ‘ఆపరేషన్ సిందూర్’ముఖ్యపాత్ర పోషించాయి.

Operation Sindoor | 2025 ఏప్రిల్ 22న జమ్మూ కాశ్మీర్‌లోని పహల్గామ్ ప్రాంతంలో పర్యాటకులపై ఉగ్రదాడిలో 26 మంది అమాయకులు హతమయ్యారు. ఈ దాడికి పాక్‌కు చెందిన ఉగ్రవాదముఠాలను భారత ప్రభుత్వం బాధ్యులుగా గుర్తించింది. అనంతరం ఆపరేషన్ సిందూర్(Operartion Sindoor) పేరుతో భారత్ పాక్ అంచులదాకా వెళ్లి ఘాటైన ప్రతీకారం తీసుకుంది. నాలుగు రోజులపాటు సాగిన దాడుల తర్వాత మే 10న కాల్పుల విరమణ ఒప్పందం కుదిరింది. ఈ ఆపరేషన్ సంపూర్ణ విజయం సాధించడంలో పరాగ్ జైన్ నిర్వహించిననిఘా ఆపరేషన్ కీలకం కావడం, ఆయన్ను ‘రా’ కోట వరకు చేర్చింది.
ప్రస్తుతం ‘రా’లో రెండవ అగ్రశ్రేణి అధికారి అయిన పరాగ్ జైన్, జూన్ 30న పదవీ విరమణ పొందనున్న రవి సిన్హా స్థానంలో పదవీ బాధ్యతలు స్వీకరించనున్నారు. ఆయనకు రెండు సంవత్సరాల పదవీకాలం ఉండనుంది.
ఏవియేషన్ రీసెర్చ్ సెంటర్ డైరెక్టర్(ARC)గాకూడా ప్రస్తుతం విధులు నిర్వహిస్తున్న పరాగ్ జైన్, గగనతల నిఘా,సాంకేతిక నిఘా వంటి కీలక వ్యవహారాలను సమర్థవంతంగా నిర్వహిస్తున్నారు. అతను 1989 బ్యాచ్ పంజాబ్ కేడర్‌కు చెందిన ఐపీఎస్ అధికారి. తన కెరీర్ ప్రారంభంలో పంజాబ్లో ఉగ్రవాదం పేట్రేగుతున్నప్పుడు ఎస్ఎస్‌పీ–డీఐజీగా పని చేసిన ఆయన, ‘రా’లో చేరిన తర్వాత పాకిస్థాన్ డెస్క్‌కు నేతృత్వం వహించారు. జమ్మూ కాశ్మీర్‌లో ఆర్టికల్ 370 రద్దు సమయంలో కూడా అతని పాత్ర ప్రశంసలు పొందింది.అంతేకాక, పరాగ్ జైన్‌కు అంతర్జాతీయకార్యకలాపాల్లో కూడా అనుభవం కూడా ఉంది. శ్రీలంకలో ‘రా’ ప్రతినిధిగా విధులు నిర్వర్తించిన ఆయన, కెనడాలో ఖలిస్థానీ(Pro-Khalistani Terrorists) ఉగ్రవాద మాడ్యూల్స్‌పైకూడా కన్నేశారు. ఆ దేశం నుంచి నిర్వహించబడుతున్న భారత్ వ్యతిరేక కార్యకలాపాలనునిరోధించడంలోపరాగ్ కీలక పాత్ర పోషించారు.
పరాగ్ జైన్ నియామకంతో ‘రా’విధానాల్లో విప్లవాత్మక మార్పులు రానున్నాయని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. సాంకేతిక నిఘా, అంతర్జాతీయ ముప్పుల నిర్వహణలో ఆయన అనుభవం సంస్థకు గణనీయమైన బలంగా నిలుస్తుందని భావిస్తున్నారు.దేశీయంగా భద్రతాపరంగాపెను సవాళ్లు ఎదురవుతున్న నేపథ్యంలో, పరాగ్ జైన్ ‘రా’కు నాయకత్వం వహించడాన్ని భద్రతా రంగం ఒక శక్తివంతమైన నిర్ణయంగా పరిగణిస్తోంది.