కామ ప్రిన్సిపాల్.. 50 మంది విద్యార్థినుల‌పై లైంగిక వేధింపులు

కామ ప్రిన్సిపాల్.. 50 మంది విద్యార్థినుల‌పై లైంగిక వేధింపులు
  • కార్యాల‌యానికి పిలిపించుకొని పిల్ల‌ల‌పై దారుణాలు
  • హ‌ర్యానాలోని జింద్ జిల్లా స‌ర్కారు స్కూల్‌లో ఘ‌ట‌న‌
  • నిందితుడైన ప్రిన్సిపాల్ సస్పెండ్ .. అరెస్టు
  • ఇత‌ర మ‌హిళా టీచ‌ర్ల ప్రమేయంపై పోలీసుల ఆరా



విధాత‌: తండ్రి త‌ర‌హాలో పిల్ల‌ల‌ను కంటికి రెప్ప‌లా కాపాడాల్సిన ఓ స్కూల్ ప్రిన్సిపాల్‌.. విద్యార్థినుల‌పై లైంగిక వేధింపుల‌కు పాల్ప‌డ్డాడు. ఒక్క‌రు కాదు ఇద్ద‌రు కాదు ఏకంగా 50 మందికిపై చిన్నారులు.. త‌మ‌పై ప్రిన్సిపాల్ లైంగిక వేధింపుల‌కు పాల్ప‌డిన‌ట్టు ఫిర్యాదుచేశారు. పోలీసులకు ఫిర్యాదు చేసినా ప‌ట్టించుకోక‌పోవడంతో.. హర్యానా రాష్ట్ర మహిళా కమిషన్ రంగంలోకి దిగింది. కామ ప్రిన్సిపాల్‌ను స‌స్పెండ్ చేయ‌డ‌మే కాకుండా అత‌డిని అరెస్టు చేసింది. ఈ ఘ‌ట‌న‌ హ‌ర్యానా రాష్ట్రం జింద్ జిల్లాలోని ఓ ప్ర‌భుత్వ పాఠ‌శాల‌లో చోటుచేసుకున్న‌ది.


రాష్ట్ర మహిళా కమిషన్ చైర్‌పర్సన్ రేణు భాటియా వివ‌రాల ప్ర‌కారం.. ప్రిన్సిపాల్‌పై విద్యార్థినుల నుంచి మాకు 60 లిఖితపూర్వక ఫిర్యాదులు అందాయి. వీటిలో 50 ఫిర్యాదులు నిందితుడి చేతిలో శారీరక వేధింపులకు గురైన‌వి. మరో పది మంది అమ్మాయిలు, తమను కూడా ప్రిన్సిపాల్ వేధించార‌ని తెలిపారు. ఫిర్యాదు చేసిన వారందరూ మైనర్లు. నిందితుడు తమను తన కార్యాలయానికి పిలిచి అసభ్యకర చర్యలకు పాల్పడేవారని బాధితులు ఆరోపించారు.


“ప్రారంభంలో, మేము కొంతమంది విద్యార్థినుల నుంచి సెప్టెంబర్ 13న ఫిర్యాదును స్వీకరించాం. మరుసటి రోజు దానిని పోలీసులకు ఫార్వార్డ్ చేశాం. సెప్టెంబర్ 14 నుంచి అక్టోబర్ 29 వరకు పోలీసులు నిందితుడైన ప్రిన్సిపాల్‌పై ఎలాంటి చ‌ర్య‌లు తీసుకోలేదు. దాంతో ఆ అమ్మాయిలు మళ్లీ మమ్మల్ని సంప్రదించారు. మేము పోలీసు సూపరింటెండెంట్‌తో మాట్లాడాము. ఆ తర్వాత ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు”అని ఆమె తెలిపారు.


“ఎఫ్‌ఐఆర్ నమోదు చేసిన వెంటనే నిందితుడిని అరెస్టు చేయలేదు. దీంతో అత‌డు పారిపోయాడు. ప్రిన్సిపాల్ పారిపోవ‌డానికి పోలీసులు సమయం ఇచ్చారు. ప్రిన్సిపాల్‌కు మద్దతిచ్చిన మహిళా ఉపాధ్యాయురాలి పాత్రపై కూడా విచారణ జరుపుతున్నాం” అని ఆమె పేర్కొన్నారు. గుర్తు తెలియని వ్యక్తుల నుంచి తమకు ఫోన్‌ కాల్స్‌ వచ్చాయని కొందరు బాలికలు శుక్ర‌వారం సాయంత్రం కమిషన్‌ను సంప్రదించారని ఆమె తెలిపారు.


నిందితుడైన 55 ఏండ్ల‌ ప్రిన్సిపాల్‌ను అరెస్టు చేసేందుకు జింద్ పోలీసులు బృందాలను ఏర్పాటు చేశారు. ఎట్ట‌కేల‌కు పోలీసులు ప్రిన్సిపాల్‌ను అరెస్టు చేశారు.