PM Modi | ఐదేళ్ల తర్వాత ప్రధాని ఎవరో హింట్ ఇచ్చిన మోదీ..
శుక్రవారం ముంబైలో గ్లోబల్ ఫిన్‌టెక్ ఫెస్ట్ 2024 (Global FinTech Fest 2024)ను ఉద్దేశించి మాట్లాడిన మోదీ.. దేశ పౌరులకు నాణ్యమైన జీవన శైలిని అందించడంలో కీలక పాత్ర పోషించడమే కాకుండా.. యావత్ ప్రపంచ జీవన సౌలభ్యాన్ని భారతదేశ ఆర్థిక ఎకోసిస్టమ్ మెరుగుపరుస్తుందని చెప్పారు
PM Modi | శుక్రవారం ముంబైలో గ్లోబల్ ఫిన్‌టెక్ ఫెస్ట్ 2024 (Global FinTech Fest 2024)ను ఉద్దేశించి మాట్లాడిన మోదీ.. దేశ పౌరులకు నాణ్యమైన జీవన శైలిని అందించడంలో కీలక పాత్ర పోషించడమే కాకుండా.. యావత్ ప్రపంచ జీవన సౌలభ్యాన్ని భారతదేశ ఆర్థిక ఎకోసిస్టమ్ మెరుగుపరుస్తుందని చెప్పారు. ‘ఇది ఐదో గ్లోబల్ ఫిన్‌టెక్ ఫెస్ట్. పదో ఫిన్‌టెక్ ఫెస్ట్‌ను ఉద్దేశించి మాట్లాడేందుకు కూడా నేను వస్తాను’ అని చెప్పారు. ఫిన్‌టెక్ ఫెస్ట్ ఏటా జరుగుతుంటుంది. అంటే.. ఐదేళ్ల తర్వాత కూడా తాను ప్రధానిగా ఉంటాననే సంకేతాలను ఆయన ఇచ్చారన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ప్రధానిగా మోదీ ప్రస్తుత పదవీకాలం 2029 మే నెల వరకూ ఉంటుంది. ఈ లెక్కన ఫిన్‌టెక్ పదో ఫెస్ట్ 2029 జూలై లేదా ఆగస్ట్‌లో నిర్వహిస్తారు.
ఇదిలా ఉంటే.. సమాజ పరివర్తనలో ఫెన్‌టెక్ కీలకమైన పాత్ర పోషించిందన్న ప్రధాని.. యునిఫైడ్ పేమెంట్స్ ఇంటర్‌ఫేస్ (UPI) భారతదేశ ఫిన్‌టెక్ విజయానికి గొప్ప ఉదాహరణ అని చెప్పారు. ఇంతటి వేగవంతమైన మార్పునకు ప్రపంచంలో మరో ఉదాహరణ లేదన్నారు. ఫిన్‌టెక్ విప్లవం పాదర్శకతను తీసుకొచ్చిందని, వ్యవస్థీకృత లోపాలను నిరోధించేందుకు సహకరించిందని మోదీ తెలిపారు. అదే సమయంలో సమాంతర ఆర్థిక వ్యవస్థకు చెక్ పెట్టిందన్నారు.
‘ఈ పరివర్తన సాంకేతిక పరిజ్ఞానానికి మాత్రమే పరిమితం కాలేదు. సామాజికంగా కూడా ప్రభావాన్ని చూపింది. గ్రామాలు, నగరాలకు మధ్య అంతరాలను పూడ్చడంలో సహకరించింది. వినూత్నమైన ఆవిష్కరణలు, ఇతివృత్తాలతో కొత్త మార్కెట్‌లకు మార్గం సుగమం చేసింది’ అని మోదీ అన్నారు.
ఫైనాన్షియల్ సర్వీసులను ప్రజాస్వామ్యీకరించడంలో ఫిన్‌టెక్ గణనీయమైన పాత్రను పోషించిందని ప్రధాని మోదీ చెప్పారు. లబ్ధిదారులకు నగదు బదిలీ (Money transfer)తో వ్యవస్థలో లీకేజీలను అరికట్టగలిగిందని అన్నారు. ప్రజలు కూడా సంప్రదాయిక వ్యవస్థలో భాగస్వాములయ్యేందుకు ముందుకు వస్తున్నారని తెలిపారు. ‘జన్‌ధన్ యోజన (Jan Dhan Yojana)కు పదేళ్లు పూర్తయ్యాయి. దానిని ప్రారంభించినప్పుడు పార్లమెంటులో అనేక మంది మమ్మల్ని ప్రశ్నించారు. ఈ రోజు మహిళా సాధికారతలో అదొక అద్భుతమైన మాధ్యమంగా నిలిచింది. 29 కోట్లకు పైగా మహిళలు తమ బ్యాంకు ఖాతాలను తెరిచారు’ అని మోదీ చెప్పారు.
ఈ ఖాతాలు మహిళలకు పొదుపు, పెట్టుబడులకు వేదికలుగా మారాయని అన్నారు. సైబర్ మోసాలను అడ్డుకునేందుకు, డిజిటల్ అక్షరాస్యతను పెంపొందించేందుకు మరిన్ని చర్యలు చేపట్టాల్సి ఉన్నదని మోదీ అన్నారు. స్టార్టప్స్, ఫిన్‌టెక్‌ల వృద్ధిలో సైబర్ మోసాలు ఇబ్బందికరంగా పరిణమించకుండా చూడాల్సిన ఆవశ్యకత ఉన్నదని చెప్పారు. సైబర్ మోసాలను అత్యంత శక్తిమంతంగా నిరోధించాలని అన్నారు. దేశ యువత ప్రతిభపై తనకు పూర్తి నమ్మకం ఉన్నదన్న మోదీ.. మీకు ఇంకా అత్యత్తుమ సమయం ఇంకా రాలేదన్నారు.
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram