PM Modi | ఉగ్రవాదంపై భారత సైనిక దళాలదే విజయం: ప్రధాని మోదీ

పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాద చర్యలపై ఎన్నటికి భారత సైనిక దళాలదే విజయమని, వారి దుర్మార్గపు కుట్రలు ఎన్నటికీ ఫలించబోవని, భారత సైనిక దళాలు ఉగ్రవాదాన్ని అణిచి శత్రువులకు తగిన జవాబిస్తాయని ప్రధాని నరేంద్ర మోదీ స్పష్టం చేశారు.

PM Modi | ఉగ్రవాదంపై భారత సైనిక దళాలదే విజయం: ప్రధాని మోదీ

పాకిస్తాన్ ఉగ్ర కుట్రలను సమూలంగా నిర్మూలిస్తాం
సైనికుల త్యాగాలకు భారతవని రుణపడి ఉంటుంది
కార్గిల్ విజయ్ దీవస్‌లో ప్రధాని మోదీ
రాష్ట్రపతి, ప్రధాని, రక్షణ మంత్రుల నివాళులు

విధాత, హైదరాబాద్ : పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాద చర్యలపై ఎన్నటికి భారత సైనిక దళాలదే విజయమని, వారి దుర్మార్గపు కుట్రలు ఎన్నటికీ ఫలించబోవని, భారత సైనిక దళాలు ఉగ్రవాదాన్ని అణిచి శత్రువులకు తగిన జవాబిస్తాయని ప్రధాని నరేంద్ర మోదీ స్పష్టం చేశారు. భారత భూభాగాన్ని ఆక్రమించాలని ప్రయత్నించిన పాకిస్థాన్ సేనలను తరిమికొట్టిన భారత సైన్యం వీర పరాక్రమానికి ప్రతీకయైన కార్గిల్ యుద్ధం విజయగాథకు శుక్రవారంతో 25ఏళ్లు నిండటంతో నాటి యుద్ధంలో అమరులైన వీర జవాన్లకు ప్రధానమంత్రి నరేంద్రమోదీ నివాళులర్పించారు.

కార్గిల్ 25విజయ్ దివస్ పురస్కరించుకుని లడ్డాఖ్ ద్రాస్ లోని యుద్ద స్మారకాన్ని సందర్శించిన మోదీ అమరజవాన్లకు నివాళులర్పించారు. ఈ సందర్భంగా అమర జవాన్ల సతీమణులు, కుటుంబసభ్యులతో ప్రధాని కొద్దిసేపు ముచ్చటించారు. అనంతరం మోదీ మాట్లాడుతూ కార్గిల్ యుద్ధంతో ఆ దేశం గుణపాఠం నేర్చుకోకుండా తన కవ్వింపు విధానాలను కొనసాగిస్తుందని విమర్శించారు. ముష్కరులను పెంచి పోషిస్తున్న వారికి నేను చెప్పేది ఒక్కటేనని, ఉగ్రవాదాన్ని సమూలంగా పెకిలిస్తామని దాయాది దేశాన్ని మరోసారి గట్టిగా హెచ్చరించారు. దేశం కోసం ప్రాణాలు పణంగా పెట్టి పోరాడిన సైనికుల త్యాగాలకు యావత్ భారతావని ఎప్పటికీ రుణపడి ఉంటుందన్నారు.

కార్గిల్ యుద్ధ సమయంలో సామాన్యుడిగా సైనికుల మధ్య ఉండే అదృష్టం నాకు దక్కిందని, దేశం కోసం వారు చేసిన పోరాటం నా మదిలో నిలిచిపోయిందన్నారు. లద్దాబ్, జమ్మూకశ్మీర్ అభివృద్ధి కోసం ఎలాంటి సవాళ్లనైనా భారత్ అదిగమిస్తుందని, మరికొద్ది రోజుల్లో ఆర్టికల్ 370ని రద్దు చేసి ఐదేళ్లు పూర్తవుతాయని గుర్తు చేశారు. ఇప్పుడు జమ్మూకశ్మీర్ ప్రజలు సరికొత్త భవిష్యత్తు, అభివృద్ధి కోసం ఎదురుచూస్తున్నారు. పెద్ద కలల గురించి మాట్లాడుకుంటున్నారని, ఈ భూలోక స్వర్గం శాంతి, సౌభ్రాతృత్వం వైపు వేగంగా పరిగెడుతోందని మోదీ తెలిపారు. ప్రస్తుతం కశ్మీర్ ప్రతిష్టాత్మక కార్యక్రమాలకు నిలయంగా మారుతుందన్నారు.

రాష్ట్రపతి నివాళులు..

కార్గిల్ విజయ్ దివస్ సందర్భంగా రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ఎక్స్ వేదికగా అమరవీరుల త్యాగాలను గుర్తుచేసుకున్నారు. “మన సాయుధ దళాల దైర్యం, పరాక్రమానికి ప్రతీక విజయగాథ. 1999 నాటి కార్గిల్ యుద్ధంలో మాతృభూమి కోసం ప్రాణాలు అర్పించిన ప్రతి జవాను నివాళులర్పిస్తున్నా. వారి త్యాగం, శౌర్యం నుంచి దేశ ప్రజలంతా స్ఫూర్తి పొందుతారు. జై హింద్. జై భారత్” అని రాష్ట్రపతి రాసుకొచ్చారు.
ఇక, దిల్లీలోని జాతీయ యుద్ధ స్మారకం వద్ద కేంద్ర రక్షణమంత్రి రాజ్‌నాథ్‌ సింగ్ అమర జవాన్లకు నివాళులర్పించారు. ద్రాస్ లోని కార్గిల్ యుద్ధ స్మారకం వద్ద చీప్ అప్ డిఫెన్స్ స్టాఫ్ (సీడీఎస్) జనరల్ అనిల్ చౌహాన్ అంజలి ఘటించారు. అమరవీరుల త్యాగాలను వృథా కానివ్వబోమన్నారు.

షింకున్‌లా టన్నెల్ పనులను ప్రారంభించిన ప్రధాని

లడ్డాఖ్ ద్రాస్‌లోని యుద్ధ స్మారకం వద్ద కార్గిల్ అమరవీరులకు నివాళులర్పించిన ప్రధాని మోదీ ఈ సందర్భంగా షింకున్ లా టన్నెల్ ప్రాజెక్ట్ నిర్మాణపనులను ప్రారంభించారు. టన్నెల్ నిర్మాణ ప్రాంతం వద్ద వర్చువల్‌గా తొలి బ్లాస్ట్ చేశారు. దీని నిర్మాణం పూర్తయితే ప్రపంచంలోనే అత్యంత ఎత్తయిన సొరంగంగా గుర్తింపు సాధించనుంది. 4.1 కిలోమీటర్ల పొడవైన ఈ ట్విన్ ట్యూబ్ టన్నెల్‌ను 15,800 అడుగుల ఎత్తులో నిర్మించనున్నారు. అత్యవసర పరిస్థితుల్లో సాయుధ దళాలను వేగంగా తరలించేందుకు, సైనిక సామగ్రిని చేరవేసేందుకు ఈ సొరంగం సమర్థంగా ఉపయోగపడనుంది.