నేడు ప్రధాని మోదీ ఇటలీ పర్యటన
ధాని నరేంద్ర మోదీ ఇటలీ పర్యటనకు బయలుదేరారు. జీ-7 దేశాల 50వ సదస్సులో పాల్గొనేందుకు ప్రధాని నరేంద్ర మోదీ ఇటలీ వెళ్లారు. మూడో సారి ప్రధానిగా పదవీ బాధ్యతలు చేపట్టిన అనంతరం మోదీ తొలి విదేశీ పర్యటన ఇదే కానుంది

జీ-7 సదస్సుకు హాజరు
విధాత : ప్రధాని నరేంద్ర మోదీ ఇటలీ పర్యటనకు బయలుదేరారు. జీ-7 దేశాల 50వ సదస్సులో పాల్గొనేందుకు ప్రధాని నరేంద్ర మోదీ ఇటలీ వెళ్లారు. మూడో సారి ప్రధానిగా పదవీ బాధ్యతలు చేపట్టిన అనంతరం మోదీ తొలి విదేశీ పర్యటన ఇదే కానుంది. ఇటలీలో జూన్ 13-15 వరకు జరిగే జీ-7 సమావేశాలకు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్, ఫ్రాన్స్ అధ్యక్షుడు మెక్రాన్, జపాన్ పీఎం ఫ్యూమియో కిషిడా, తదితరులు హాజరు కానున్నారు. మూడు రోజుల పాటు జరిగే ఈ సదస్సులో రష్యా-ఉక్రెయిన్ యుద్ధం, గాజా సంఘర్షణలపై చర్చించనున్నారు. జీ – 7 బృందంలో భారత్ లేనప్పటికీ శుక్రవారం జరిగే సమావేశంలో పాల్గొనాల్సిందిగా ఇటలీ ప్రధానమంత్రి జార్జియా మెలోని నుంచి ఆహ్వానం అందినట్లు భారత విదేశీ వ్యవహారాల శాఖ కార్యదర్శి వినయ్ మోహన్ ఖత్రా వెల్లడించారు.
జీ – 7 అనేది ప్రపంచంలోని అత్యంత ధనిక, అభివృద్ధి చెందిన ఆర్థిక వ్యవస్థలున్న దేశాల కూటమి. ఈ దేశాలు ప్రపంచ వాణిజ్యం, అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థపై ఆధిపత్యం ప్రదర్శిస్తున్నాయి. జీ – 7 బృందంలో కెనడా, ఫ్రాన్స్, జర్మనీ, ఇటలీ, జపాన్, యూకే, యునైటెడ్ స్టేట్స్ సభ్య దేశాలుగా ఉన్నాయి. 1988లో రష్యా ఈ బృందంలో చేరడంతో జీ – 8గా మారింది. అయితే 2014లో క్రిమియాను రష్యా స్వాధీనం చేసుకోవడంతో ఈ బృందం నుంచి రష్యాను తొలగించారు. అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ, ప్రపంచంలో రెండో అత్యధిక జనాభా గల దేశమైనప్పటికీ చైనా ఎప్పుడూ ఈ బృందంలో సభ్యదేశంగా లేదు. జీ – 7 బృందంలోని దేశాలతో పోల్చినప్పుడు చైనా తలసరి ఆదాయం చాలా తక్కువ. అందుకే చైనాను అత్యంత అభివృద్ధి చెందిన ఆర్థిక వ్యవస్థగా పరిగణించడంలేదు. అభివృద్ధి చెందిన, చెందుతున్న దేశాలతో కూడిన జీ 20 గ్రూపులో రష్యా, చైనాలు సభ్యదేశాలుగా ఉన్నాయి. ఈయూ, జీ 7లో సభ్యదేశం కానప్పటికి వార్షిక సమావేశానికి హాజరవుతుంది. జీ – 7 మంత్రులు, అధికారులు ఏడాది పొడవునా సమావేశం అవుతారు. ప్రపంచ ఘటనలపై ఒప్పందాలు, ఉమ్మడి ప్రకటనలు వెలువరిస్తారు. 2024 జీ – 7 సమావేశాలకు ఇటలీ అధ్యక్షత వహిస్తోంది.