Gandhi X Savarkar | ఒకే వాక్యంలో గాంధీ, సావర్కర్ పేర్లా.. ఎంత ధైర్యం? యాంకర్‌ నోటికి పీకే తాళం!

రాజకీయ వ్యూహకర్త, జన్‌ సూరజ్‌ పార్టీ వ్యవస్థాపకుడు ప్రశాంత్‌ కిశోర్‌ సావర్కర్‌ విషయంలో చేసిన వ్యాఖ్యలు నెట్టింట వైరల్‌ అయ్యాయి.

Gandhi X Savarkar | ఒకే వాక్యంలో గాంధీ, సావర్కర్ పేర్లా.. ఎంత ధైర్యం? యాంకర్‌ నోటికి పీకే తాళం!

Gandhi X Savarkar | మహాత్మా గాంధీతో వినయక్‌ సావర్కర్‌ను పోల్చరాదని రాజకీయ వ్యూహకర్త, జన్‌ సూరజ్‌ పార్టీ వ్యవస్థాపకుడు ప్రశాంత్‌ కిశోర్‌ అన్నారు. ఈటీవీ భారత్‌కు ఆయన ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈయన ఈ వ్యాఖ్యలు చేశారు. ‘మహాత్మా గాంధీ, వీడీ సావర్కర్‌.. ఈ ఇద్దరిలో ఎవరిని ఎంచుకుంటారు?’ అన్న యాంకర్‌ ప్రశ్నకు ఆయన తీవ్ర స్థాయిలో స్పందించారు. ‘ఒకే వాక్యంలో గాంధీజీ, సావర్కర్‌ పేర్లను ప్రస్తావించడానికి మీకు ఎంత ధైర్యం? అసలు ఈ ప్రశ్నే బాపూను అవమానించేది’ అని ప్రశాంత్‌ కిశోర్‌ అన్నారు. దీంతో ఒక్కసారిగా యాంకర్‌ నోరుమూసుకున్నాడు. సామాజిక మాధ్యమాల్లో ఈ క్లిప్‌కు భారీ స్పందన వచ్చింది. ఏడు లక్షల వ్యూస్‌ను సొంతం చేసుకుంది. తీవ్ర చర్చకు దారి తీసింది. బీజేపీ సైద్ధాంతిక అజెండా పట్ల ప్రజల్లో ఉన్న భ్రమలను తొలగించేలా కిశోర్‌ వ్యాఖ్యలు ఉన్నాయని పలువురు నెటిజన్లు కామెంట్లు పెట్టారు. నవంబర్‌ 6, 11 తేదీల్లో బీహార్‌ అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్నాయి. ఈ నేపథ్యంలో ఈటీవీ భారత్‌ ప్రశాంత్‌ కిశోర్‌ను ఇంటర్వ్యూ చేసింది.

గాంధీ వారసత్వంపై కాంగ్రెస్‌ పార్టీని టార్గెట్‌ చేసే సమయంలో బీజేపీ ఇటీవలి కాలంలో తరచుగా సావర్కర్‌ ప్రస్తావనలు చేస్తున్న నేపథ్యంలో ప్రశాంత్‌ కిశోర్‌ వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. ఆనాటి హిందూ మహాసభలో కీలక నాయకుడైన సావర్కర్‌.. బ్రిటిషర్లకు పెద్ద సంఖ్యలో క్షమాభిక్ష పత్రాలు సమర్పించుకోవడం తీవ్ర వివాదాస్పదమైంది. పైగా.. గాంధీజీ హత్యలో ఆయనకు కూడా భాగముందనే అభియోగాలు నమోదయ్యాయి. తొలుత గాంధీజీ హంతకుడు నాథూరామ్‌ గాడ్సేతోపాటు సావర్కర్‌ను కూడా అరెస్టు చేశారు. అయితే.. తగిన సాక్ష్యాలు లేని కారణంగా విడుదలయ్యాడు. తదుపరి గాంధీజీ హత్యపై విచారణకు 1965లో నాటి ప్రభుత్వం కపూర్‌ కమిషన్‌ను నియమించింది. ఈ కమిటీ తన నివేదికను 1969లో వెలువరించింది. గాంధీజీ హత్యకు కుట్రలో సావర్కర్‌, అతని బృందం పాత్ర ఉందని నిర్ధారించింది.  అయితే.. 1966లోనే సావర్కర్‌ చనిపోయారు.