న్యూఢిల్లీ : మహిళా రిజర్వేషన్ బిల్లుకు డీలిమిటేషన్ బిల్లుతో ముడిపెట్టడంతోనే 131రాజ్యాంగ సవరణ బిల్లు వీగిపోయిందని, బిల్లు వీగిపోవడం వెనక ఏం జరిగిందో ప్రజలకు తెలుసు అని కాంగ్రెస్ ఎంపీ ప్రియాంక గాంధీ అన్నారు. శనివారం ఆమె ఢిల్లీలో మీడియాతో మాట్లాడారు. మహిళా రిజర్వేషన్ బిల్లు ముసుగుతో సీట్లను పెంచి శాశ్వతంగా అధికారంలో ఉండాలని బీజేపీ కుట్ర పన్నిందని.. దాన్ని విపక్షం తిప్పికొట్టిందని వ్యాఖ్యానించారు. ప్రజాస్వామ్యం గెలిచిందని పేర్కొన్నారు. మహిళా రిజర్వేషన్ బిల్లుతో ఇతర బిల్లులు కలపకుండా.. 2023లో ఆమోదం పొందిన బిల్లునే తిరిగి తీసుకురావాలని డిమాండ్ చేశారు. ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేయాలని కేంద్రం కుట్ర చేసిందని ఆరోపించారు. దేశం మారింది.. ప్రజలు అర్థం చేసుకుంటున్నారని పేర్కొన్నారు. ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేయాలనుకుంటే మాత్రం పరిస్థితులు ఇలానే ఉంటాయని సూచించారు. ఎన్డీఏ ప్రభుత్వానికి పార్లమెంటులో మొదటిసారి ఎదురుదెబ్బ తగలడంతో బ్లాక్ డే అని మాట్లాడున్నారని విమర్శించారు.
తమిళనాడు, బెంగాల్ ఎన్నికలు జరుగుతున్న సమయంలో ప్రభుత్వం హడావిడిగా ప్రత్యేక పార్లమెంట్ సమావేశాలు ఏర్పాటు చేసిందన్నారు. సమావేశాల తర్వాత అజెండాను ప్రకటించదని ఆరోపించారు. మహిళా రిజర్వేషన్ బిల్లును సాకుగా చూపించి డీలిమిటేషన్ బిల్లును ఆమోదించి స్వప్రయోజనాలను పొందాలని చూసిందని వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ పార్టీని మహిళా వ్యతిరేకులుగా చిత్రీకరించాలని బీజేపీ చూస్తోందని ప్రియాంకాగాంధీ పేర్కొన్నారు. మహిళ రిజర్వేషన్ల కోసం కట్టుబడి ఉన్న పార్టీ కాంగ్రెస్ అని పునురుద్ఘాటించారు.
ఇవి కూడా చదవండి :
మహిళ బిల్లు ముసుగులో బీజేపీ కుట్ర రాజకీయం : సీఎం రేవంత్ రెడ్డి
బయ్యారంలో గ్రీన్ స్టీల్ ప్లాంట్ నెలకొల్పండి : కేంద్ర మంత్రి కుమారస్వామికి సీఎం రేవంత్ రెడ్డి వినతి
