Rahul Gandhi | ఉక్రెయిన్ యుద్ధాన్ని ఆపిన మోదీ.. పేపర్ లీకేజీలు ఆపలేకపోతున్నారు: రాహుల్ సెటైర్
నీట్ పరీక్షలో భారీ అవకతవకలు, యూజీసీ నెట్ పరీక్ష రద్దు నేపథ్యంలో ప్రధాని మోదీపై కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ సెటైర్లు విసిరారు

న్యూఢిల్లీ : నీట్ పరీక్షలో భారీ అవకతవకలు, యూజీసీ నెట్ పరీక్ష రద్దు నేపథ్యంలో ప్రధాని మోదీపై కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ సెటైర్లు విసిరారు. ఉక్రెయిన్ యుద్ధాన్ని ఆపారని మోదీ గురించి చెబుతుంటారుగానీ.. ఆయన పేపర్ లీకేజీలను ఆపలేకపోయారని ఎద్దేవా చేశారు. బీజేపీ మాతృసంస్థ విద్యా వ్యవస్థను చెరబట్టిందని విమర్శించారు. ‘మోదీజీ రష్యా, ఉక్రెయిన్ యుద్ధాన్ని ఆపారని చెబుతుంటారు. ఎందుకో ఏమోగానీ.. నరేంద్రమోదీ ఇండియాలో పేపర్ లీకేజీలను మాత్రం ఆపలేక పోతున్నారు లేదా ఆపాలనుకోవడం లేదు’ అని చురక వేశారు.
జూన్ 18న నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ నిర్వహించిన యూజీసీ ఎన్‌ఈటీ పరీక్షను కేంద్ర విద్యాశాఖ బుధవారం రాత్రి రద్దు చేసిన విషయం తెలిసిందే. ఈ పరీక్షలో కూడా అవకతవకలు జరిగాయన్న ప్రాథమిక సమాచారంతో కేంద్రం ఈ నిర్ణయం తీసుకున్నది. నీట్ పరీక్షల అంశాన్ని సీబీఐకి అప్పగించారు. బీజేపీ మాతృసంస్థ దేశ విద్యావ్యవస్థను చెరబట్టడం వల్లే పేపర్ లీకేజీలు చోటు చేసుకుంటున్నాయని రాహుల్ గాంధీ విమర్శించారు.
‘ఇప్పటికీ పేపర్ లీకేజీలకు అడ్డుకట్ట పడటం లేదు. యథేచ్ఛగా లీకేజీలు జరిగిపోతున్నాయి. ‘ఈ చెరబాటుకు మోదీ సహకరించారు. ఇది జాతి వ్యతిరేక చర్య’ అని రాహుల్ పేర్కొన్నారు. ప్రతిభ ఆధారంగా కాకుండా ఒక నిర్దిష్ట సంస్థతో వారికి ఉన్న అనుబంధం నేపథ్యంలో యూనివర్సిటీలకు కులపతులను ఎంపిక చేస్తున్నారని రాహుల్ గాంధీ విమర్శించారు. ‘ఆ సంస్థ, బీజేపీ మన విద్యావ్యవస్థలోకి చొరబడ్డాయి. దానిని నాశనం చేశాయి.
పెద్ద నోట్ల రద్దు పేరుతో ఆర్థిక వ్యవస్థకు నరేంద్రమోదీ ఎంత నష్టం చేశారో.. అంతే నష్టాన్ని ఇప్పుడు విద్యావ్యవస్థకు చేశారు’ అని మండిపడ్డారు. ‘స్వతంత్ర, ఒక లక్ష్యంతో కూడిన వ్యవస్థలను కూల్చివేసినందునే ఇప్పుడు ఇలా జరుగుతున్నది. విద్యార్థులు ఇలా ఇబ్బంది పడుతున్నారు. ఈ మొత్తం మోసానికి కారణమైనవారిని అరెస్టు చేసి, కఠినంగా శిక్షించడం అత్యంత ముఖ్యం’ అని రాహుల్ పేర్కొన్నారు. నీట్ అవకతవకలు, యూజీసీ నెట్ పరీక్ష రద్దు అంశాలను తమ పార్టీ పార్లమెంటులో ప్రస్తావిస్తుందని చెప్పారు.