గాంధీ గురించి తెలుసుకోవాలంటే ‘ఎంటైర్ పొలిటికల్ సైన్స్’ విద్యార్థే సినిమా చూడాలి
గాంధీ గురించి తెలుసుకోవాలంటే ‘ఎంటైర్ పొలిటికల్ సైన్స్’ విద్యార్థే సినిమా చూడాలి మోదీపై కాంగ్రెస్ నేత రాహుల్‌గాంధీ సెటైర్ గాంధీ వారసత్వాన్ని నాశనం చేసిందే మోదీ ... ఎక్స్‌లో మండిపడిన కాంగ్రెస్ నేత జైరాం రమేశ్

- మోదీపై కాంగ్రెస్ నేత రాహుల్‌గాంధీ సెటైర్
- గాంధీ వారసత్వాన్ని నాశనం చేసిందే మోదీ
- ఎక్స్‌లో మండిపడిన కాంగ్రెస్ నేత జైరాం రమేశ్
న్యూఢిల్లీ: మహాత్మా గాంధీ గురించి 1982లో అటెన్‌బరో ‘గాంధీ’ సినిమా తీసిన తర్వాతే ఆయన గురించి ప్రపంచానికి తెలిసిందని ప్రధాని నరేంద్రమోదీ చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ ఎంపీ రాహుల్‌గాంధీ తీవ్రస్థాయిలో చరకలు అంటించారు. ‘మహాత్మా గాంధీ గురించి తెలుసుకోవడానికి కేవలం ఎంటైర్ పొలిటికల్ సైన్స్ విద్యార్థి మాత్రమే ‘గాంధీ’ సినిమా చూడాలి’ అంటూ ఎక్స్‌లో మోదీని ఉద్దేశించి సెటైర్ వేశారు. మంగళవారం ఏబీపీ చానళ్లలో ప్రసారమైన ఇంటర్యూల్లో మోదీ మాట్లాడుతూ కాంగ్రెస్ పేరు ప్రస్తావించకుండా.. మహాత్మడి గొప్పతనాన్ని ఆ పార్టీ ప్రపంచానికి చాటిచెప్పలేదని వ్యాఖ్యానించారు. ‘మహాత్మాగాంధీ గొప్ప మహనీయుడు. గత 75 సంవత్సరాలుగా ఆయన కీర్తిని ప్రపంచానికి చాటే బాధ్యత మనకు లేదా? ఆయన గురించి ఎవరికీ తెలియదు. ‘గాంధీ’ సినిమా విడుదలైన తర్వాత ఆయన గురించి తెలుసుకోవాలన్న ఆసక్తి ప్రపంచవ్యాప్తంగా పెరిగింది. మనం ఏమీ చేయలేదు. మార్టిన్ లూథర్ కింగ్, నెల్సన్ మండేలా గురించి ప్రపంచానికి తెలుసు. గాంధీ కూడా వారికి ఏమీ తీసిపోడు. మనం దానిని అంగీకరించాలి’ అని మోదీ చెప్పుకొచ్చారు.
భారత్, బ్రిటన్ సంయుక్తంగా నిర్మించిన ‘గాంధీ’ చిత్రానికి రిచర్డ్ అటెన్‌బరో దర్శకత్వం వహించారు. 11 విభాగాల్లో ఆ సినిమా ఆస్కార్ నామినేషన్లు పొందగా.. ఉత్తమ చిత్రం సహా ఎనిమిది అవార్డులను దక్కించుకున్నది. అదే ఏడాది స్టీవెన్ స్పీల్‌బర్గ్ రూపొందించిన ఈటీ.. ది ఎక్‌స్ట్రా టెర్రెస్ట్రియల్ చిత్రం గట్టి పోటీని ఇచ్చింది. ‘గాంధీ’ సినిమా భారతదేశంలో 1982, నవంబర్ 30వ తేదీన విడుదలైంది. తదుపరివారాల్లో బ్రిటన్, అమెరికాల్లో విడుదల చేశారు.
మాజీ కాబోయే ప్రధాని 1982 వరకూ గాంధీ ఎవరో తెలియని ఏ ప్రపంచంలో నివసిస్తున్నారో నాకు తెలియదు. గాంధీ వారసత్వాన్ని నాశనం చేసిందే ఈ మాజీ కాబోయే ప్రధాని. వారణాసి, ఢిల్లీ, అహ్మదాబాద్‌లలో గాంధేయ సంస్థలను నాశనం చేసింది ఆయన ప్రభుత్వమే’ అని కాంగ్రెస్ నేత జైరాం రమేశ్ ఎక్స్‌లో వ్యాఖ్యానించారు. ‘ప్రస్తుతం కొనసాగుతున్న ఎన్నికలు గాంధీ సిద్ధాంతాలను పాటించేవారికి, ఆయనను హత్య చేసిన నాథూరాం గాడ్సే సిద్ధాంతాలను పాటించేవారికి మధ్య జరుగుతున్నాయి’ అని ఆయన పేర్కొన్నారు. ఇది ఆరెస్సెస్ హాల్‌మార్క్. మహాత్మా గాంధీ జాతీయ వాదాన్ని వారు అర్థం చేసుకోలేరు. వారి భావజాలం సృష్టించిన వాతావరణం మహాత్మా గాంధీని నాథూరాం గాడ్సే హత్య చేయడానికి పురికొల్పింది’ అని జైరాం రమేశ్ పేర్కొన్నారు. మరోవైపు గాంధీ లండన్, స్విట్జర్లాండ్, పారిస్‌లలో 1930లలో పర్యటించిన వార్తల తాలూకు క్లిప్పింగ్‌లతో కాంగ్రెస్ కేరళ యూనిట్ ఎక్స్‌లో పోస్టు పెట్టింది. గాంధీ గురించి మార్టిన్ లూథర్ కింగ్ జూనియర్, మండేలా చేసిన వ్యాఖ్యలను కొందరు నెటిజన్లు ప్రస్తావించారు. గాంధీ హత్య వార్తను ప్రచురించిన పలు అంతర్జాతీయ పత్రికల క్లిప్పింగ్‌లను కూడా విస్తారంగా పోస్టు చేశారు.