రైల్వే దుప్పట్లతో దర్జా.. చోరీ విలువ రూ.104.51కోట్లు!

రైల్వే ఆస్తుల చోరీ వ్యవహారంలో ఆసక్తికర అంశం వెలుగుచూసింది. మార్కెట్లో ముగ్గురు వ్యక్తులు వెస్టర్న్ రైల్వే( WESTERN RAILWAY) అని రాసి ఉన్న తెల్లటి దుప్పట్లను శాలువాలుగా కప్పుకొని తిరుగుతున్న దృశ్యాల వీడియోలు షాక్ కు గురిచేస్తున్నాయి.

విధాత : రైల్వే ఆస్తుల చోరీ వ్యవహారంలో ఆసక్తికర అంశం వెలుగుచూసింది. మార్కెట్లో ముగ్గురు వ్యక్తులు వెస్టర్న్ రైల్వే( WESTERN RAILWAY) అని రాసి ఉన్న తెల్లటి దుప్పట్లను శాలువాలుగా కప్పుకొని తిరుగుతున్న దృశ్యాల వీడియోలు షాక్ కు గురిచేస్తున్నాయి. ఈ వీడియో వైరల్ అవుతున్న క్రమంలో ఆర్టీఐ ద్వారా రైల్వే ఆస్తుల చోరీకి సంబంధించి ఓ ఆసక్తికర అంశంలో ఇటీవల వెలుగులోకి వచ్చింది.

చోరీ దుప్పట్ల విలువ రూ.104.51 కోట్లు

2022 జనవరి నుంచి 2026 మే వరకు ఏకంగా 1.27 కోట్ల రైల్వే బెడ్ రోల్ వస్తువులు చోరీకి గురయ్యాయని ఆర్టీఐ ద్వారా వెల్లడైంది.ఇందులో 41.13 లక్షల బెడ్‌షీట్లు, 46.54 లక్షల ఫేస్ టవల్స్, 23.59 లక్షల పిల్లో కవర్లు, 12.95 లక్షల దుప్పట్లు, 2.76 లక్షల దిండ్లు ఉన్నాయి. వాటి చోరీ ద్వారా కాంట్రాక్టర్లకు ఏకంగా రూ.104.51 కోట్ల నష్టం వాటిల్లినట్లు అంచనా వేస్తున్నారు. అత్యధికంగా 25.76 లక్షల బెడ్‌రోల్‌ వస్తువుల చోరీలతో రాజస్థాన్‌లోని బికనేర్‌ డివిజన్‌ మొదటి స్థానంలో ఉంది. రాంచీ, ఢిల్లీ, ముంబై, జోద్‌పూర్‌, అహ్మదాబాద్‌ డివిజన్లు తరువాతి స్థానాల్లో ఉన్నాయి. గణాంకాల ప్రకారం, ప్రతి వెయ్యి మంది ఏసీ ప్రయాణికుల్లో ఒకరు రైల్వే వస్తువులను తమతో పాటు పట్టుకెళ్తున్నారు.

రైల్వే నిబంధనల ప్రకారం వస్తువుల బాధ్యత కాంట్రాక్ట్ ఏజెన్సీలదే. వస్తువులు పోయినప్పుడు ఆ నష్టాన్ని కాంట్రాక్టర్ల బిల్లుల నుంచి మినహాయిస్తారు. దురదృష్టవశాత్తూ ఆ కాంట్రాక్టర్లు రోజుకు కేవలం రూ.700 వరకు సంపాదించే అటెండెంట్ల జీతాల నుంచి ఈ మొత్తాన్ని (దిండుకు రూ.115, బ్లాంకెట్‌కు రూ.343 చొప్పున) కట్ చేస్తున్నారు. ప్రయాణికుల నిర్వాకానికి పేద కార్మికులు బలి కావడం ఆందోళనకరం.

చోరీల నివారణకు రైల్వే శాఖ చర్యలు

కోచ్ మిత్ర యాప్ ద్వారా అటెండెంట్లు ప్రయాణికుల బోర్డింగ్, డీ-బోర్డింగ్ సమయాలను ట్రాక్ చేస్తూ వస్తువుల పంపిణీని పర్యవేక్షిస్తున్నారు. అలాగే ప్రయాణం ముగియడానికి 30 నిమిషాల ముందే బెడ్‌రోల్ వస్తువులను తిరిగి సేకరించేలా ప్యాకెట్లపై స్పష్టమైన మార్గదర్శకాలు ముద్రిస్తున్నారు. కోచ్‌లలో నిఘా పెంచడంతో పాటు అనుమానాస్పద ప్రయాణికుల లగేజీని రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ (ఆర్‌పీఎఫ్‌) సాయంతో చట్టబద్ధంగా తనిఖీ చేయాలని ఆదేశాలు జారీ చేశారు.

 

Latest News