విధాత, హైదరాబాద్ : సీఎం రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా కొండా సుస్మితా పటేల్ నేరుగా విమర్శలు చేసి పార్టీ లైన్ ధాటారని, అనిరుధ్, రాజగోపాల్ రెడ్డిలు ప్రభుత్వాన్ని నేరుగా విమర్శించలేదని, వారి వ్యాఖ్యలు పార్టీ లైన్ లోనే ఉన్నాయని కాంగ్రెస్ క్రమశిక్షణా కమిటీ చైర్మన్ మల్లు రవి స్పష్టం చేశారు. శనివారం గాంధీభవన్ లో నిర్వహించిన కమిటీ సమావేశం ముగిసిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. క్రమశిక్షణ కమిటీ భేటీలో మూడు విషయాలపై చర్చించాం అని, కొండా సుస్మిత వ్యాఖ్యలపై మంత్రి కొండా సురేఖ నుంచి రిప్లై వచ్చిందని, కొండ సురేఖ వివరణపై మరోసారి సమావేశం అవుతాం అని మల్లు రవి తెలిపారు.
సుస్మిత మాట్లాడిన వీడియోలను చూశాం అని, సుస్మిత అనుచి వ్యాఖ్యలు చేసినట్లు కనిపించిందని అన్నారు. ముఖ్యమంత్రిని మాములు వ్యక్తి గా అనుచిత వాఖ్యలు చేసిందని మల్లు తెలిపారు. అలాగే పలువురు ఎమ్మెల్యేలు మంత్రి కొండా సురేఖపై మాట్లాడిన వీడియోలు కూడా చూశాం అని ఆమెపై ఎమ్మెల్యేలు ఫిర్యాదు చేస్తామని చెప్పారని వెల్లడించారు. అందరి ఫిర్యాదులు తీసుకున్నాక మరోసారి కొండా వ్యవహారంపై భేటీ అవుతాం అని మల్లు రవి తెలిపారు.
ఇక సీనియర్ కాంగ్రెస్ నాయకులు, ప్రణాళిక సంఘం వైస్ చైర్మన్ జి. చిన్నారెడ్డి వనపర్తి ఎమ్మెల్యే మేఘారెడ్డిపైన, ప్రభుత్వంపైన చేసిన వ్యాఖ్యలపై వివరణ ఇచ్చారని, దీనిపై ఎమ్మెల్యే మెఘారెడ్డిని కమిటీ ముందుకు పిలుస్తాం అని, చిన్నారెడ్డి వివరణ లేఖపై మేఘారెడ్డి నుంచి వివరణ తీసుకుంటాం అని మల్లు రవి తెలిపారు. ఆదిలాబాద్ లో జరిగిన పొలిటికల్ ఎఫెక్స్ కమిటీ సమావేశంలో కంది శ్రీనివాస్ రెడ్డికి సంజీవ రెడ్డికి జరిగిన వివాదంపై ఇప్పటికే షోకాజ్ నోటీసులు ఇచ్చామని, మంత్రి జూపల్లి కృష్ణారావు నుంచి నివేదిక తీసుకున్నామని తెలిపారు. జక్కిడి ప్రభాకర్ రెడ్డిని పార్టీ నుండి సస్పెండ్ చెయ్యడం జరిగిందని మల్లు రవి గుర్తు చేశారు.
కొండా సురేఖను కాపాడలేం: పీసీసీ చీఫ్ మహేశ్ గౌడ్
సీఎం రేవంత్ రెడ్డిపై కూతురు కొండా సుస్మిత చేసిన అనుచిత వ్యాఖ్యలపై మంత్రి కొండా సురేఖ ఇచ్చిన వివరణపై కాంగ్రెస్ హైకమాండ్ సంతృప్తి లేదని, ఆమెను గతంలో కాపాడామని, ఈసారి హైకమాండ్ సీరియస్ గా ఉన్నందునా కాపాడలేం అని పీసీసీ చీఫ్ బి.మహేశ్ కుమార్ కుమార్ గౌడ్ వెల్లడించారు. కొండా సుస్మిత వ్యాఖ్యలపై అధిష్టానం సీరియస్ గా ఉందని, అనిరుధ్, రాజగోపాల్ రెడ్డిల వ్యాఖ్యలు పార్టీ లైన్ లోనే ఉన్నాయని ఆయన చెప్పుకొచ్చారు.