మళ్లీ రూ.1000 నోట్లు చెలామణిలోకి..! ఆర్‌బీఐ వర్గాలు ఏమన్నాయంటే..?

మళ్లీ రూ.1000 నోట్లు చెలామణిలోకి..! ఆర్‌బీఐ వర్గాలు ఏమన్నాయంటే..?

విధాత‌: ఇటీవల రూ.2000 నోట్లను రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా చెలామణి నుంచి వెనక్కి తీసుకున్నది. కొంతకాలంగా వాటి స్థానంలో రూ.1000 నోట్లను ప్రవేశపెట్టనున్నారనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. అయితే, అలాంటి ఆలోచనేమీ ఆర్‌బీఐకి లేదని సంబంధిత వర్గాలు తెలిపాయి. మళ్లీ ప్రవేశపెట్టే విషయంపై ఎలాంటి నిర్ణయాన్ని తీసుకోలేదని, దీనిపై ఎలాంటి ఆలోచనలు చేయడం లేదని సమాచారం.


గతంలో రూ.1000 నోటు చెలామణిలో ఉన్న విషయం తెలిసిందే. 2016లో మోదీ ప్రభుత్వం పెద్ద నోట్లను రద్దు చేస్తూ సంచలనం నిర్ణయాన్ని తీసుకున్నది. రూ.500 నోట్లతో పాటు రూ.1000 నోట్లను రద్దు చేసింది. ఆ తర్వాత రూ.2వేల నోటను కొత్తగా ప్రవేశపెట్టింది. రూ.500 నోట్లలోనూ మార్పులు చేస్తూ తీసుకువచ్చింది.


అయితే, గతకొద్దిరోజులుగా రూ.1000 నోట్లను మళ్లీ తీసుకువస్తారనే ప్రచారం జరుగుతుండగా.. ఈ క్రమంలో సంబంధిత వర్గాలు స్పష్టత ఇచ్చాయి. రూ.2వేల నోట్లను ప్రవేశపెట్టిన తర్వాత లక్ష్యం నెరవేరిందని, ఈ క్రమంలో వాటిని చెలామణి నుంచి ఉపసంహరించుకుంటున్నట్లు ఈ ఏడాది మేలో ప్రకటించింది. వాటిని మార్చుకునేందుకు, బ్యాంకులో డిపాజిట్‌ చేసేందుకు అవకాశం ఇచ్చింది.


అక్టోబర్‌ 7వ తేదీతో గడువు ముగిసినా ఇంకా ప్రస్తుతం రూ.10వేల కోట్ల విలువైన నోట్లు బ్యాంకులకు తిరిగి రాలేదని, ప్రజల వద్దే ఉన్నాయని ఆర్‌బీఐ గవర్నర్‌ శక్తికాంత దాస్‌ తెలిపారు. రూ.2వేల నోట్లను తిరిగి ఇచ్చేస్తారని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. అయితే, రూ.2వేల నోట్లు డినామినేషన్‌ నోట్లతో 87శాతం డిపాజిట్ల రూపంలో తిరిగి వచ్చాయని, మిగతా వాటిని కౌంటర్లలో మార్చుకున్నారని గత నెలలో ఆర్‌బీఐ గవర్నర్‌ పేర్కొన్నారు.


వాస్తవానికి రూ.2వేల నోట్లను మార్చుకునేందుకు, డిపాజిట్‌ చేసేందుకు గడువును సెప్టెంబర్‌ 30వ కాగా.. ఆ తర్వాత మరో వారం రోజులు గడువును పొడిగించింది. అప్పటి నుంచి బ్యాంకుల్లో రూ.2వేల నోట్ల డిపాజిట్‌ను నిలిపివేశారు. అయితే, ఇప్పటికీ రూ.2వేల నోట్లను స్వీకరిస్తుండగా.. వ్యక్తులు.. సంస్థల నుంచి రూ.2వేల ఓటర్లను ఆర్‌బీఐ ప్రాంతీయ కార్యాలయాల్లో ఒకేసారి రూ.20వేల చొప్పున మార్చుకునేందుకు అవకాశం కల్పించారు.