B Sudarshan Reddy on KCR | ఉప రాష్ట్రపతి ఎన్నిక విషయంలో కేసీఆర్‌పై రిటైర్డ్‌ జస్టిస్‌ బీ సుదర్శన్‌రెడ్డి కీలక వ్యాఖ్యలు

ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా పోటీ చేయడం సంతోషంగా ఉందని ఇండియా కూటమి అభ్యర్థి రిటైర్డ్‌ జస్టిస్‌ బీ సుదర్శన్ రెడ్డి అన్నారు. గెలిచే అవకాశాలు తనకు తక్కువ లేవని, కచ్చితంగా తాను గెలుస్తానని ధీమా వ్యక్తం చేశారు.

  • By: TAAZ |    national |    Published on : Aug 20, 2025 8:32 PM IST
B Sudarshan Reddy on KCR | ఉప రాష్ట్రపతి ఎన్నిక విషయంలో కేసీఆర్‌పై రిటైర్డ్‌ జస్టిస్‌ బీ సుదర్శన్‌రెడ్డి కీలక వ్యాఖ్యలు

న్యూఢిల్లీ, ఆగస్ట్‌ 20 (విధాత) :

B Sudarshan Reddy on KCR | ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా పోటీ చేయడం సంతోషంగా ఉందని ఇండియా కూటమి అభ్యర్థి రిటైర్డ్‌ జస్టిస్‌ బీ సుదర్శన్ రెడ్డి అన్నారు. గెలిచే అవకాశాలు తనకు తక్కువ లేవని, కచ్చితంగా తాను గెలుస్తానని ధీమా వ్యక్తం చేశారు. గురువారం ఇండియా కూటమి తరఫున ఉప రాష్ట్రపతి పదవికి జస్టిస్‌ సుదర్శన్‌రెడ్డి నామినేషన్ దాఖలు చేయ్యనున్నారు. ఈ సందర్బంగా తెలుగు మీడియాతో మాట్లాడుతూ తాను తెలంగాణలో పుట్టినప్పటికీ తాను భారతదేశ పౌరుడినని అన్నారు. ఉప రాష్ట్రపతి పదవిని, దేశాన్ని వేరుగా చూడొద్దని అన్నారు. ఈ పదవికి ఎవరు సరైనవారో ఎంపీలు నిర్ణయిస్తారని చెప్పారు. బాధ్యత కలిగిన సభ్యులంతా తనకు ఓటు వేస్తారన్న ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. ఉభయ తెలుగు రాష్ట్రాల ఎంపీల మద్దతు ఉంటుందని భావిస్తున్నట్టు చెప్పారు. అన్ని పార్టీల నాయకులతో తనకు సన్నిహిత సంబంధాలు ఉన్నాయని తెలిపారు. చాలా రాజకీయ అనుభవం కలిగిన బీఆరెస్‌ అధినేత కేసీఆర్‌ సరైన నిర్ణయం తీసుకుంటారని భావిస్తున్నానని చెప్పారు. తాను ఆ పదవికి అర్హుడిని అనిపిస్తే తనకు ఓటేయాలని ఎంపీలను కోరారు.

స్వయంగా దేశ ప్రధానే వారి అభ్యర్థికి ఓటు వేయాలని కోరుతుండగా.. తనకు ఓటేయాలని ఎంపీలను తాను కోరడంలో తప్పేమీ లేదని సుదర్శన్ రెడ్డి స్పష్టం చేశారు. ప్రజా క్షేత్రంలోకి వచ్చానని, ఇందులో దాపరికం ఏమీ లేదని అన్నారు. ‘ఉప రాష్ట్రపతి పీఠం రాజకీయ వ్యవస్థ కాదు.. అదో రాజ్యంగబద్దమైన పదవి’ అని తెలిపారు. ఈ పదవికి తనను పోటీచేయాలని కోరినప్పుడు.. ఇది రాజకీయ వ్యవస్థ కాదన్న ఉద్దేశంతోనే పోటీకి అంగీకరించానని వెల్లడించారు. భారత రాజకీయ వ్యవస్థలో మార్పులు రావాలని సుదర్శన్‌రెడ్డి ఆకాంక్షించారు. తాను విజయం సాధిస్తే రాజ్యంగ పరిరక్షణకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఇది రాజకీయ పార్టీల మధ్య పోరు కాదని సుదర్శన్‌రెడ్డి అన్నారు. తనకు ఎలాంటి భావజాలం లేదని, ఏ రాజకీయ పార్టీతో సన్నిహిత సంబంధాలు లేవని స్పష్టం చేశారు. న్యాయమూర్తిగా స్వేచ్ఛ, సమానత్వం తనకు స్పష్టమైన అవగాహన ఉందన్నారు.

ఇవి కూడా చదవండి..

Hyderabad Weather | హైదరాబాద్‌లో రాత్రిళ్లు కుండపోత వర్షాల వెనుక గుట్టు
వైరల్ వీడియో :చెమట పరాటా చూసారా ఎప్పుడైనా? ఇదిగో చూడండి!
Delhi CM Rekha Gupta| ఢిల్లీ సీఎం రేఖా గుప్తాపై దాడి!