Hyderabad Weather | హైదరాబాద్‌లో రాత్రిళ్లు కుండపోత వర్షాల వెనుక గుట్టు

హైదరాబాద్‌లో విచిత్ర వాతావరణం నెలకొంది. పగలు తెరిపి, రాత్రి కుండపోత. ఈ వర్షాల వెనుక శాస్త్రీయ కారణాలు, తెలంగాణ వ్యాప్తంగా వర్షాల ప్రభావంపై హైదరాబాద్​ వాతావరణ కేంద్ర శాస్త్రవేత్తల వివరణ

Hyderabad Weather | హైదరాబాద్‌లో రాత్రిళ్లు కుండపోత వర్షాల వెనుక గుట్టు

Hyderabad Bureau / Hyderabad / Telangana / 20th August 2025

Hyderabad Weather | గత వారం రోజులుగా తెలంగాణ రాష్ట్రం అంతా వర్షాల దెబ్బకు తడిసి ముద్దైంది. జూన్‌లో నైరుతి రుతుపవనాలు మొదలైనప్పటికీ అప్పట్లో వర్షపాతం చాలా తక్కువగా నమోదైంది. దాంతో 23% వరకు లోటు ఏర్పడింది. కానీ జూలై, ఆగస్టులో వరుసగా కురిసిన వర్షాల వలన ఆ లోటు క్రమంగా తగ్గిపోయి, ఇప్పుడు సగటు వర్షపాతాన్ని మించి 17% అధికంగా నమోదైంది.
ఆగస్టు 13 నుంచి 18 మధ్య కాలంలో రాష్ట్ర వ్యాప్తంగా 150 కంటే ఎక్కువ చోట్ల అత్యంత భారీ వర్షాలు నమోదు కావడం విశేషం. నాగర్‌కర్నూల్‌లో 20 సెంటీమీటర్లు, వికారాబాద్‌లో 15 సెంటీమీటర్లు, ములుగులో 20 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది.

ఉత్తర తెలంగాణలో ఎప్పుడూ వర్షాలే ఎందుకు?

తెలంగాణ రాష్ట్రంలో అధిక వర్షపాతం ఎప్పుడూ ఉత్తర, తూర్పు జిల్లాల్లోనే ఎక్కువగా నమోదవుతుంటుంది. ఆదిలాబాద్, ములుగు, భూపాలపల్లి, మంచిర్యాల వంటి ప్రాంతాలు ప్రధాన ఉదాహరణలు.

కారణాలు:

  • ఈ జిల్లాల్లో భౌగోళిక పరిస్థితులు వర్షాల ఏర్పాటుకు అత్యంత అనుకూలం.
  • గోదావరి, కృష్ణా వంటి పెద్ద నదులు జిల్లాలను ఆనుకుని ప్రవహించడం వలన తేమ అధికంగా ఉంటుంది.
  • కొండలు, అడవులు, వాగులు ఈ తేమను నిలిపి ఉంచి వర్షపాతం పెంచుతాయి.
  • అల్పపీడన ప్రభావం ఎక్కువగా ఉత్తర తెలంగాణపైనే ఉండటంతో, ఆ ప్రాంతాల్లో వర్షాలు మరింతగా కురుస్తాయి.

వాతావరణ శాస్త్రవేత్తల మాటల్లో చెప్పాలంటే – ఉత్తర తెలంగాణలో వర్షపాతం ఎక్కువగా ఉండటం సహజం. వేసవిలో కూడా ఈ ప్రాంతంలో ఎండ తీవ్రత ఎక్కువగా ఉండగా, వర్షాకాలంలో భారీ వర్షాలు పడటం సాధారణమే.

హైదరాబాద్‌లో రాత్రి వర్షాలు – వింత వాతావరణం

ఇక రాజధాని హైదరాబాద్‌లో పరిస్థితి వేరేలా ఉంది. పగలు వర్షం కురవకపోయినా, రాత్రి పూట మాత్రం కుండపోతలా వర్షం పడుతోంది. ఈ విచిత్రం వెనుక శాస్త్రీయ కారణాలు ఉన్నాయి.

  • జనాభా విపరీత పెరుగుదల: గత దశాబ్దంలో హైదరాబాద్ నగర జనసాంద్రత విపరీతంగా పెరిగింది. జనాభా పెరగడం వలన నగరంలోని ఉష్ణోగ్రతల్లో ఊహించని మార్పులు వస్తున్నాయి.
  • నగరప్రాంత ఉష్ణోగ్రత ప్రభావం: కాంక్రీట్ భవనాలు, రోడ్లు పగటి పూట వేడిని గ్రహించి రాత్రిపూట వాతావరణంలోకి విడుదల చేస్తాయి. దీనివల్ల వాతావరణంలో అదనపు శక్తి చేరి వర్షపు మేఘాల తయారీకి సహకరిస్తుంది.
  • క్యుములో-నింబస్ మేఘాలు: హైదరాబాదు డెక్కన్ పీఠభూమిపై ఉండటం వలన ఈ మేఘాలు తక్కువ ఎత్తులోనే  ఉంటాయి. అందువల్ల రాత్రి సమయంలోనే కేంద్రీకృతమై వర్షాలను కురిపిస్తాయి.
  • పగలు వేడి – సాయంత్రం తేమ: పగటిపూట వేడి, సాయంత్రం తర్వాత గాలిలో తేమ కలిసిపోవడంతో రాత్రి వర్షాలకు అనువైన పరిస్థితులు ఏర్పడతాయి.

గత పదేళ్లలో స్పష్టమైన మార్పులు

వాతావరణ శాస్త్రజ్ఞుల పరిశీలన ప్రకారం, గత పదేళ్లుగా హైదరాబాదులో రాత్రివేళల్లో వర్షాల పెరుగుదల స్పష్టంగా కనిపిస్తోంది. జనాభా భారంతో పాటు వాతావరణ మార్పులు దీనికి ప్రధాన కారణాలు. ఈ ట్రెండ్ రాబోయే సంవత్సరాల్లో మరింత పెరిగే అవకాశం ఉందని వారు హెచ్చరిస్తున్నారు.

రాత్రి వర్షాల ప్రభావం

  • ప్రజల ఇబ్బందులు: అర్థరాత్రి కుండపోత పడటంతో లోతట్టు ప్రాంతాలు జలమయం అవుతున్నాయి. అధికారులు కూడా రాత్రివేళల్లోనే రోడ్లపైకి వచ్చి నీటిని తొలగించాల్సి వస్తోంది. దీనికి తోడు కరెంటు పోవడం, చెట్లు కూలడం మరింత జటిలంగా మారుస్తోంది.
  • ట్రాఫిక్ సమస్యలు: వాహనదారులు ముంపులో ఇరుక్కుపోవడం, ట్రాఫిక్ జామ్‌లు ఏర్పడటం సాధారణమైపోయింది.
  • ఇళ్లలోకి నీరు: పాత బస్తీలు, లోతట్టు కాలనీల్లో ఇళ్లలోకి వర్షపు నీరు చేరిపోవడం ప్రజలకు తలనొప్పిగా మారింది. నగరమంతటా వాననీరు పోవడానికి సరైన డ్రయినేజి వ్యవస్థ లేకపోవడం అతిపెద్ద సమస్య.

ఇవి కూడాా చదవండి..

Hyderabad Flooded Roads GHMC Negligence | వరదలా ‘ఉదాశీనత’! సొంత రాష్ట్రంలోనూ తీరని వెతలు!
Hyderabad Rain Traffic Problem | హైదరాబాద్‌లో రోడ్డు కింది బావులు  అట్టర్ ఫ్లాప్!
GHMC Deputation Corruption | జీహెచ్ఎంసీలో తిష్ఠ వేసిన ‘డిప్యూటేషన్’