Supreme Court । కస్టడీలో ఎంతకాలం.. ఈడీ కన్విక్షన్‌ రేటెంత? : సుప్రీం కీలక వ్యాఖ్యలు

Supreme Court । కస్టడీలో ఎంతకాలం.. ఈడీ కన్విక్షన్‌ రేటెంత? : సుప్రీం కీలక వ్యాఖ్యలు

Supreme Court । మనీలాండరింగ్‌ కేసులో అరెస్టయి ఉన్న పశ్చిమబెంగాల్‌ విద్యాశాఖ మాజీ మంత్రి పార్థ ఛటర్జీ బెయిల్‌ పిటిషన్‌పై విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు బుధవారం కీలక వ్యాఖ్యలు చేసింది. ఎలాంటి విచారణ లేకుండా దీర్ఘకాలంగా ఆయనను కస్టడీలో ఉంచడంపై ఆందోళన వ్యక్తం చేసింది. ఈ కేసు రిజిస్టర్‌ చేసిన ఈడీ కన్విక్షన్‌ రేటు చాలా పేలవంగా ఉన్న విషయాన్ని ప్రస్తావించింది. ఈడీకంటే ముందు సీబీఐ కూడా పార్థా ఛటర్జీని అరెస్టు చేసిన విషయం చెప్పడంపై జస్టిస్‌ సూర్యకాంత్‌, జస్టిస్‌ ఉజ్జల్‌ భూయాన్‌ ధర్మాసనం స్పందిస్తూ.. ఈ రెండు కేసులలో పోలీస్‌, జ్యుడిషియల్‌ కస్టడీలో ఆయన ఎంతకాలం ఉన్నారో తెలుసుకోవాలనుకుంటున్నామని పేర్కొన్నది. ఈ కేసులో తదుపరి విచారణను డిసెంబర్‌ 2, 2024న చేపట్టనున్నట్టు ప్రకటించిన ధర్మాసనం.. సీబీఐ అరెస్టుకు సంబంధించిన సూచనలు కూడా తీసుకోవాలని ఈ కేసులో ఈడీ తరఫున హాజరైన అదనపు సొలిసిటర్‌ జనరల్‌ ఎస్వీ రాజును కోరింది. పశ్చిమబెంగాల్‌ అసిస్టెంట్‌ ప్రైవరీ టీచర్స్‌ రిక్రూట్‌మెంట్‌ కుంభకోణానికి సంబంధించిన మనీలాండరింగ్‌ కేసులో బెయిల్‌ కోసం ఛటర్జీ పిటిషన్‌ పెట్టుకున్నారు.

పార్థా ఛటర్జీ తరఫున వాదనలు వినిపించిన సీనియర్‌ అడ్వొకేట్‌ ముకుల్‌ రోహత్గీ.. 70 ఏళ్ల వయసులో ఉన్న వ్యక్తిని 2022, జూలై 23న అరెస్టు చేశారని, అప్పటి నుంచి దాదాపు రెండున్నర ఏళ్ల నుంచి కస్టడీలోనే ఉన్నారని తెలిపారు. ఈ కేసులో 183 మంది సాక్షులను విచారించాల్సి ఉన్నదని, సమీప భవిష్యత్తులో ఈ కేసు విచారణ ముగిసే అవకాశాలు లేవని పేర్కొన్నారు. ఇదే కేసులో సొమ్ము కూడా రికవరీ అయిన మహిళా నిందితురాలికి ఇప్పటికే బెయిల్‌ మంజూరైన విషయాన్ని ధర్మాసనం దృష్టికి రోహత్గీ తీసుకెళ్లారు. ఛటర్జీ నుంచి ఎలాంటి సొమ్ము రికవరీ కాలేదని చెప్పారు. అయితే.. తన వద్ద రికవరీ చేసిన సొమ్ము పార్థా ఛటర్జీదేనని సహ నిందితురాలు అర్పిత ముఖర్జీ స్టేట్‌మెంట్‌ ఇచ్చారని అదనపు సొలిసిటర్‌ జనరల్‌ రాజు తెలిపారు.

ఇదిలా ఉంటే.. రెండేళ్ల తర్వాత కూడా విచారణ ఇంకా మొదలు కాలేదని, ఇంకెంత కాలం ఆయనను మీ వద్ద ఉంచుకుంటారని ధర్మాసనం ప్రశ్నించింది. విచారణ పూర్తయ్యే నాటికి ఆయన నిర్దోషిగా తేలితే ఏం జరుగుతుందని ధర్మాసనం ప్రశ్నించింది. ‘రెండున్నర, మూడేళ్లు ఎదురు చూడటం అంటే అదేమీ చిన్న సమయం కాదు’ అని జస్టిస్‌ భూయాన్‌ అన్నారు. రాజును ఉద్దేశించి.. ‘మీ కన్విక్షన్‌ రేటు ఎంత? అదికనుక 60 నుంచి 70 శాతం వరకూ ఉంటే మేం అర్థం చేసుకోగలం. కానీ అది చాలా పేలవంగా ఉన్నది’ అన్నారు. ఛటర్జీకి ఎలాంటి సాంత్వన కలిగించరాదని రాజు వాదించారు. ఆయన చాలా ప్రభావశీల వ్యక్తి అని, ఆయన విషయంలో తనకు భయంగా ఉన్నదని సహ నిందితురాలు అర్పిత కూడా చెప్పారని తెలిపారు. ఇదే కేసులో ఆయనను సీబీఐ కూడా అరెస్టు చేసిందని చెప్పారు. ప్రిడికేట్‌ ఆఫీస్‌ రిజిస్ట్రేషన్‌ తర్వాత దాదాపు రెండేళ్లకు సీబీఐ అరెస్టు చేయడాన్ని రోహత్గీ ప్రశ్నించారు. ఇది తప్పుడు ఉద్దేశాలతో జరిగిన అరెస్టని వాదించారు.