Weather Report | ఆ ప్రాంతాల్లో వడగాలులు ముగింపు దశకు!

దేశవ్యాప్తంగా వడగాలులు ముగింపు దశకు చేరుకున్నాయని భారత వాతావరణ విభాగం గురువారం ప్రకటించింది. అయితే.. రాజస్థాన్‌, కేరళలోని కొన్ని ప్రాంతాల్లో ఇంకా వడగాలులు వీస్తూనే ఉన్నాయని తెలిపింది. దీంతో ఆ యా ప్రాంతాలకు హెచ్చరికలు జారీ చేసింది.

  • By: Tech |    national |    Published on : May 09, 2024 10:15 PM IST
Weather Report | ఆ ప్రాంతాల్లో వడగాలులు ముగింపు దశకు!
  • రాజస్థాన్‌, కేరళలో ఇంకా మంటలే

  • మూడు రోజులు తెలంగాణలో వానలు

  • భారత వాతావరణ విభాగం వెల్లడి

న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా వడగాలులు ముగింపు దశకు చేరుకున్నాయని భారత వాతావరణ విభాగం గురువారం ప్రకటించింది. అయితే.. రాజస్థాన్‌, కేరళలోని కొన్ని ప్రాంతాల్లో ఇంకా వడగాలులు వీస్తూనే ఉన్నాయని తెలిపింది. దీంతో ఆ యా ప్రాంతాలకు హెచ్చరికలు జారీ చేసింది. దేశ రాజధాని ఢిల్లీలో బుధవారం 38.2 డిగ్రీల సెల్సియస్‌ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఇది ఈ సీజన్‌లో సగటు ఉష్ణోగ్రత కంటే ఒక డిగ్రీ తక్కువ. పశ్చిమ రాజస్థాన్‌లోని కొన్ని ప్రాంతాల్లో ఇంకా తీవ్ర వడగాలులు కొనసాగుతాయని ఐఎండీ శాస్త్రవేత్త సోమాసేన్‌ తెలిపారు. అయితే.. కొన్ని అంశాల ప్రాతిపదికన ఎల్లో అలర్ట్‌ జారీ చేసినట్టు చెప్పారు. బంగాళాఖాతం నుంచిబలమైన తేమగాలులు వీస్తుండటంతో వాతావరణ పరిస్థితుల్లో మార్పు కనిపిస్తున్నదని ఆమె వివరించారు. దీని వల్ల వివిధ ప్రాంతాల్లో ఉరుములతో కూడిన గాలివానలు కురుస్తాయని ఆమె తెలిపారు. త్రిస్సూర్‌, పాలక్కడ్‌లలో 39 డిగ్రీలు, అలప్పుళలో 38 డిగ్రీలు, కొల్లాం, కొట్టాయం, పత్నంతిట్ట, ఎర్నాకుళం, కోరికోడ్‌లో 37 డిగ్రీల చొప్పున మే 10వ తేదీ వరకూ ఉష్ట్రోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉన్నదని తెలిపారు.

రానున్న రోజుల్లో పలురకాల వాతావరణ వ్యవస్థలు దేశంలోని వివిధ ప్రాంతాలను ప్రభావితం చేస్తాయని, వర్షాలు, ఉరుములు, పిడుగులు, బలమైన గాలులు వీచే అవకాశం ఉన్నదని ఐఎండీ పేర్కొన్నది. దక్షిణ భారతదేశంలోని దక్షిణ ఇంటీరియర్‌ కర్ణాటకతోపాటు మే 9, 12, 13 తేదీల్లో తమిళనాడు, పుదుచ్చేరి, కరైకల్‌, రాయలసీమ, తెలంగాణ, కేరళ, మహే ప్రాంతాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉన్నదని తెలిపింది.