Lemongrass Farming | కాసుల వ‌ర్షం కురిపిస్తున్న ‘నిమ్మ గ‌డ్డి’.. ఏడాదికి రూ. 30 ల‌క్ష‌లు సంపాదిస్తున్న సాఫ్ట్‌వేర్ దంప‌తులు

Lemongrass Farming | ఇటీవ‌లి కాలంలో చాలా మంది ప్ర‌యివేటు ఉద్యోగులు.. మ‌రి ముఖ్యంగా సాఫ్ట్‌వేర్ ఇంజినీర్స్( Software Engineers ).. కంప్యూట‌ర్ల‌ను వ‌దిలేసి.. క‌ర్ష‌కులుగా మారుతున్నారు. అలా అన్న‌దాత‌లుగా( Farmers ) మారిన సాఫ్ట్‌వేర్ ఇంజినీర్లు ల‌క్ష‌లు, కోట్ల‌లో సంపాదిస్తున్నారు. ఓ ఇద్ద‌రు సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ దంప‌తులు కూడా మంచి ప్యాకేజీతో కూడిన ఉద్యోగాన్ని వ‌దిలేసి.. పొలం బాట ప‌ట్టారు. అది కూడా నిమ్మ గ‌డ్డి సాగు( Lemongrass Farming )తో ఏడాదికి రూ. 30 ల‌క్ష‌లు సంపాదిస్తూ.. నేటి త‌రానికి మార్గ‌ద‌ర్శ‌కులుగా నిలిచారు.

Lemongrass Farming | కాసుల వ‌ర్షం కురిపిస్తున్న ‘నిమ్మ గ‌డ్డి’.. ఏడాదికి రూ. 30 ల‌క్ష‌లు సంపాదిస్తున్న సాఫ్ట్‌వేర్ దంప‌తులు

Lemongrass Farming | మ‌హారాష్ట్ర‌( Maharashtra )లోని కొంక‌ణ్( Konkan ) ఏరియాకు చెందిన గౌరి, దిలీప్ ప‌ర‌బ్( Dilip Parab ) దంప‌తులు వృత్తి రీత్యా సాఫ్ట్‌వేర్ ఉద్యోగులు. ముంబై( Mumbai )లోని ఎల్ అండ్ టీ ఇన్ఫోటెక్( L & T Infotech ) కంపెనీలో సాఫ్ట్‌వేర్ ఇంజినీర్లుగా ప‌ని చేశారు. జీతం బాగానే ఉంది. కానీ హోమ్ టౌన్‌కు రావాల‌ని నిర్ణ‌యించుకున్నారు. అది కూడా వ్య‌వ‌సాయం( Agriculture ) చేసేందుకే. దీంతో ఇద్ద‌రు త‌మ ఉద్యోగాల‌కు రాజీనామా చేసి కొంక‌ణ్ తిరిగొచ్చారు.

సింధుదుర్గ్ జిల్లాలోని తితావ్లి గ్రామంలో ఆరు ఎక‌రాల భూమిని కొనుగోలు చేశారు. ఇక 2021లో ఆ భూమిలో నిమ్మ గ‌డ్డిని సాగు( lemongrass Farming ) చేయ‌డం ప్రారంభించారు. ఎందుకంటే ఆ ఏరియాలో ఎవ‌రూ కూడా నిమ్మ‌గ‌డ్డిని సాగు చేయ‌డం లేదు. దీనికి మార్కెట్‌లో కూడా డిమాండ్ భారీగా ఉంది. ఇక కొంక‌ణ్ ఏరియాలో ఉన్న వాతావ‌ర‌ణ ప‌రిస్థితులు కూడా నిమ్మ‌గ‌డ్డి సాగుకు అనుకూలంగా ఉన్నాయి. కాబ‌ట్టి లెమ‌న్ గ్రాస్‌ను పెంచ‌డం ప్రారంభించామ‌ని దిలీప్ పేర్కొన్నాడు.

లెమ‌న్‌గ్రాస్ ఆయిల్‌ 80 దేశాల‌కు ఎగుమ‌తి

నిమ్మ‌గ‌డ్డిని సంవ‌త్స‌రానికి మూడు సార్లు సాగు చేయొచ్చు. క‌ట్ చేసిన నిమ్మ గ‌డ్డితో అనేక ర‌కాల ఉత్ప‌త్తుల‌ను త‌యారు చేయొచ్చు. మ‌రి ముఖ్యంగా ఆర్గానిక్ ఉత్ప‌త్తుల‌కు నిమ్మ‌గ‌డ్డిని ఉప‌యోగిస్తున్నారు. కాస్మోటిక్, ఫార్మాస్యూటిక‌ల్స్, ఫుడ్, బేవ‌రేజెస్ ఉత్ప‌త్తుల్లో నిమ్మ‌గ‌డ్డితో పాటు దాని నుంచి త‌యారు చేసిన నూనెను విరివిగా ఉప‌యోగిస్తున్నారు. దీంతో దీనికి డిమాండ్ భారీగా ఉంది. ఇండియా నిమ్మ‌గ‌డ్డి సాగులో నంబ‌ర్‌వ‌న్‌గా ఉంది. అంతేకాకుండా లెమ‌న్‌గ్రాస్ ఆయిల్‌( Lemongrass Oil )ను 80 దేశాల‌కు ఎగుమ‌తి చేస్తుంది. ప్ర‌ధానంగా నార్త్ అమెరికా, యూర‌ప్, ఆసియా దేశాల‌కు ఎగుమ‌తి చేస్తుంది అని దిలీప్ దంప‌తులు పేర్కొన్నారు.

ఒక్క ఎక‌రా పొలంలో 25 వేల వ‌ర‌కు మొక్క‌లు

ఇక నిమ్మ‌గ‌డ్డిని సాగు చేయాల‌నుకున్న‌ప్పుడు.. కృష్ణ వెరైటీని ఎంచుకున్నాం. ఒక్కో మొక్క‌ను రూ.2.5కు కొనుగోలు చేశాం. వీటిని హైద‌రాబాద్( Hyderabad ) న‌గ‌రంలోని ఓ న‌ర్స‌రీలో కొనుగోలు చేసిన‌ట్లు దిలీప్ తెలిపాడు. ఒక్క ఎక‌రా పొలంలో 25 వేల వ‌ర‌కు మొక్క‌లు నాటారు. ప్ర‌తి వ‌రుస‌కు ఒక అడుగు దూరం ఉండేలా ప్లాన్ చేశారు. ఇక మొక్కకు మొక్క మ‌ధ్య‌లో 1.5 అడుగుల దూరం ఉండేలా జాగ్ర‌త్త‌లు తీసుకున్నారు. మొద‌ట ఎక‌రా పొలంలో ప్రారంభించిన ఈ సాగు.. ఇప్పుడు ఎనిమిది ఎక‌రాల‌కు చేరుకుంది. ఇందులో ఆరు ఎక‌రాలు సొంతం కాగా, మ‌రో రెండు ఎక‌రాల‌ను లీజుకు తీసుకున్న‌ట్లు గౌరి తెలిపింది.

ఏడాదికి రూ. 30 ల‌క్ష‌లు సంపాద‌న‌..

మొద‌టి సాగు నాలుగు నెల‌ల్లోనే చేతికి వ‌చ్చింది. ప్ర‌తి 90 రోజుల‌కు ఒకసారి నిమ్మ‌గ‌డ్డి కోత‌కు వ‌స్తుంది. ఏడాదికి సుల‌భంగా మూడు సార్లు ఈ నిమ్మ‌గ‌డ్డిని సాగు చేయొచ్చ‌ని దిలీప్ పేర్కొన్నాడు. ఇక ఈ గ‌డ్డిని ఎక్స్‌ట్రాక్ట్ చేసేందుకు ఓ చిన్న యూనిట్‌ను కూడా నెల‌కొల్పారు. మొత్తంగా అధునాత‌న యంత్రాల‌ను ఉప‌యోగించి నిమ్మ‌గడ్డిని ఎక్స్‌ట్రాక్ట్ చేసి ఆయిల్‌ను త‌యారు చేస్తున్నారు. ఈ ఆయిల్‌తో స‌బ్బుల‌ను త‌యారు చేయ‌డంతో పాటు హెర్బ‌ల్ ఫ్లోర్ క్లీన‌ర్‌ను త‌యారు చేస్తున్నారు. ఒక్కో లీట‌ర్ ఆయిల్‌ను రూ. 850 నుంచి రూ. 1500 దాకా విక్ర‌యిస్తున్నాం. డిమాండ్‌ను బ‌ట్టి ధ‌ర నిర్ణ‌యిస్తుంటామ‌ని గౌరీ పేర్కొంది. ఇలా ఏడాదికి రూ. 30 ల‌క్ష‌లు సంపాదిస్తున్న‌ట్లు ఆమె తెలిపింది.

ఒక ట‌న్ను లెమ‌న్ గ్రాస్ నుంచి 8 లీట‌ర్ల ఆయిల్‌

ఒక ట‌న్ను లెమ‌న్ గ్రాస్ నుంచి 8 లీట‌ర్ల ఆయిల్‌ను త‌యారు చేయొచ్చు. అదే ఎండ‌కాలంలో అయితే 10 లీట‌ర్ల వ‌ర‌కు ఆయిల్ త‌యార‌వుతుంది. వ‌ర్షాకాలంలో 2.5 లీట‌ర్లు త‌క్కువ‌గా వ‌స్తుంది.. ఇక చ‌లికాలంలో అయితే 5 నుంచి 6 లీట‌ర్ల వ‌ర‌కు మాత్ర‌మే ఆయిల్‌ను త‌యారు చేయ‌డానికి వీలుప‌డుతుంద‌ని ఆ దంప‌తులు తెలిపారు. ఒక్క ఎక‌రా పొలంలో 18 ట‌న్నుల వ‌ర‌కు నిమ్మ‌గ‌డ్డిని సాగు చేయొచ్చు. అంటే ఎక‌రా పొలంలో సాగు చేసిన నిమ్మ‌గ‌డ్డితో 126 లీట‌ర్ల ఆయిల్‌ను త‌యారు చేయొచ్చు అని గౌరీ, దిలీప్ పేర్కొన్నారు.