ప్రమాదంలో దేశ ప్రజాస్వామ్యం

దేశంలో ప్రజాస్వామ్యం ప్రమాదంలో ఉన్నదని కాంగ్రెస్‌ సీనియర్‌ నేత, రాజ్యసభ సభ్యురాలు సోనియా గాంధీ అన్నారు.

  • By: Subbu |    national |    Published on : Apr 08, 2024 11:03 AM IST
ప్రమాదంలో దేశ ప్రజాస్వామ్యం

రాజ్యాంగాన్ని మార్చడానికి కుట్రలు
దేశ సమస్యలు పట్టని మోదీ
ప్రజల దృష్టి మళ్లించే ఎత్తుగడలు
జైపూర్ సభలో సోనియాగాంధీ

జైపూర్ : దేశంలో ప్రజాస్వామ్యం ప్రమాదంలో ఉన్నదని కాంగ్రెస్‌ సీనియర్‌ నేత, రాజ్యసభ సభ్యురాలు సోనియా గాంధీ అన్నారు. శనివారం రాజస్థాన్‌లోని జైపూర్‌లో నిర్వహించిన ఎన్నికల బహిరంగ సభలో ఆమె మాట్లాడారు. రాజ్యాంగాన్ని మార్చడానికి పెద్ద ఎత్తున కుట్రలు జరుగుతున్నాయని చెప్పారు. ప్రధాని మోదీ ఈ దేశ ప్రజాస్వామ్యాన్ని ముక్కలు చెక్కలుగా విచ్ఛిన్నం చేస్తున్నారని, అరాచకం సృష్టిస్తున్నారని మండిపడ్డారు. ఇంకొక వైపు ప్రతిపక్ష పార్టీల నాయకులు, కార్యకర్తలను భయపెడుతూ, బెదిరిస్తూ బీజేపీలో చేర్చకుంటున్నారని విమర్శించారు. గత పదేళ్లలో దేశంలో మండుతున్న నిరుద్యోగ సమస్య, అధిక ధరలు, అసమానతలు, దళితులపై చిత్రహింసలు వంటి సమస్యలను పట్టించుకోని మోదీ.. వాటి నుంచి ప్రజల దృష్టిని పక్కదారి పట్టించేందుకు అనవసరమమైన సమస్యలపై రచ్చ చేస్తున్నారని ఆరోపించారు. కాంగ్రెస్‌ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ వాద్రా మాట్లాడుతూ.. దేశంలో నిరుద్యోగం అడ్డు అదుపు లేకుండా పెరిగిపోతున్నదని అన్నారు. దేశ యువతకు ఉద్యోగాలు కల్పించడంలో మోదీ విఫలమయ్యారని విమర్శించారు. మరోవైపు పరీక్షల సమయంలో పేపర్ లీకులు చేసి కోట్లు సంపాదిస్తూ, యువత నోళ్లలో మన్ను కొడుతున్నారని ఆరోపించారు. ఎన్నికల సమయంలో గ్యాస్ ధరలు తగ్గించి, ప్రజలను మోసం చేసి ఓట్లు పొందేందుకు బీజేపీ ఎత్తుగడ వేసిందని, దాని నమ్మవద్దని చెప్పారు. ఈ ఎన్నికల్లో బీజేపీ ఆటలను కట్టించాలని పిలుపునిచ్చారు. కనీస మద్దతు ధరకు చట్టబద్ధత కల్పించాలని రైతులు ఆందోళనకు దిగితే.. వారిని బీజేపీ సర్కార్‌ పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. మోదీ తీసుకొచ్చిన జీఎస్టీ వ్యవస్థ.. పెద్దవ్యాపారులకు లాభాలు తెచ్చేదిలా, చిన్న, మధ్య తరహా వ్యాపారస్తులను ముంచేదిగా ఉన్నదని విమర్శించారు. ఈ ఎన్నికల ప్రచార సభలో కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే కూడా పాల్గొన్నారు.