యునిక్‌ బాండ్‌ నంబర్లు వెల్లడించండి.. సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు

లక్టోరల్‌ బాండ్ల గుట్టు బయటకు పొక్కకుండా తీవ్రంగా ప్రయత్నిస్తున్న స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియాకు సుప్రీంకోర్టు మరోసారి ఝలక్‌ ఇచ్చింది.

యునిక్‌ బాండ్‌ నంబర్లు వెల్లడించండి.. సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు

న్యూఢిల్లీ: ఎలక్టోరల్‌ బాండ్ల గుట్టు బయటకు పొక్కకుండా తీవ్రంగా ప్రయత్నిస్తున్న స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియాకు సుప్రీంకోర్టు మరోసారి ఝలక్‌ ఇచ్చింది. యూనిక్‌ బాండ్‌ నంబర్లు సహా ఎలక్టోరల్‌ బాండ్లకు సంబంధించిన సమస్త సమాచారాన్ని మార్చి 21, 2024 నాటికి పూర్తిగా వెల్లడించాలని సుప్రీంకోర్టు సోమవారం ఎస్‌బీఐని ఆదేశించింది. ఈ యునిక్‌ బాండ్‌ నంబర్లు వెల్లడైతేనే ఎలక్టోరల్‌ బాండ్ల కొనుగోలు దారులు, వాటిని అందుకున్న రాజకీయ పార్టీకి మధ్య లింకులు బయటకు వస్తాయి.

ఎలక్టోరల్‌ బాండ్ల వివరాలను సమగ్రంగా వెల్లడించాల్సిందేనని, ఇందులో ఎలాంటి సందేహానికి తావు లేదని చీఫ్‌ జస్టిస్‌ డీవై చంద్రచూడ్‌ నేతృత్వంలోని ఐదుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం ఎస్‌బీఐకి స్పష్టం చేసింది. అన్ని వివరాలు అందించినట్టు పేర్కొంటూ మార్చి 21వ తేదీ సాయంత్రం 5 గంటలకు ఎస్‌బీఐ చైర్మన్‌ కోర్టుకు అఫిడవిట్‌ సమర్పించాలని ఆదేశించింది. జస్టిస్‌ సంజీవ్‌ ఖన్నా, జస్టిస్‌ బీఆర్‌ గవాయి, జస్టిస్‌ జేబీ పార్దివాలా, జస్టిస్‌ మనోజ్‌ మిశ్రా కూడా ఈ ధర్మాసనంలో ఉన్నారు. బాండ్ల వెల్లడి విషయంలో ఎస్‌బీఐ ఇష్టానుసారం వ్యవహరించడం కుదరదని ధర్మాసనం స్పష్టం చేసింది.

బాండ్ల కొనుగోలుదారులు, వాటిని పొందిన రాజకీయ పార్టీల మధ్య లింకును వెల్లడించే యునిక్‌ బాండ్‌ నంబర్లతో సహా తన వద్ద ఉన్న అన్ని వివరాలను బయటపెట్టాలని ఆదేశించింది. ఎలక్టోరల్‌ బాండ్ల కేసులో బాండ్లకు సంబంధించిన అన్ని వివరాలు వెల్లడించాలని తాము ఇప్పటికే వెల్లడించిన తీర్పులో స్పష్టంగా పేర్కొన్న సంగతిని ధర్మాసనం గుర్తు చేసింది. ఈ విషయంలో తమ తదుపరి ఆదేశాల కోసం ఎదురుచూడరాదని పేర్కొన్నది. ‘ఎలక్టోరల్‌ బాండ్‌ నంబర్లు సహా అన్ని వివరాలను వెల్లడించాలని మేం ఎస్‌బీఐని కోరాం. ఈ విషయంలో ఎస్‌బీఐ ఇష్టానుసారం వ్యవహరించరాదు’ అని విచారణ సందర్భంగా మౌఖికంగా పేర్కొన్నది.

ఎలక్టోరల్‌ బాండ్ల పథకం రద్దు చేస్తూ ఇచ్చిన తీర్పును సోషల్‌ మీడియాలో ఒక అజెండాగా దుర్వినియోగం చేస్తున్నారన్న కేంద్ర ప్రభుత్వ వాదనను సుప్రీంకోర్టు సోమవారం కొట్టిపారేసింది. తమ తీర్పును మూడో పక్షం ఎలా తీసుకుంటుందన్న దానితో తమకు సంబంధం లేదని స్పష్టం చేసింది. న్యాయమూర్తులుగా తాము చట్టానికి కట్టుబడి ఉంటామని, రాజ్యాంగానికి అనుగుణంగా పనిచేస్తామని తెలిపింది. రాజ్య పరిపాలనా వ్యవస్థలో చట్ట ప్రకారం ప్రభుత్వం పనిచేసేలా మాత్రమే కోర్టులు చూస్తాయని పేర్కొంది.

‘న్యాయమూర్తులగా మేము కూడా సోషల్‌ మీడియాలో చర్చలకు గురవుతాం. అయితే.. వాటిని స్వీకరించేంత విశాలంగా మా భుజాలు ఉన్నాయి. మా తీర్పు అమలు చేయాలని మాత్రమే చెబుతున్నాం’ అని జస్టిస్‌ డీవై చంద్రచూడ్‌ నేతృత్వంలోని రాజ్యాంగ ధర్మాసనం స్పష్టం చేసింది. అంతకు ముందు.. రాజకీయ పార్టీలకు అందిన ఎలక్టోరల్ బాండ్ల వివరాలకు సంబంధించి సామాజిక మాధ్యమాల్లో పోస్టులు పెడుతున్నారని సొలిసిటర్‌ జనరల్‌ తుషార్‌ మెహతా విచారణ సందర్భంగా రాజ్యాంగ ధర్మాసనం దృష్టికి తెచ్చారు. ఈ అంశంలో ఇప్పటికే దుష్ప్రచారాలు మొదలయ్యాయని, కోర్టును ఇబ్బంది పెడుతున్నారని అన్నారు.