RG Kar Medical College । శవాలతో బూతు వీడియోలు.. అంతుచిక్కని ఆత్మహత్యలు.. ఆర్‌జీ కర్ హాస్పిటల్‌లో ఇన్ని అక్రమాలా?
ఓవైపు ఆర్‌జీ కర్ హాస్పిటల్‌లో 31 ఏళ్ల పీజీ ట్రైనీ డాక్టర్‌పై విశృంఖల లైంగికదాడి, హత్య ఘటనపై సీబీఐ (CBI) దర్యాప్తు చేస్తున్న నేపథ్యంలో.. ఈ కాలేజీకి సంబంధించి అనేక దుర్మార్గ అంశాలు వెలుగు చూస్తున్నాయి.

RG Kar Medical College । ఓవైపు ఆర్‌జీ కర్ హాస్పిటల్‌లో 31 ఏళ్ల పీజీ ట్రైనీ డాక్టర్‌పై విశృంఖల లైంగికదాడి, హత్య ఘటనపై సీబీఐ (CBI) దర్యాప్తు చేస్తున్న నేపథ్యంలో.. ఈ కాలేజీకి సంబంధించి అనేక దుర్మార్గ అంశాలు వెలుగు చూస్తున్నాయి. ఇక్కడ జరగని అక్రమాలు లేవు.. చోటుచేసుకోని అమానుషాలు లేవని అంటున్నారు. గతంలో అనేక మంది అనుమానాస్పద స్థితిలో (suspicious) ఆత్మహత్యలు చేసుకున్న ఉదంతాలూ ఉన్నాయని తెలుస్తున్నది. ఇప్పటి వరకూ వెలుగు చూసినవి మాత్రమేనా? ఇంకా ఘోరాలు ఉన్నాయా? అనే అంశం దర్యాప్తులో కానీ బయటపడదని అంటున్నారు.
గత దశాబ్దకాలంలోనే పలు ఆత్మహత్యలు, అసాధారణ మరణాలు (unnatural deaths) ఈ మెడికల్ కాలేజీ హాస్పిటల్‌లో (RG Kar Medical College and Hospital) జరిగాయని తెలుస్తున్నది. పౌలోమీ సాహా అనే విద్యార్థిని 2020లో ఎమర్జెన్సీ భవంతి గ్రౌండ్‌లో శవమై కనిపించింది. ఆమె వద్ద ఎలాంటి ఆత్మహత్య లేఖ దొరకప్పటికీ.. ఆమె డిప్రెషన్‌తో బాధపడుతున్నదని, ఆ భవంతి ఆరో ఫ్లోర్ నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నదని హాస్పిటల్ వర్గాలు, పోలీసులు చెబుతున్నారు.
ఆర్‌జీ కర్ హాస్పిటల్‌లో చోటు చేసుకున్న అసాధారణ మంరణం ఇదొక్కటే కాదు. అంతకు ముందు 2003లో సువ్రోజ్యోతిదాస్ అనే 23 ఏళ్ల ఎంబీబీఎస్ ఇంటర్న్ హాస్పిటల్ భవంతిపైనుంచి పడి చనిపోయింది. డిప్రెషన్ నుంచి బయటపడటానికి ఇంజెక్షన్లు (antidepressants) తీసుకుని, తన చేతి నరాలను కోసుకుని దూకి చనిపోయిందని పోలీసులు పేర్కొన్నారని హెచ్‌టీ పేర్కొన్నది. ఈ కేసులో కూడా ఎలాంటి ఆత్మహత్య లేఖ దొరకలేదని పోలీసులు పేర్కొన్నారు.
2001లో సౌమిత్రా బిశ్వాస్ అనే మరో విద్యార్థిని మృతదేహం ఆమె హాస్టల్ గదిలో ఉరేసుకుని ఉన్న స్థితిలో కనిపించింది. ఈ మరణాన్ని కూడా ఆత్మహత్యగా తేల్చారని చెబుతున్నారు. హాస్టల్ గదుల్లో హాస్పిటల్ సిబ్బంది, కొందరు విద్యార్థుల ముఠా.. అశ్లీల వీడియోలను చిత్రీకరించేందుకు వేశ్యలను పిలిపించారని, దీనిని బిశ్వాస్ వ్యతిరేకించినందుకు ఆమెను చంపేశారని పేరు రాయడానికి ఇష్టపడని ఒక డాక్టర్ పేర్కొన్నారు.
ఆఖరుకు అత్యంత నీచంగా శవమైథునాల (necrophilia) రాకెట్ కూడా ఇదే కాలేజీలో ఉండేదని న్యూస్‌ఎక్స్ పేర్కొన్నది. అశ్లీల చిత్రాల ముఠా శవాలతో మైథునాలకు పాల్పడేదని తెలిపింది.
ఆగస్ట్ 9న లైంగిక దాడికి, హత్యకు గురైన ట్రైనీ డాక్టర్ ఒంటిపై 16 తీవ్ర గాయాలు, అంతర్గతంగా 9 గాయాలు ఉన్నాయని పోస్టుమార్టం రిపోర్టు పేర్కొంటున్నది. బలవంతంగా చొప్పించడంతో ఆమె అంతర్గత అవయవాలు గాయపడ్డాయని తెలిపింది. వాటితోపాటు శరీరంపై చెంపలు, పెదవులు, మెడ, మోకాళ్లపై తీవ్ర గాయాలు ఉన్నాయని, శరీరం లోపల మెడ కండరాలు, మాడ, ఇతర ప్రాంతాల్లో గాయాలు ఉన్నాయని పేర్కొన్నది. ఆమె మరణానికి ముందే ఈ గాయాలన్నీ అయ్యాయని తెలిపింది.