Tamil Nadu Elections | తమిళనాడులో ‘పంచ’ముఖ పోటీ? కీలక పోటీ డీఎంకే–అన్నాడీఎంకే మధ్యే!

తమిళనాడు ఎన్నికల్లో నిశ్శబ్ద శక్తిగా సీమాన్‌ నేతృత్వంలోని నామ్‌ తమిళర్‌ కట్చి (ఎన్‌టీకే) అన్ని పార్టీలను కలవరపెడుతున్నది. స్వతంత్రంగా పోటీ చేస్తున్న ఎన్‌టీకే.. దాదాపు 8.5 శాతం నికర ఓటింగ్‌ను కొనసాగిస్తున్నది. బలమైన తమిళవాదం, జాతీయవాదాలతో ఈ పార్టీ ముందుకు వచ్చింది. అయితే.. ఈ ఎన్నికల్లోనూ ఎన్‌టీకే అదే ఒరవడిని కొనసాగిస్తుందా? లేక బహుముఖ పోటీలో దెబ్బతింటుందా? అన్నది వేచిచూడాల్సిందే.

  • By: TAAZ |    national |    Published on : Mar 25, 2026 7:00 PM IST
Tamil Nadu Elections | తమిళనాడులో ‘పంచ’ముఖ పోటీ? కీలక పోటీ డీఎంకే–అన్నాడీఎంకే మధ్యే!

Tamil Nadu Elections | ఏప్రిల్‌ 23న పోలింగ్‌ జరుగబోతున్న తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు దేశవ్యాప్తంగా ఆసక్తి రేపుతున్నాయి. ఇక్కడ ప్రధానంగా అధికార డీఎంకే, ప్రతిపక్ష అన్నాడీఎంకే మధ్యే పోటీ ఉన్నా.. మొత్తంగా పంచముఖ పోటీ నెలకొని ఉండటం.. రెండు ప్రధాన పార్టీలపై తీవ్ర ఒత్తిడిని పెంచుతున్నది. ఇప్పటి వరకూ వచ్చిన కొన్ని ఓపీనియన్‌ పోల్స్‌.. డీఎంకే మరోసారి విజయం సాధించేందుకు అవకాశాలు ఉన్నాయని పేర్కొంటున్నాయి. అయితే.. కీలక భాగస్వామ్య పక్షాలు, కొత్తగా రంగంలోకి దిగిన శక్తులు, ఉనికి చాటుకుంటున్న చిన్న పార్టీలు.. తీవ్ర ప్రభావం చూపగల రెబెల్స్‌, కుల రాజకీయాలు.. ఈ విధంగా పంచముఖ పోటీ కారణంగా ఓట్లు గణనీయంగా చీలిపోయే అవకాశాలు ఉన్నాయని రాజకీయ పరిశీలకులు వ్యాఖ్యానిస్తున్నారు.

  • తమిళనాడు అసెంబ్లీలో మొత్తం 234 సీట్లు ఉన్నాయి.
  • ఏప్రిల్‌ 23న ఒకే దశలో పోలింగ్‌ నిర్వహించనున్నారు.
  • మే 4వ తేదీన ఓట్ల లెక్కింపు చేపట్టి, ఫలితాలను వెల్లడించనున్నారు.

తమిళనాడులో ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్‌ నేతృత్వంలో ద్రవిడ మున్నేట్ర కళగం అధికారంలో ఉంది. మరోసారి విజయం సాధించే పట్టదలతో పనిచేస్తున్నది. డీఎంకే నేతృత్వంలోని ఇండియా కూటమిలో కాంగ్రెస్‌తోపాటు.. కొన్ని చిన్న ప్రాంతీయ పార్టీలు భాగస్వాములుగా ఉన్నాయి. మొన్నామధ్య సినీ నటుడు కమల్‌ హాసన్‌ నాయకత్వంలోని మక్కల్‌ దీని మయ్యం, విజయ్‌కాంత్‌ స్థాపించిన మురుపొక్కు ద్రవిడ కళగం కూడా ఇండియా కూటమిలో చేరాయి.

ప్రధానంగా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, ప్రత్యక్ష నగదు బదిలీ ద్వారా ఆర్థిక సహాయం, సంక్షేమ కార్యక్రమాలపై కేంద్రీకరించి డీఎంకే ఎన్నికల ప్రచారం సాగుతున్నది. బీజేపీ ముందుకు తెస్తున్న త్రిభాషా విధానాన్ని, హిందీని బలవంతంగా రుద్దే ప్రయత్నాలను తీవ్రంగా విమర్శించే పద్ధతిలో… ఈ ఎన్నికలను తమిళనాడుకు, ఎన్డీయేకు మధ్య పోటీగా అభివర్ణిస్తున్నది. తమను మళ్లీ గెలిపిస్తే.. ఇప్పటికే మహిళలకు ఇస్తున్న ప్రత్యక్ష ఆర్థిక సహాయాన్ని రెట్టింపు చేస్తామని స్టాలిన్‌ ప్రతినబూనుతున్నారు.

మరోవైపు ప్రతిపక్షాలు… రాష్ట్రంలో శాంతి భద్రతల పరిస్థితి నానాటికీ దిగజారుతున్నదని, మహిళల పట్ల వేధింపులు, నేరాలు పెరిగిపోతున్నాయని ఆరోపిస్తున్నాయి. మాదక ద్రవ్యాల వినియోగం అంశాన్ని సైతం ఎత్తిచూపుతున్నాయి. అన్నింటికి మించి.. కుటుంబ రాజకీయాల అంశాన్ని ప్రధానంగా మార్చుతున్నాయి. ఎడప్పాడి కే పళనిస్వామిని ముఖ్యమంత్రి అభ్యర్థిగా ముందుకు తెస్తూ ఎన్డీయే ప్రచారం సాగిస్తున్నది.

ఎన్డీయే కూటమిలో అన్నాడీఎంకే అత్యధికంగా 178 సీట్లలో పోటీ చేస్తున్నది. బీజేపీకి 27 సీట్లు కేటాయించారు. పట్టల్‌ మక్కల్‌ కట్చి అన్బుమణి రాందాస్‌ వర్గం 18 సీట్లలో పోటీకి దిగుతున్నది. టీవీవీ దినకరన్‌ నేతృత్వంలోని అమ్మ మక్కల్‌ మున్నేట్ర కళగం11 సీట్లలో బరిలో నిలిచింది. ఇతర సీట్లలో చిన్న పార్టీలు కొన్ని ఉన్నాయి.

సినీ హీరో విజయన్‌ స్థాపించిన తమిళగ వెట్రి కళగం (టీవీకే) అటు ఎన్డీయేతోనూ, ఇటు ఇండియా కూటమితోనూ పొత్తు లేకుండా.. ఒంటరిగా బరిలోకి దిగుతున్నది. డీఎంకే, అన్నాడీఎంకే పార్టీలకు తానే ప్రత్యామ్నాయం అని చెబుతూ.. యువతను ఆకర్షించే పనిలో ఉంది. తమిళ గుర్తింపు అంశంతోపాటు.. యాంటి ఎస్టాబ్లిష్‌మెంట్‌ ఓటింగ్‌పైనా ఆశలు పెట్టుకుంది. అధికార పార్టీకి డైరెక్ట్‌ చాలెంజర్‌గా విజయ్‌ను టీవీకే ముందుకు తెస్తున్నది. అదే సమయంలో బీజేపీనీ టార్గెట్‌ చేసింది.

రాబోయే ఎన్నికల్లో టీవీకే గణనీయంగా ఓట్లను చీల్చగలదని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ప్రత్యేకించి పట్టణ, దక్షిణ జిల్లాల ఓటర్లలో గణనీయంగా ప్రభావం చూపగలదని భావిస్తున్నారు. ఈ పరిణామం బహుముఖ పోటీకి దారి తీసి, డీఎంకే, అన్నాడీఎంకే ప్రయోజనాలను దెబ్బతీయవచ్చని అంచనా వేస్తున్నారు.

అయితే.. టీవీకే ప్రారంభం నుంచి ఏదో ఒక సమస్యను ఎదుర్కొంటూనే వస్తున్నది. ఇప్పటికే కరూర్‌ ర్యాలీ తొక్కిసలాట కేసు విజయ్‌కు చుట్టుకున్నది. ఆలోపే భార్య విడాకుల కేసు సంచలనం రేపింది. ఒక నటితో సంబంధాల అంశం హల్‌చల్‌ చేసింది. ఈ అంశాలు టీవీకే నాయకత్వాన్ని నేరుగా సవాలు చేస్తున్నాయి. గతంలో శివాజీ గణేశన్‌, విజయ్‌కాంత్‌ వంటివారు ఎన్నికల్లో విజయాలకు అనేక ఇబ్బందులు పడిన విషయాన్ని పరిశీలకులు ప్రస్తావిస్తున్నారు. ఒక దశలో రజినీకాంత్‌.. రాజకీయాలను వదిలేసుకున్నారు.

తమిళనాడు ఎన్నికల్లో నిశ్శబ్ద శక్తిగా సీమాన్‌ నేతృత్వంలోని నామ్‌ తమిళర్‌ కట్చి (ఎన్‌టీకే) అన్ని పార్టీలను కలవరపెడుతున్నది. స్వతంత్రంగా పోటీ చేస్తున్న ఎన్‌టీకే.. దాదాపు 8.5 శాతం నికర ఓటింగ్‌ను కొనసాగిస్తున్నది. బలమైన తమిళవాదం, జాతీయవాదాలతో ఈ పార్టీ ముందుకు వచ్చింది. అయితే.. ఈ ఎన్నికల్లోనూ ఎన్‌టీకే అదే ఒరవడిని కొనసాగిస్తుందా? లేక బహుముఖ పోటీలో దెబ్బతింటుందా? అన్నది వేచిచూడాల్సిందే.

ఈ ఎన్నికల్లో తాను సైతం కీలక పాత్రధారినే నంటూ ముందుకు వచ్చారు తమిళనాడు దివంగత సీఎం జయలలిత స్నేహితురాలు వీకే శశికళ, ఎస్‌ రాందాస్‌. ఎడప్పాడి, టీటీవీ దినకరన్‌, అన్బుమణి రాందాస్‌లను ద్రోహులుగా అభివర్ణిస్తున్న వీరిద్దరూ ఒక అవగాహన కుదుర్చుకొనే దిశగా చర్చలు జరుపుతున్నట్టు తెలుస్తున్నది. ఇది కూడా కుల ప్రాతిపదికన ఓట్లను చీల్చే అంశమేనని రాజకీయ వర్గాలు చెబుతున్నాయి. మొత్తానికి తమిళనాడు ఎన్నికల రాజకీయం రానున్న రోజుల్లో రసవత్తరంగా సానుందని అంటున్నాయి.

Read Also |

Varanasi | ‘వారణాసి’తో గ్లోబల్ టార్గెట్ .. సెట్ ఫొటోలు చూసి అవాక్క‌వుతున్న సినీ ప్రియులు
Savitrii | మహానటి సావిత్రి జీవితంలో కీలక మలుపు … ప్రేమ, విజయం, విషాదం వెనుక అసలు కథ
బేగంపేట రన్‌వే కింద 6 లేన్​ అండర్‌పాస్.. దేశంలోనే తొలి ప్రయోగం!