తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల మధ్య వివాదానికి దారి తీసిన మేకెదాటు ప్రాజెక్టు ఆపాలంటూ తమిళనాడు అసెంబ్లీలో కీలక తీర్మానం ఆమోదించింది. కావేరీ నదిపై కర్ణాటక ప్రభుత్వం ప్రతిపాదించిన ‘మేకె దాటు’ ప్రాజెక్టు నిర్మాణాన్ని తమిళనాడు సీఎం విజయ్ వ్యతిరేకించారు. ఈ ప్రాజెక్టు వల్ల దిగువ రాష్ట్రమైన తమిళనాడుకు తీవ్ర నష్టం జరుగుతుందని, కావేరి డెల్టా రైతుల ప్రయోజనాలు దెబ్బతింటాయని ఆందోళన వ్యక్తం చేశారు. మేకెదాటు డ్యామ్ నిర్మాణాన్ని వ్యతిరేకిస్తూ శుక్రవారం ఉదయం ముఖ్యమంత్రి విజయ్ అసెంబ్లీలో తీర్మానాన్ని ప్రవేశపెట్టగా..సభ ఏకగ్రీవంగా ఆమోదించింది. ఈ ప్రాజెక్టుకు కేంద్రం పర్యావరణ లేదా సాంకేతిక అనుమతులు ఇవ్వరాదని తమిళనాడు డిమాండ్ చేసింది. ముఖ్యమంత్రి ప్రవేశపెట్టిన ఈ తీర్మానానికి కాంగ్రెస్, వీసీకే, ఇతర పార్టీలు మద్దతు తెలిపాయి. మేకె దాటు వివాదంపై ప్రత్యేక ట్రిబ్యునల్‌ను ఏర్పాటు చేయాలని ప్రతిపక్ష నేత ఉదయనిధి స్టాలిన్ చేసిన సవరణను ప్రభుత్వం ఆమోదించింది.
అవసరమైతే రాజకీయ పోరాటం : విజయ్
కర్ణాటక ప్రభుత్వం ఏకపక్షంగా చేపడుతున్న మేకె దాటు ప్రాజెక్టు నిర్మాణం చట్టవిరుద్ధమని, దీనిని వెంటనే నిలిపివేయాలని విజయ్ ఈ సందర్బంగా డిమాండ్ చేశారు. ఈ ప్రాజెక్టు కావేరి నదీ జలాల వివాదాల ట్రిబ్యునల్ తుది అవార్డుతో పాటు.. సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పులను పూర్తిగా ఉల్లంఘిస్తోందని విజయ్ పేర్కొన్నారు. పర్యావరణ, సాంకేతిక అనుమతులు సహా ప్రాజెక్టుకు సంబంధించిన ఎలాంటి అనుమతులూ ఇవ్వొద్దని కేంద్ర ప్రభుత్వాన్ని ఆయన కోరారు. నదీ జలాల పంపకంలో తమిళనాడు హక్కులను కాపాడేందుకు అవసరమైతే రాజకీయ పోరాటం చేస్తామని స్పష్టం చేశారు. నీరు అనేది ప్రజల ప్రాథమిక హక్కు అని, దాన్ని కాపాడటం తమ ప్రభుత్వ బాధ్యత అని సీఎం విజయ్ స్పష్టం చేశారు. రాజకీయ భేదాలు ఉన్నా ప్రజల ప్రయోజనాల విషయంలో అందరూ ఏకతాటిపై నిలవాలని ఆయన పిలుపునిచ్చారు.
ఇప్పటికే ప్రధాని మోదీకి వినతి
గత నెలలో తమిళనాడు ముఖ్యమంత్రి జోసఫ్ విజయ్ ప్రధాని నరేంద్ర మోదీని కలిసిన సందర్బంలోనూ మేకె దాటు వద్ద డ్యామ్ నిర్మాణాన్ని అడ్డుకోవాలని వినతి పత్రం సమర్పించారు. కావేరి నిర్వాహక మండలిలో సభ్యులుగా ఉన్న రాష్ట్రాల ఆమోదం లేకుండా మేకె దాటు ప్రాజెక్టును చేపట్టడానికి వీలులేదని, ఈ విషయమై కేంద్ర జలశక్తి శాఖకు, కేంద్ర నీటి వనరులకు శాఖకు ఆదేశాలివ్వాలని మోదీని కోరారు. తాజాగా అసెంబ్లీలో తీర్మానం సైతం ఆమోదింపచేశారు. మేకెదాటు ప్రాజెక్టు కర్ణాటకలోని కనకపుర–రామనగర ప్రాంతాల మధ్య కావేరీ నదిపై నిర్మించాలనుకుంటున్న బ్యాలెన్సింగ్ జలాశయ ప్రాజెక్టు. మేకెదాటు అంటే కన్నడలో “మేక దూకిన స్థలం” అని అర్థం. 1940నుంచి ప్రతిపాదనల్లో ఉన్న మేకెదాటు ప్రాజెక్టు నిర్మిస్తే.. దిగువ రాష్ట్రం తమిళనాడుకు కావేరి నీటి ప్రవాహం తగ్గుతుందని ఆ రాష్ట్రం తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. దీంతో ఈ ప్రాజెక్టు రెండు రాష్ట్రాల మధ్య దీర్ఘకాలిక జల వివాదంగా మారింది.
రెండు రాష్ట్రాలకు ప్రయోజనం : సీఎం డీకే శివకుమార్
మేకె దాటు ప్రాజెక్టు ప్రధానంగా తాగునీటి ప్రాజెక్టు అని, మిగులు జలాలను మాత్రమే నిల్వ చేయడం వల్ల కరువు సమయాల్లో ఇరు రాష్ట్రాలకూ ప్రయోజనం చేకూరుతుందని కర్ణాటక సీఎం డీకే శివకమార్ వాదిస్తున్నారు. ప్రధానంగా బెంగళూరు తాగునీటి అవసరాలు, జలవిద్యుత్ ఉత్పత్తి లక్ష్యంగా నిర్మిస్తున్నామని స్పష్టం చేశారు. తమిళనాడు రైతుల ప్రయోజనాలకు ఎలాంటి నష్టం ఉండదని, కేంద్రం అనుమతులతో ముందుకెలుతామని చెప్పారు. ఇటీవల మేక దాటు ప్రాజెక్టుకు అవసరమైన అనుమతులివ్వాలని కర్ణాటక ముఖ్యమంత్రి డి.కె. శివకుమార్ ఇటీవల ప్రధానికి లేఖ రాయడం గమనార్హం.
కాంగ్రెస్ కు విజయ్ షాక్
కర్ణాటకలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ తమిళనాడులో సీఎం విజయ్ ప్రభుత్వంలో కీలక భాగస్వామిగా ఉంది. అన్నాడీఎంకే ఎమ్మెల్యేలలో చీలికకు ముందు విజయ్ సర్కార్ ఏర్పాటులో కాంగ్రెస్ ఎమ్మెల్యేల మద్దతు నిర్ణయాత్మక పాత్ర పోషించింది. అయితే మేకె దాటు ప్రాజెక్టు నిర్మాణంతో రెండు పార్టీల మధ్య విభేదాలు రేగినట్లయ్యింది. తమిళనాడు ప్రయోజనాలే ముఖ్యంగా సీఎం విజయ్ మేకె దాటు ప్రాజెక్టు నిర్మాణానికి వ్యతిరేకంగా అసెంబ్లీలో తీర్మానం ప్రవేశ పెట్టి ఆమోదింపచేసి, మిత్ర పక్షం కాంగ్రెస్ కు గట్టి షాక్ ఇచ్చారు. ఈ తీర్మానానికి తమిళనాడు కాంగ్రెస్, వీసీకేలు కూడా మద్దతునివ్వడం విశేషం. రెండు రాష్ట్రాల్లో ఒకే పార్టీ వేర్వేరు వైఖరులు తీసుకోవడం కాంగ్రెస్‌ను చిక్కుల్లోకి పడేసింది.
