మెజార్టీ రాకపోతే విజయ్‌కు మద్దతు ఇచ్చేది ఎవరు?

118 సభ్యుల మద్దతు ఉంటేనే తమిళనాడులో ప్రభుత్వం ఏర్పాటు చేసే అవకాశం ఏ పార్టీకైనా ఉంటుంది. ప్రస్తుతం విజయ్‌ పార్టీ 107 స్థానాల వద్ద ఆగింది. మరిప్పుడు టీవీకేకు మద్దతు ఇచ్చేది ఎవరు?

  • By: TAAZ |    national |    Published on : May 04, 2026 10:06 PM IST
మెజార్టీ రాకపోతే విజయ్‌కు మద్దతు ఇచ్చేది ఎవరు?

దేశంలో ఐదు రాష్ట్ర అసెంబ్లీలకు ఎన్నికలు జరిగితే జాతీయ స్థాయిలో హాట్‌ టాపిక్‌గా నిలిచింది తమిళనాడు. ఇక్కడ అందరి అంచనాలను పటాపంచలు చేస్తూ సినీ హీరో విజయ్‌ పార్టీ టీవీకే సింగిల్‌ లార్జెస్ట్‌ పార్టీగా అవతరించింది. సోమవారం రాత్రి 9.40 గంటల సమయానికి ఆ పార్టీ 95 స్థానాల్లో విజయం సాధించి, మరో 12 చోట్ల ఆధిక్యంలో ఉన్నట్టు ఎన్నికల సంఘం వెబ్‌సైట్‌ పేర్కొంటున్నది. అంటే మొత్తంగా 107 స్థానాలు టీవీకేకు లభించనున్నాయి. అధికార పార్టీ డీఎంకేకు 60, అన్నాడీఎంకేకు 47 సీట్లు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఇప్పటికైతే టీవీకే మెజార్టీ మార్కును సొంతగా దాటే పరిస్థితి కనిపించడం లేదు. దీనికి బయటి పార్టీల మద్దతు అవసరం. అయితే ఏ పార్టీలు మద్దతు ఇస్తాయన్నదే ఆసక్తికరంగా మారింది.

సొంతగా మెజార్టీ రాని పక్షంలో ప్రభుత్వ ఏర్పాటుకు అనుసరించాల్సిన వ్యూహంపై ఇప్పటికే విజయ్‌ తన పార్టీ నేతలతో చర్చల్లో నిమగ్నమయ్యారని తెలుస్తున్నది. రాజకీయ వ్యూహకర్త జాన్‌ అరోకియాసామినని సైతం ఆయన సంప్రదించారని వార్తలు వస్తున్నాయి. డీఎంకే, అన్నాడీఎంకే కూటముల్లోని చిన్న పార్టీలు తమ కనీస ప్రయోజనాలు నెరవేర్చుకునేందుకు టీవీకేకు మద్దతు ఇస్తాయన్న ప్రచారం కూడా జరుగుతున్నది. ఈ క్రమంలో తమ ప్రస్తుత కూటముల నుంచి బయటకు వచ్చి.. కాంగ్రెస్‌, ఐయూఎంఎల్‌, డీఎండీకేతోపాటు వామపక్షాలు సైతం విజయ్‌కు మద్దతు పలుకవచ్చనే అంచనాలు వెలువడుతున్నాయి. ఐదు సీట్లు గెలిచిన అన్బుమణి రాందాస్‌ నేతృత్వంలోని పీఎంకే సైతం జతకలుస్తుందని చెబుతున్నారు. అయితే.. వాటిపై ఇంకా అధికారిక ప్రకటనలు ఏమీ రాలేదు. కానీ.. విజయ్‌ విజయాన్ని ప్రశంసించాల్సిందేనంటూ ఏఐసీసీ చీఫ్‌ మల్లికార్జున ఖర్గేకు తమిళనాడు కాంగ్రెస్‌ చీఫ్‌ లేఖ రాయడం చూస్తే.. ఆ పార్టీ విజయ్‌కు మద్దతు పలికేందుకు సిద్ధంగా ఉన్నట్టు అర్థమవుతున్నదని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.

ఇప్పటి వరకూ ముగిసిన లెక్కింపులో టీవీకే 34.92% ఓట్లను సాధించింది. డీఎంకే 24.20%, అన్నాడీఎంకే 21.23% ఓట్లు సాధించాయి. దక్షిణ జిల్లాలైన మదురై, దిండిగల్‌, థేని, విరుధ్‌నగర్‌, శివగంగ, రామంతపురం, తూత్తుకుడి, తిరునెల్వేలి, థెంకాసి వంటి చోట్ల టీవీకే బలమైన శక్తిగా ముందుకు వచ్చింది. తిరువావూర్‌, నాగపట్టిణం, మైలాదుతురాయి వంటి డెల్టా జిల్లాల్లోనూ, సేలంలోని కొన్ని ప్రాంతాల్లోనూ విజయాలు నమోదు చేసుకుంది. కాంగ్రెస్‌కు బలమైనదిగా భావించే కన్యాకుమారిలోని కొన్ని బాగాల్లోనూ పై చేయి సాధించింది.