Taxes | ప్రతి రూపాయిలో పన్నుల ద్వారానే 63 పైసల రాక

ప్రభుత్వ ఖజానాకు చేరే ప్రతి రూపాయిలో 63 పైసలు ప్రత్యక్ష, పరోక్ష పన్నుల ద్వారానే లభించనున్నాయి. మిగిలిన 27 పైసల్లో రుణాలు, ఇతర అప్పులు ఉన్నాయి

Taxes | ప్రతి రూపాయిలో పన్నుల ద్వారానే 63 పైసల రాక

న్యూఢిల్లీ: ప్రభుత్వ ఖజానాకు చేరే ప్రతి రూపాయిలో 63 పైసలు ప్రత్యక్ష, పరోక్ష పన్నుల ద్వారానే లభించనున్నాయి. మిగిలిన 27 పైసల్లో రుణాలు, ఇతర అప్పులు ఉన్నాయి. మరో 9 పైసలు పెట్టుబడుల ఉపసంహరణ వంటి పన్నేతర ఆదాయం నుంచి, ఇక మిగిలిన ఒక పైస రుణేతర మూలధన వసూళ్ల నుంచి రానున్నాయి. కార్పొరేట్‌, వ్యక్తిగత ఆదాయం పన్ను నుంచే 36 పైసలు రానున్నాయి. ఆదాయం పన్ను ద్వారా 19 పైసలు, కార్పొరేట్‌ ట్యాక్స్‌ ద్వారా 17 పైసలు వస్తాయని బడ్జెట్ పత్రాలు పేర్కొన్నాయి. పరోక్ష పన్నుల్లో జీఎస్టీ ద్వారా గరిష్ఠంగా 18 పైసలు రానున్నాయి.

దీనితోపాటు ప్రతి రూపాయి రాబడిలో ఐదు పైసలను ఎక్సయిజ్‌ డ్యూటీ ద్వారా, నాలుగు పైసలను కస్టమ్స్‌ సుంకాల ద్వారా సంపాదించుకునే యత్నాల్లో ప్రభుత్వం ఉన్నది. వ్యయాలకు సంబంధించి వడ్డీ చెల్లింపులు 19 పైసలు, కేంద్ర పన్నుల్లో రాష్ట్రాలకు వాటా, డ్యూటీలు 21 పైసలు వెళ్లనున్నాయి. రక్షణ రంగానికి 8 పైసలు ఖర్చు చేయనున్నారు. కేంద్ర పథకాలకు 16 పైసలు కేటాయించారు. కేంద్రప్రాయోజిత పథకాలకు8 పైసలు ఖర్చవుతాయి. ఫైనాన్స్‌ కమిషన్‌, ఇతర బదిలీలపై వ్యయం 9 పైసలు. సబ్సిడీలకు 6 పైసలు, పెన్షన్లకు 5 పైసలు వెచ్చించనున్నారు. ఇతర ఖర్చులకు 8 పైసలను వెచ్చించనున్నది.