Kanwar Yatra | కన్వర్‌ యాత్ర బోర్డుల వివాదంలో సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు..

కన్వర్‌ యాత్ర సాగే మార్గంలో ఆహార దుకాణదారులు తమ పేర్లను బోర్డులపై ప్రదర్శించాలన్న ఉత్తరప్రదేశ్‌, ఉత్తరాఖండ్‌ ప్రభుత్వాల నిర్ణయాలపై సుప్రీంకోర్టు సోమవారం మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది.

Kanwar Yatra  | కన్వర్‌ యాత్ర బోర్డుల వివాదంలో సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు..

న్యూఢిల్లీ: కన్వర్‌ యాత్ర సాగే మార్గంలో ఆహార దుకాణదారులు తమ పేర్లను బోర్డులపై ప్రదర్శించాలన్న ఉత్తరప్రదేశ్‌, ఉత్తరాఖండ్‌ ప్రభుత్వాల నిర్ణయాలపై సుప్రీంకోర్టు సోమవారం మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. బోర్డులపై పేరు రాయాల్సిన అవసరం లేదని పేర్కొన్నది. అయితే.. కన్వరియాలకు ఏ తరహా ఆహారం అమ్ముతున్నారనే వివరాలను రాయాలని సూచించింది.

యూపీ, ఉత్తరాఖండ్‌ రాష్ట్ర ప్రభుత్వాల నిర్ణయాలను సవాలు చేస్తూ స్వచ్ఛంద సంస్థ పౌర హక్కుల పరిరణక్షణ సంఘం (ఏపీసీఆర్‌) సహా పలువురు దాఖలు చేసిన పిటిషన్లపై సుప్రీంకోర్టు సోమవారం విచారణ చేపట్టి, ఈ మేరకు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. కన్వర్‌ యాత్ర సాగే మార్గంలో ఆహార పదార్థాలు విక్రయించేవారు తమ పేరు, మతం బోర్డులపై పేర్కొనాలని యూపీ, ఉత్తరాఖండ్‌ ప్రభుత్వాలు ఆదేశాలు జారీ చేయడంపై పెద్ద ఎత్తున నిరసనలు వ్యక్తమైన విషయం తెలిసిందే. ఈ మేరకు సోమవారం ఆ రెండు రాష్ట్రాల ప్రభుత్వాలకు, యాత్ర మార్గానికి సంబంధించినవారికి నోటీసులు జారీ చేసిన జస్టిస్‌ హృషికేశ్‌ రాయ్‌, జస్టిస్‌ ఎస్వీఎన్‌ భట్టి ధర్మాసం.. ఈ కేసుపై తదుపరి విచారణ జరిగేంత వరకూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేస్తున్నామని పేర్కొన్నది. యజమానులు/ పనిచేసేవారి పేర్లు, గుర్తింపు తెలిపేలా బోర్డులపై రాయాల్సిందిగా అధికారులు పట్టుబట్టరాదని స్పష్టం చేసింది. కన్వరియాలకు విక్రయించే ఆహార వివరాలు పొందుపరిస్తే చాలని తెలిపింది.

ఈ చర్య వెనుక ఎలాంటి హేతుబద్ధత లేదని పిటిషనర్ల తరఫున వాదించిన సీనియర్‌ అడ్వొకేట్‌ అభిషేక్‌ మను సింఘ్వి పేర్కొన్నారు. యజమానులు, వర్కర్ల వివరాలు ఇవ్వడం వృథా అన్నారు. పోలీసులు జారీ చేసి ఈ ఉత్తర్వులు మత పరమైన విభజనలకు కారణమవుతుందని తెలిపారు. ఈ ఉత్తర్వులకు చట్టబద్ధత కూడా లేదని అన్నారు. ఈ విషయంలో పోలీసు అధికారులకు చట్టం ఎలాంటి అవకాశం ఇవ్వడం లేదని తెలిపారు. ఈ ఉత్తర్వులను ఉపసంహరించేలా రాష్ట్రాలను కోరాలని రాజకీయ వ్యాఖ్యాత అపూర్వానంద్‌, సామాజిక కార్యకర్త అక్తర్‌ పటేల్‌ తమ పిటిషన్లలో విజ్ఞప్తి చేశారు. ఇదే విషయంలో వేరొక పిటిషన్‌ దాఖలు చేసిన టీఎంసీ ఎంపీ మహువా మొయిత్రా.. ముస్లిం వ్యాపారులను టార్గెట్‌ చేసేందుకు ఉత్తరప్రదేశ్‌ ప్రభుత్వం ప్రయత్నిస్తున్నదని ఆరోపించారు.