ఇజ్రాయెల్ పోలీసులకు మనకూ ఉన్న సంబంధం ఏంటో తెలుసా?

విధాత: ప్రస్తుతం నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో ఇజ్రాయెల్ (Israel) పై ప్రపంచవ్యాప్తంగా చర్చ నడుస్తోంది. ఆ దేశ చరిత్ర, వారి సైనిక పాటవం, నిఘా సంస్థ మొసాద్ తదితర విషయాల గురించి నెట్టింట్లో అనేక విషయాలు వైరల్ అవుతున్నాయి. మన దేశానికి, ఇజ్రాయెల్‌కు ఉన్న సుదీర్ఘ సంబంధాలపైనా పలువురు అనేక విషయాలు వెల్లడిస్తున్నారు.
ఈ ప్రపంచంలో యూదులపైన మతపరంగా దాడులు జరగని దేశం భారత్ ఒకటేననేది అందులో ఒకటి. ఇదిలా ఉంటే ప్రస్తుత కాలంలోనూ అనేక రంగాల్లో ఇజ్రాయెల్‌కు భారత మధ్య వ్యాపార లావాదేవీలు కొనసాగుతున్నాయి. ముఖ్యంగా ఇజ్రాయెల్ పోలీసులు (Israel Police Uniform) ధరించే యూనీఫాంకు మన దేశానికి ఉన్న సంబంధం గురించి తెలిస్తే ఆశ్చర్యపోవాల్సిందే. ఆ దుస్తుల్లో సింహ భాగం వాటా మన దేశంలోని కేరళ (Kerala) లోనే ఉత్పత్తి అవుతున్నాయి.
కన్నౌర్ జిల్లాలో ఉన్న మరియన్ ఎపారెల్ ప్రైవేట్ లిమిటెడ్ అనే సంస్థ ఈ దుస్తులను తయారు చేస్తోంది. సరాసరి ఏడాదికి లక్ష యూనిట్ల యూనీఫాంలను ఇజ్రాయెల్‌కు ఎగుమతి చేస్తున్నామని సంస్థ మేనేజర్ షిజిన్ కుమార్ పేర్కొన్నారు. ఇజ్రాయెల్ అధికారులు ప్రతి ఏడాదీ ఇక్కడకు వచ్చి క్వాలిటీ చెకింగ్ చేస్తారని.. చాలా పక్కాగా దుస్తులను రూపొందించాల్సి ఉంటుందని ఆయన తెలిపారు.
ముంబయిలో స్థిరపడిన కేరళ వ్యాపారవేత్త థామస్ ఓలికల్ ఈ సంస్థను నిర్వహిస్తున్నారన్నారు. ఈ అవకాశం ఎలా వచ్చిందనే ప్రశ్నకు ఆయన సమాధానం చెబుతూ… ఎనిమిదేళ్ల క్రితం ఇజ్రాయెల్ పోలీసులు తమను సంప్రదించారని గుర్తు చేసుకున్నారు. తాము చేసిన ప్రతిపాదనలు, తమ తయారీలో నాణ్యత నచ్చడంతో అప్పటి నుంచీ ఒప్పందాన్ని పొడిగించుకుంటూ వస్తున్నారని తెలిపారు.
మేము అప్పటికే ఫిలప్పైన్స్ ఆర్మీకి, కువైట్ ప్రభుత్వాధికారులకు యూనీఫాంలను తయారుచేస్తున్నాం. అలా మా గురించి వారికి తెలిసి ఉండొచ్చు అని షిజిన్ కుమార్ వివరించారు. ఈ కంపెనీకి మరో ప్రత్యేకత కూడా ఉందని ఆయన పేర్కొన్నారు. ఇక్కడ సుమారు 1500 మంది సిబ్బంది పని చేస్తుండగా.. వారిలో 95 శాతం మంది మహిళలేనని ఆయన తెలిపారు. కాగా భారత్‌లో యూదుల జనాభా ఎక్కువగా ఉన్న నగరాల్లో కేరళలోని కోచి, కోజీకోడ్ ముందు వరసలో ఉంటాయి.