Naveen Jindal | విమానంలో మహిళను లైంగికంగా వేధించిన జిందాల్‌ స్టీల్‌ ఉన్నతాధికారి.. ఇదీ నవీన్‌ జిందాల్‌ స్పందన!

జిందాస్‌ స్టీల్‌ హైర్యాంకింగ్‌ అధికారి ఒకరు కోల్‌కతా నుంచి అబుధాబి వెళ్లే విమానంలో తనను లైంగికంగా వేధించాడని ఒక మహిళ ఆరోపించారు. తనకు ఎదురైన భయానక అనుభవాన్ని ఆమె శుక్రవారం ఉదయం తన ఎక్స్‌ ఖాతాలో వివరించారు.

Naveen Jindal | విమానంలో మహిళను లైంగికంగా వేధించిన జిందాల్‌ స్టీల్‌ ఉన్నతాధికారి.. ఇదీ నవీన్‌ జిందాల్‌ స్పందన!

న్యూఢిల్లీ: జిందాస్‌ స్టీల్‌ హైర్యాంకింగ్‌ అధికారి ఒకరు కోల్‌కతా నుంచి అబుధాబి వెళ్లే విమానంలో తనను లైంగికంగా వేధించాడని ఒక మహిళ ఆరోపించారు. తనకు ఎదురైన భయానక అనుభవాన్ని ఆమె శుక్రవారం ఉదయం తన ఎక్స్‌ ఖాతాలో వివరించారు. అయితే.. ఆ ఘటన ఏ రోజు జరిగిందనేది మాత్రం ఆమె వెల్లడించలేదు. ఆమె హార్వర్డ్‌ యూనివర్సిటీకి చెందిన సెంటర్‌ ఫర్‌ పబ్లిక్‌ లీడర్‌షిప్‌లో పనిచేస్తున్నట్టు ఎక్స్‌ బయో ద్వారా తెలుస్తున్నది. ఆమె తన పోస్టును జిందాల్‌ స్టీల్‌ అండ్‌ పవర్‌ చైర్మన్‌, కురుక్షేత్ర ఎంపీ నవీన్‌ జిందాల్‌ను ట్యాగ్‌ చేశారు. ‘నాకు జరిగింది ఇంకెవరికైనా జరగొచ్చనే ఉద్దేశంతో అప్రమత్తం చేసేందుకు ఈ విషయాన్ని షేర్‌ చేస్తున్నాను. జిందాల్‌ స్టీల్‌ చైర్మన్‌ నవీన్‌ జిందాల్‌కు ఈ విషయం చేరేందుకు ప్రయత్నిస్తున్నాను. ఎందుకంటే ఆయన నాయకత్వంలో ఎలాంటివాళ్లు పనిచేస్తున్నారో ఆయనకు తెలుస్తుంది’ అని ఆ పోస్టులో పేర్కొన్నారు. కీలకమైన పదవిలో ఉన్న ఈ పీడకుడు తన కింద పనిచేసే మహిళా ఉద్యోగుల పట్ల ఎలా ప్రవర్తిస్తున్నాడో అనే భయం కలిగింది’ అని తెలిపారు. తాను బాగానే ఉన్నానని, కాకపోతే కొంత దడదడ, ఇబ్బంది ఉన్నదని పేర్కొన్నారు. ఇలా చెప్పడం కట్టుదాటినట్టు అనిపిస్తున్నా.. మరో మహిళకు ఇలాంటి పరిస్థితి ఎదురుకావద్దన్నదే తన ఉద్దేశమని తెలిపారు.
బోస్టన్‌ వెళ్లేందుకు కలకత్తా నుంచి అబుధాబి వెళ్లే విమానంలో తాను ప్రయాణిస్తున్న సమయంలో ఈ ఘటన చోటుచేసుకున్నదని ఆ మహిళ తెలిపారు. ‘ఆ సమయంలో నా పక్క సీటులో సుమారు 65 ఏళ్ల వయసున్న వ్యక్తి కూర్చొన్నాడు. తనను జిందాల్‌ స్టీల్‌లో హైర్యాంకింగ్‌ ఎగ్జిక్యూటివ్‌గా పరిచయం చేసుకున్నాడు. నాతో సంభాషణ ప్రారంభించాడు. తాను ఒమన్‌లో నివసిస్తుంటానని, కానీ, తరచూ ప్రయాణాలు చేస్తుంటానని చెప్పాడు. కుటుంబం, మూలాలు వంటి అంశాలపై చాలా సాధారణంగా మాటలు కలిపాడు. తనది రాజస్థాన్‌ అని, తనకు ఇద్దరు కుమార్తెలు ఉన్నారని, వారు అమెరికాలో సెటిలయ్యారని చెప్పాడు’ అని ఆ మహిళ వివరించారు.
ఆమె ఇంకా ఇలా రాశారు. ‘సినిమాలు చూడటం ఇష్టమా? అని అడిగాడు. అవునని చెప్పడంతో తన ఫోన్‌లో సినిమా క్లిప్పింగ్స్‌ ఉన్నాయని, ఎలాంటి సినిమాలు ఇష్టమో చెప్పాలని కోరాడు. అనంతరం తన మొబైల్‌ ఫోన్‌ తీసి, ఇయర్‌ఫోన్స్‌ ఇచ్చి, నాకు పోర్న్‌ క్లిప్‌లు చూపాడు’ అని తెలిపారు. అక్కడితో ఆమె కష్టాలు ఆగలేదు.. ‘నా మీద చేతులు వేయడం మొదలు పెట్టాడు. నేను భయంతో షాక్‌తో ఉండిపోయాను. వెంటనే తేరుకుని విమాన సిబ్బందికి ఫిర్యాదు చేశాను. ఎయిర్‌లైన్స్‌ సిబ్బంది వారు కూర్చొనే ప్రాంతంలో నన్ను కూర్చొనబెట్టి, టీ, కొన్ని పండ్లు ఇచ్చారు’ అని తెలిపారు. తాను సిబ్బంది తనను రక్షిస్తున్న క్రమంలో ఆ వృద్ధుడు సిబ్బందిని పిలిచి, ఆమె ఎక్కడకు వెళ్లిందంటూ వాకబు చేశాడు.
ఈలోపే విమాన సిబ్బంది ఎయిర్‌పోర్ట్‌లోని పోలీసులను అప్రమత్తం చేశారు. అయితే.. తాను బోస్టన్‌ వెళ్లాల్సి ఉన్నందున కనెక్టింగ్‌ ఫ్లైట్‌ వెళ్లిపోతుందనే ఉద్దేశంతో ఆ రోజు ఫిర్యాదు చేయలేక పోయానని ఆ మహిళ పేర్కొన్నారు. అతడు తన దగ్గరకు రాకుండా భద్రతా సిబ్బంది తనను తదుపరి గేట్‌ వరకూ సురక్షితంగా తీసుకెళ్లారని తెలిపారు. పోలీసులు ప్రశ్నించినా ఆతడు తానేమీ చేయలేదని బుకాయించాడని పేర్కొన్నారు.
మహిళ చేసిన ఆరోపణలపై నవీన్‌ జిందాల్‌ శుక్రవారం స్పందించారు. ‘విషయం మాకు చేరవేసినందుకు, జరిగినది చెప్పినందుకు కృతజ్ఞతలు. అందుకు ఎంతో సాహసం అవసరం. ఇటువంటి విషయాలను మేం ఎట్టిపరిస్థితుల్లోనూ సహించబోమని మీకు తెలియజేస్తున్నా. ఈ విషయంలో వెంటనే దర్యాప్తు చేసి, అవసరమైన కఠిన చర్యలు తీసుకోవాలని మా సిబ్బందిని ఆదేశించాను’ అని బదులిచ్చారు.