Train derail | పట్టాలు తప్పిన హౌరా – ముంబై ఎక్స్‌ప్రెస్ రైలు.. ఇద్దరు మృతి.. పలువురికి తీవ్ర గాయాలు
Train derail | జార్ఖండ్ రాష్ట్రం చక్రధర్‌పూర్‌లో మరో ఘోర రైలు ప్రమాదం జరిగింది. హౌరా నుంచి ముంబైకి వెళ్తున్న 12810 హౌరా-ముంబై మెయిల్‌లోని 18 బోగీలు పట్టాలు తప్పాయి. ఈ ప్రమాదంలో ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. పదుల సంఖ్యలో ప్రయాణికులు గాయపడ్డారు.

Train derail : జార్ఖండ్ రాష్ట్రం చక్రధర్‌పూర్‌లో మరో ఘోర రైలు ప్రమాదం జరిగింది. హౌరా నుంచి ముంబైకి వెళ్తున్న 12810 హౌరా-ముంబై మెయిల్‌లోని 18 బోగీలు పట్టాలు తప్పాయి. ఈ ప్రమాదంలో ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. పదుల సంఖ్యలో ప్రయాణికులు గాయపడ్డారు. సమాచారం అందిన వెంటనే రెస్క్యూ టీమ్స్ ఘటనా ప్రాంతానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టాయి. గాయపడిన వారిని చికిత్స నిమిత్తం అంబులెన్స్‌లలో ఆస్పత్రికి తరలించారు. ప్రమాదం నేపథ్యంలో రైలు మార్గంలో రైళ్ల రాకపోకలను నిలిపేశారు.
రెండు రోజుల క్రితం అదే ప్రదేశంలో గూడ్స్ రైలు పట్టాలు తప్పిందని, దాని శకలాలు ట్రాక్‌పై ఉండటమే ప్రమాదానికి కారణమని అధికారులు చెబుతున్నారు. హౌరా-ముంబై మెయిల్ మరో ట్రాక్ నుంచి వస్తుండగా అప్పటికే ట్రాక్‌పై పడి ఉన్న గూడ్స్ శకలాలను ఢీకొట్టింది. దాంతో హౌరా-ముంబై మెయిల్‌లోని 18 బోగీలు పట్టాలు తప్పాయి. మంగళవారం ఉదయం హౌరా-ముంబై రైల్వే లైన్‌లోని చక్రధర్‌పూర్ సమీపంలోని పోల్ నంబర్ 219 సమీపంలో ఈ ప్రమాదం జరిగింది.
హౌరా నుంచి ముంబై వెళ్తున్న రైలు సోమవారం రాత్రి 11:02 గంటలకు బదులుగా మూడున్నర గంటలు ఆలస్యంగా 02:37 గంటలకు టాటానగర్ చేరుకుంది. అక్కడ రెండు నిమిషాలు ఆగి.. తర్వాత చక్రధర్‌పూర్‌కి బయలుదేరింది. కానీ అది తన తదుపరి స్టేషన్‌కు చేరుకునేలోపే రైలు 03:45 కి బడాబాంబో ముందు ప్రమాదానికి గురైంది. రైలులోని 18 కోచ్‌లు పట్టాలు తప్పాయి.