టీవీకే అధినేత, సీఎం విజయ్ రాజకీయాల్లోకి వచ్చినప్పటి నుంచి నటి త్రిషను అడ్డుపెట్టుకుని ఆయనపై రాజకీయ విమర్శల దాడులు కొనసాగుతున్న సంగతి తెలిసిందే. తాజాగా సీఎం విజయ్ ని, త్రిషను ఉద్దేశించి డీఎంకే నేత ఉదయనిధి స్టాలిన్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. ఉదయనిధి చేసిన వ్యాఖ్యలు అభ్యంతకరంగా ఉన్నాయంటూ టీవీకే శ్రేణులు భగ్గుమన్నాయి. దీంతో ఉదయనిధిపై తమిళనాడు పోలీసులు కేసు నమోదు చేశారు. ఆయన వ్యాఖ్యలపై పలువురు తంజావూర్ పోలీసుస్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. పోలీసులు ఆరు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ఉదయనిధి తీరుపై టీవీకే పార్టీ.. జాతీయ మహిళా కమిషన్‌ను ఫిర్యాదు చేసింది.
ఉదయనిధి నివాసం వద్ద ఉద్రిక్తత.. అరెస్టు
సీఎం విజయ్, త్రిషలపై చేసిన వ్యాఖ్యలను నిరసిస్తూ ఉదయనిధి క్షమాపణలు చెప్పాలంటూ అధికార టీవీకే శ్రేణులు చెన్నైలోని ఆయన నివాసాన్ని ముట్టడించారు. అటు ఉదయనిధిని అరెస్టు చేస్తారన్న ప్రచారంతో ఆయనకు మద్దతుగా డీఎంకే కార్యకర్తలు సైతం భారీగా తరలివచ్చారు. పోటాపోటీగా ఇరుపార్టీల కార్యకర్తలు నినాదాలకు దిగారు. పోలీసులు భారీగా మోహరించారు.
ఇదే సమయంలో ఉదయనిధిని అరెస్టు చేసేందుకు పోలీసులు ఆయన నివాసంలోకి చేరుకోగా డీఎంకే శ్రేణులు అడ్డుపడ్డాయి. పోలీసులు బలవంతంగా డీఎంకే కార్యకర్తలను తప్పించి ఉదయ నిధిని అరెస్టు చేసి తీసుకెళ్లారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా డీఎంకే కార్యకర్తలు నినాదాలు చేశారు. భారీ సెక్యూరిటీ నడుమ ఆయనను విచారణ కోసం తంజావూర్ పోలీస్ స్టేషన్‌కు తరలించారు. దారిలో డీఎంకే కార్యకర్తలు పోలీసు వాహనాన్ని అడ్డుకునే ప్రయత్నాలు చేస్తుండటంతో కాన్వాయ్ లో వాహనాలను మారుస్తూ పోలీసులు ముందుకెలుతున్నారు. అటు డీఎంకే రాస్తారోకోలకు పిలుపునివ్వడంతో ఉదయనిధిని ఎక్కడికి తరలిస్తారన్నదానిపై ఉత్కంఠత నెలకొంది.
మధ్యాహ్నం మద్రాస్ హైకోర్టులో విచారణ
ఉదయనిధిని అరెస్టు నేపథ్యంలో ఆయన ముందస్తు బెయిల్ కోసం మద్రాస్ హైకోర్టును ఆశ్రయించారు. దీనిపై మధ్యాహ్నం విచారణ చేపడుతామని కోర్టు తెలిపింది. అంతలోపునే పోలీసులు ఉదయనిధిని అరెస్టు చేయడం విశేషం. మరోవైపు ఉదయనిధి ఇంటి వద్ద పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.
అరెస్టును న్యాయపరంగా ఎదుర్కొంటాం: ఉదయనిధి, స్టాలిన్
తన అరెస్టు ఓ పెద్ద జోక్ అని..న్యాయపరంగా ఎదుర్కోంటానని ఉదయనిధి తెలిపారు. డీఎంకే అధినేత, మాజీ సీఎం స్టాలిన్ కూడా ఉదయనిధి అరెస్టును న్యాయపరంగా ఎదుర్కొంటామని స్పష్టం చేశారు.
అసలు ఏం జరిగింది..?
కావేరీ నదీ జలాల అంశంపై తంజావూర్ లో సోమవారం జరిగిన నిరసన ప్రదర్శనలో ఉదయనిధి మాట్లాడుతూ.. విజయ్ ప్రభుత్వం డెల్టా రైతుల ప్రయోజనాలను కాపాడటంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని ఆరోపించారు. ప్రస్తుతం సీఎం విజయ్ కి ఒకే ఒక్క టెన్షన్ పట్టుకుందని వ్యాఖ్యానించారు. అదే సమయంలో సభలో పలువురు కార్యకర్తలు త్రిష, త్రిష అంటూ నినాదాలు చేశారు. విజయ్ కి ఉన్న ఆ ఒక్క టెన్షన్ త్రిష అన్నట్లుగా వారు నినాదాలు చేశారు. ఆ నినాదాల మధ్య ఉదయనిధి నవ్వుతూ ఇన్యుయేండో (అర్థవంతమైన వ్యాఖ్య) అని అనడం తీవ్ర విమర్శలకు దారితీసింది. అయితే తను మాట్లాడింది కావేరి జలాల సమస్యపై అంటూ ఆ తర్వాతా ఉదయనిధి వివరణ ఇచ్చారు. సభలో ఉదయనిధి చేసిన డబుల్ మీనింగ్ వ్యాఖ్యలే ఇప్పుడు రచ్చకు దారితీశాయి.
