India Aviation Duopoly : ఏ రంగంలో అయినా ఇద్దరే పోటీనా
ఇండిగో సంక్షోభం నేపథ్యంలో, దేశంలో ఏ రంగంలోనైనా ఇద్దరు లేదా రెండు సంస్థలు మాత్రమే ఆధిపత్యం చెలాయించేలా కేంద్ర ప్రభుత్వ విధానాలు ఉన్నాయా అనే చర్చ మొదలైంది.
ఇండిగో ఏయిర్ లైన్స్ సంక్షోభం భారతదేశ విమానయాన రంగం పరువును అంతర్జాతీయ స్థాయిలో దిగజార్చిందనే చెప్పాలి. గత ఐదారు రోజులుగా విమానాల రద్ధు కారణంగా ప్రయాణీకుల కష్టాలు చెప్పనలవిగా ఉంది. కేంద్ర ప్రభుత్వం కూడా దిద్దుబాటు చర్యలు తీసుకోకుండా అంతర్జాతీయ కుట్ర అంటూ కళ్లబొళ్లి మాటలు చెబుతున్నది. ఇండిగో సంక్షోభంతో కార్పొరేట్ నియంత్రణ ఏ స్థాయిలో ఉందనేది స్పష్టమవుతోంది. ఏ రంగంలో అయినా ఇద్దరు లేదా రెండు సంస్థలు ఉండాలనే విధంగా పరిణామాలు చోటు చేసుకుంటున్నాయనే చర్చ వ్యాపార వర్గాల్లో మొదలైంది. ఈ విధమైన పద్ధతి మిగతా రంగాలకు పాకే ప్రమాదముందంటున్నారు. కేంద్ర పౌర విమానయాన శాఖ తీసుకువచ్చిన ఎఫ్.డీ.టీ.ఎల్ విధానం ఇండిగో సంక్షోభానికి దారి తీసిన విషయం తెలిసేందే. దేశ విమానయాన రంగంలో 65 శాతం వాటా కలిగిన ఇండిగో పై విపరీతమైన ప్రభావం చూపింది.
అయితే ఈ విధానాన్ని ప్రారంభించే ముందు ఏ విధమైన సవాళ్లు ఎదురవుతాయనేది అంచనా వేయలేకపోయింది. ఇండిగో ఏయిర్ లైన్స్ ను ఇబ్బందులకు గురి చేసేందుకు, గుత్తాధిపత్యాన్ని ప్రోత్సహించేందుకు ఎఫ్.డీ.టీ.ఎల్ విధానాన్ని తీసుకువచ్చారని ప్రతిపక్ష పార్టీలు కేంద్ర ప్రభుత్వంపై దుమ్మెత్తిపోస్తున్నాయి. ఇండిగో తన విమాన సర్వీసులను రద్ధు చేస్తే తట్టుకునే విధంగా మిగతా ఏయిర్ లైన్స్ లేవు. ప్రస్తుతం దేశంతో ఇండిగో తో పాటు టాటా గ్రూపు ఏయిర్ లైన్స్ 90 శాతం వాటా కలిగి ఉండగా, మిగతా కంపెనీలకు పది శాతం వాటా ఉంది. టెలికాం, పోర్టులు, ఈ కామర్స్, ఫుడ్ డెలీవరీ రంగాలలో ఇప్పటికే రెండు సంస్థల మధ్య వ్యాపారం విస్తరించి, బలంగా నాటుకు పోయి ఉంది. అదే తరహాలో విమానయాన రంగాన్ని సిద్ధం చేస్తున్నారనే విమర్శులు మార్కెట్ లో బలంగా విన్పిస్తున్నాయి.
రెండు సంస్థలు శాసిస్తున్న రంగాలు
ఫుడ్ డెలీవరీ రంగంలో ప్రస్తుతం స్విగ్గీ, జొమాటోలు ప్రధానంగా ఉన్నాయి. స్విగ్గీ మార్కెట్ వాటా 42 శాతం కాగా జొమాటో వాటా 58 శాతం వరకు ఉన్నట్లు అంచనా. ఈ రెండు సంస్థలు ఆన్ లైన్ ఫుడ్ డెలీవరీ మార్కెట్ ను శాసిస్తున్నాయి. వీటి పొటీని కొత్తగా వచ్చే అంకురాలు, సంస్థలు తట్టుకుని నిలబడలేక చతికిల పడుతున్నాయి. ఇక క్యాబ్ రంగాన్ని తీసుకుంటే ఓలా ఊబర్ లు పోటీ పడుతున్నాయి. రాపిడో ఆ స్థాయిలో ముందుకు రాలేకపోతున్నది. ఇన్ డ్రైవ్ కొంత మెరుగ్గానే ఉన్నప్పటికీ, మార్కెట్ వాటా చూస్తే చాలా స్వల్పంగా ఉంది. ఓలా, ఊబర్ లది క్యాబ్ మార్కెట్ లో 80 శాతానికి పైగా ఉంది. ఆన్ లైన్ అంగడి వ్యాపారం చేస్తున్న ఫ్లిఫ్ కార్ట్, అమెజాన్ లు దేశంలో వినియోగదారులను శాసిస్తున్నాయి. డిస్కౌంట్ రేట్లు, పలు ఆఫర్లను ప్రకటించి రిటైల్ మార్కెట్ చైన్ ను పూర్తిగా ధ్వంసం చేశాయి. ఈ కామర్స్ లో ఈ రెండు సంస్థల వాటా 80 శాతం. టైర్ టూ, టైర్ త్రీ నగరాల్లో దిగువ మధ్య తరగతి ప్రజలు మీషో లో ఉత్పత్తులను కొనుగోలు చేస్తున్నారు. నేషనల్ పేమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎన్.పీ.సీ.ఐ) లెక్కల ప్రకారం దేశంలో డిజిటల్, యూపీఐ చెల్లింపులలో కూడా ఫోన్ పే, గూగుల్ పే లు ఎక్కువ మంది వినియోగిస్తున్నారు. ఈ రెండింటి పోటీని మిగతా సంస్థలు తట్టుకోలేక, ముందుకు పోలేక పోతున్నాయి.
ఇక టెలికాం రంగాన్ని తీసుకుంటే జియో, ఏయిర్ టెల్ మధ్య విపరీతమైన పోటీ ఉంది. ఈ రెండు సంస్థల పోటీ కారణంగా మిగతా సంస్థలు నిలదొక్కుకోలేకపోతున్నాయి. ఒకప్పుడు వెలుగు వెలిగిన ఐడియా, వోడాఫోన్ లు విలీనం అయినా పోటీలో ఉండలేకపోయింది. అప్పుల భారంతో పాటు, 4జీ నెట్ వర్క్ తో ఇంకా వీఐ కంపెనీ నిలదొక్కుకోవడానికి నానా తంటాలు పడుతున్నది. ట్రాయ్ వివరాల ప్రకారం మెజారిటీ వినియోగదారులను జియో, ఏయిర్ టెల్ లు కలిగి ఉన్నాయి. విమానయాన రంగం ను ఒకసారి గమనిస్తే ఇండిగో ఏయిర్ లైన్స్ వాటా 65 శాతం కాగా, టాటా గ్రూప్ ఏయిర్ లైన్స్ వాటా 27 శాతం వరకు ఉందిగా. ఈ రెండు సంస్థలు విస్తరణ బాటలో ఉండడంతో మిగతా సంస్థలు ఈ రంగంలోకి వచ్చేందుకు అంతగా ఆసక్తి చూపించడం లేదనే వాదన కూడా ఉంది. ఇవే కాకుండా కార్గో, పోర్టులు వంటి రంగాలలో రెండు సంస్థలే పోటీ పడుతున్నాయని నిపుణులు వ్యాఖ్యానిస్తున్నారు.
రెండు సంస్థల పోటీ కి ఇదే కారణం
భారీ ఎత్తున నిధులు సమకూర్చుకుని ఏదైనా ఒక రంగంలో అడుగు పెడితే చిన్నా చితక సంస్థల మనుగడ దెబ్బతింటుంది. ప్రపంచ స్థాయి పెట్టుబడులు రాబట్టుకోవచ్చు. ప్రతి ఒక్క వినియోగదారుడికి ఆకర్షించవచ్చు. ప్రభుత్వ నియమ నిబంధనలు పటిష్టంగా లేకపోవడం కూడా ఒక కారణం. చిన్న సంస్థలను క్రమంగా ఆధీనంలోకి తెచ్చుకునేందుకు కొనుగోళ్లు లేదా కలుపుకోవడం జరుగుతుంది. ఈ కారణాల మూలంగా దేశంలో అన్ని రంగాల్లో పెద్ద సంస్థలు ముందంజలో ఉంటూ, మిగతా సంస్థలను మనుగడ లేకుండా చేస్తున్నాయి.
ఏ రంగంలో అయినా ఇద్దరి మధ్య పోటీ కారణంగా వినియోగదారులకు నష్టం అధికంగా ఉంటుందంటున్నారు. క్యాబ్ రంగంలో తీసుకుంటే ఓలా, ఊబర్ లు డిమాండ్ ను బట్టి, పరిస్థితులను బట్టి అత్యధిక ఛార్జీలు విధించే ప్రమాదం ఉంది. ఫుడ్ డెలీవరీ యాప్స్ లో కూడా ఇదే విధానం అమలవుతున్నది. మొబైల్ సిమ్ కోసం వెళ్తే ఒకటి రెండు కంపెనీలను చూసి ఎంపిక చేసుకోవాల్సిన దుస్థితి కల్పించారు. డిజిటల్ అడ్వర్టయిజ్ కారణంగా దేశంలో సాంప్రదాయంగా వస్తున్న అడ్వర్టయిజ్ మెంట్ పై ఆధారపడిన లక్షలాది మంది రోడ్డు మీద పడ్డారు. చిన్న వ్యాపారులు కూడా ఆ స్థాయిలో ఖర్చు పెట్టలేకపోతున్నారు. నిత్యావసర రంగంలో ప్రతి ఒక్కరు యాప్ మీద ఆధారపడే పరిస్థితిని రెండు మూడు సంస్థలు కల్పించడంలో సఫలీకృతం అయ్యాయని మార్కెట్ నిపుణులు వ్యాఖ్యానిస్తున్నాయి. ప్రతి రంగంలో కనీసం నలుగురు లేదా నాలుగైదు సంస్థల మధ్య ఆరోగ్యవంతమైన పోటీ ఉంటే ప్రయోజనకరంగా ఉంటుందంటున్నారు. గుత్తాధిపత్యాన్ని ప్రభుత్వాలు ప్రోత్సహిస్తే దీర్ఘకాలికంగా ఆ ప్రభావం ప్రజలతో పాటు ప్రభుత్వాలపై కూడా ఉంటుందంటున్నారు.
ఇవి కూడా చదవండి :
Jolla Smartphone : ప్రైవసీ కావాలా ఈ మొబైల్ బెస్ట్
Mario Trailer : నవ్విస్తున్న ‘మారియో’ ట్రైలర్
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram