యుద్దం ముగిసినా ఇంధన ధరలు తగ్గించం : కేంద్రం కీలక ప్రకటన

అమెరికా-ఇరాన్ శాంతి ఒప్పందంతో క్రూడాయిల్ ధరలు తగ్గినా, భారత్‌లో పెట్రోల్-డీజిల్ ధరలను వెంటనే తగ్గించలేమని కేంద్ర మంత్రి సురేశ్ గోపీ స్పష్టం చేశారు.

అమెరికా-ఇరాన్ శాంతి అవగాహన ఒప్పందంతో పశ్చిమాసియా యుద్దం ముగిసిపోగా, అంతర్జాతీయంగా ఇక ఇంధన ధరలు తగ్గుతాయని..అదే క్రమంలో దేశంలోనూ ఇంధన ధరలు తగ్గిస్తారని ఆశించిన భారతీయులకు కేంద్ర ప్రభుత్వం షాక్ ఇచ్చింది. యుద్దం ముగిసినప్పటికి ఇప్పటికిప్పడు భారత్‌లో వెంటనే ఇంధన ధరలు తగ్గించలేమని కేంద్ర పెట్రోలియం, సహజ వాయువు, పర్యాటక శాఖ సహాయ మంత్రి సురేశ్‌ గోపి వెల్లడించారు. పశ్చిమా సంక్షోభం సమయంలో లీటరుకు దాదాపు రూ.3.94 మాత్రమే పెంచామన్నారు. అయితే, అంతర్జాతీయంగా ముడి చమురు ధరలు తగ్గినంత మాత్రాన.. ఆ పెంపును వెంటనే తగ్గించలేమన్నారు.

చమురు ధరల నిర్ధారణలో పలు అంశాలు ఇమిడి ఉంటాయని, హర్మూజ్‌ తెరుచుకున్నప్పటికి.. ప్రస్తుతం అక్కడ నౌకల రాకపోకల రద్దీ ఎక్కువగా ఉందని పేర్కొన్నారు. దీంతో తక్కువ ధరకు లభించే ముడిచమురు భారత్‌కు చేరేందుకు సమయం పడుతుందని తెలిపారు. పశ్చిమాసియాలో యుద్ధం మొదలైనప్పటి నుంచి చమురు కంపెనీలు తీవ్రంగా ప్రభావితమయ్యాయని, ఆ సమయంలో ఇంధన ధరలపై ఎక్సైజ్‌ సుంకాన్ని తగ్గించేందుకు ఏ రాష్ట్రం ముందుకు రాలేదన్నారు. ఆ భారాన్ని కేంద్ర ప్రభుత్వం భరించిందని చెప్పారు. దాదాపు రూ.12 వేల కోట్ల మేర కేంద్రం నష్టపోయిందన్నారు. కేంద్ర ప్రభుత్వం నడవాలి, అలాగే చమురు కంపెనీలు కూడా మనుగడ సాగించాలని సురేశ్ గోపీ గుర్తుచేశారు. ఇరాన్ యుద్ధం ముగియడంతో అంతర్జాతీయంగా క్రూడాయిల్ ధర బ్యారెల్ కు 80 డాలర్లకు పడిపోయింది. నిన్న మొన్నటివరకూ 100 డాలర్లు పలికిన ధర పతనం కావడంతో ఆ మేరకు భారత్ లో చమురు సంస్థలు ధరలు తగ్గిస్తాయని అంతా భావించారు. అయితే ఇప్పట్లో ఇంధన ధరల తగ్గింపు ఉండబోదన్న కేంద్ర మంత్రి ప్రకటన నేపథ్యంలో పెట్రోల్, డీజిల్ ధరల తగ్గింపుకు మరికొన్ని రోజులు వేచి ఉండాల్సిన పరిస్థితి నెలకొంది.

Latest News