Manoj Soni | యూపీఎస్సీ చైర్మన్ మనోజ్ సోనీ రాజీనామా
యూపీఎస్సీ చైర్మన్ మనోజ్ సోనీ తన పదవీకి ఆకస్మికంగా రాజీనామా చేశారు. వ్యక్తి గత కారణాలతో రాజీనామా చేశానంటూ మనోజ్ సోనీ వెల్లడించారు

పూజా ఖేడ్కర్ వివాద సమయంలో అనూహ్య పరిణామం
వ్యక్తిగత కారణాలతో రాజీనామా చేశారన్న అధికార వర్గాలు
విధాత, హైదరాబాద్ : యూపీఎస్సీ చైర్మన్ మనోజ్ సోనీ తన పదవీకి ఆకస్మికంగా రాజీనామా చేశారు. వ్యక్తి గత కారణాలతో రాజీనామా చేశానంటూ మనోజ్ సోనీ వెల్లడించారు. గతేడాది ఏప్రిల్ నెలలోనే బాధ్యతలు చేపట్టిన ఆయన, ఇంకా ఐదేళ్ల పదవీకాలం ఉండగానే అనూహ్యంగా రాజీనామా చేయడం గమనార్హం. ప్రొబేషనరీ ఐఏఎస్ అధికారిణి పూజా ఖేడ్కర్ వివాదం వేళ ఈ పరిణామాలు చోటుచేసుకోవడం చర్చనీయాంశమైంది. అయితే ఈ వివాదంతో మనోజ్ సోనీ రాజీనామాకు ఎటువంటి సంబంధం లేదని అధికారిక వర్గాలు వెల్లడించాయి. దాదాపు పదిహేను రోజుల క్రితమే ఆయన తన రాజీనామాను రాష్ట్రపతికి సమర్పించినట్లు పేర్కొన్నాయి.
అయితే, దీన్ని ఇంకా ఆమోదించలేదని సదరు వర్గాలు తెలిపాయి. 2017లో యూపీఎస్సీ కమిషన్ సభ్యుడిగా చేరి గతేడాది మే నెలలో చైర్మన్ గా ప్రమాణస్వీకారం చేశారు. 2029 మే 15 వరకు ఆయన పదవీకాలం ఉంది. అయితే, చైర్మన్ పదవి చేపట్టడానికి ఆయన ముందునుంచి సుముఖంగా లేదని సమాచారం. తనను ఈ బాధ్యతల నుంచి రిలీవ్ చేయాలని గతంలోనే ఓసారి అభ్యర్థించినట్లు అధికారిక వర్గాలు పేర్కొన్నాయి. ఇకపై ఆధ్యాత్మిక మార్గంలో ప్రయాణించాలని సోనీ కోరుకుంటున్నట్లు తెలిపాయి. యూపీఎస్సీ చైర్మన్ పదవికి ముందు ఆయన గుజరాత్‌లోని డా. బాబాసాహెబ్ అంబేడ్కర్ ఓపెన్ యూనివర్సిటీలో వరుసగా రెండుసార్లు వీసీగా సేవలందించారు.
ఇటీవల మహారాష్ట్రకు చెందిన ప్రొబేషనరీ ఐఏఎస్ అధికారిణి పూజా ఖేడ్కర్ అధికార దుర్వినియోగం, అవకతవకలకు పాల్పడినట్లు వచ్చిన ఆరోపణలు తీవ్ర దుమారం రేపాయి. ఈ వ్యవహారంపై సమగ్ర దర్యాప్తు చేపట్టిన యూపీఎస్సీ ఆమెకు శుక్రవారం షోకాజ్ నోటీసు జారీ చేసింది. నకిలీ ధ్రువపత్రాలు సమర్పించి మోసానికి పాల్పడటంపై పోలీసుల ద్వారా ఫోర్జరీ కేసు నమోదు చేసింది. అంతేకాకుండా ఆమె యూపీఎస్సీ అభ్యర్థిత్వాన్ని రద్దు చేయడంతోపాటు భవిష్యత్తులో మళ్లీ నియామక పరీక్షలు రాయకుండా డిబార్ చేసేందుకు రంగం సిద్ధం చేసేలా షోకాజ్ నోటీసు ఇచ్చింది. అధికార దుర్వినియోగం, యూపీఎస్సీకి తప్పుడు అఫిడవిట్ సమర్పించారన్న ఆరోపణలతో పలు వివాదాలకు కేంద్రబిందువుగా మారిన పూజా ఖేడ్కర్ అనుచిత ప్రవర్తనపై సమగ్ర దర్యాప్తు చేపట్టినట్లు యూపీఎస్సీ శుక్రవారం మధ్యాహ్నం ఓ ప్రకటనలో తెలిపింది.
యూపీఎస్సీ పరీక్ష నిబంధనల్ని అతిక్రమిస్తూ అవకాశాలను వాడుకొని ఆమె నకిలీ పత్రాలతో పరీక్షను క్లియర్ చేసినట్లు గుర్తించామని పేర్కొంది. తన పేరు, తల్లిదండ్రుల పేర్లు, ఫొటోగ్రాఫ్/సంతకం, ఈ-మెయిల్ ఐడీ, మొబైల్ నంబర్, చిరునామాకు సంబందించిన పత్రాలన్నీ మార్చడం ద్వారా మోసపూరిత ప్రయత్నాలకు పాల్పడ్డారని యూపీఎస్సీ వివరించింది. మోసపూరితంగా 12సార్లు పరీక్ష రాసినట్లుగా గుర్తించింది. షోకాజ్ నోటీసుపై పూజా ఖేడ్కర్ ఇచ్చే సమాధానం ఆధారంగా ఆమెపై తదుపరి చర్యలు ఉంటాయి. ఇప్పటికే ఆమె ప్రొబేషన్‌ను నిలిపివేసి, ముస్సోరిలోని లాల్ బహదూర్ శాస్త్రి జాతీయ ఆకాడమీకి తిరిగి రావాలని ఆదేశించగా.. తాజాగా అభ్యర్థిత్వాన్ని సైతం రద్దు చేస్తూ యూపీఎస్సీ నిర్ణయం తీసుకొంది.