విజయ్ ఈల.. రెండు ప్రధాన ద్రవిడ పార్టీల చెవుల్లో మోత..
తమిళనాడు రాజకీయాల్లో కీలక పరిణామం చోటు చేసుకున్నది ఐదు దశాబ్దాలుగా అయితే డీఎంకే లేదంటే అన్నాడీఎంకే అనే సంప్రదాయాన్ని బద్దలు కొట్టారు సినీ హీరో, టీవీకే అధినేత విజయ్. 111 స్థానాల్లో టీవీకే అభ్యర్థులు దూసుకుపోతున్నారు.
తమిళనాట విజయ్ ‘ఈల’ మోత మోగించింది. అయితే డీఎంకే లేదంటే అన్నాడీఎంకే అనేలా యాభై ఏళ్లుగొ కొనసాగుతున్న సంప్రదాయాన్ని రెండేళ్ల వయసున్న తమిళగ వెట్రి కళగం (టీవీకే) చీల్చి చెండాడింది. పొత్తులు లేకుండా, ప్రజాకర్షక పథకాలు ప్రకటించకుండా నిజాయతీతో పాలిస్తానన్న విజయ్ మాట నమ్మిన ప్రజానీకం అధికార డీఎంకేను, ప్రతిపక్ష అన్నాడీఎంకేను పక్కకు పెట్టేసి.. విజయ్ పార్టీ టీవీకేకు అద్భుతమైన మెజార్టీ కట్టబెడుతున్నట్టు మధ్యాహ్నం 2.30 గంటల వరకూ ఉన్న ఫలితాలను బట్టి తెలుస్తున్నది. ముక్కోణ పోటీలో తమిళగ వెట్రి కళగం (టీవీకే) అప్రతిహతంగా దూసుకుపోతున్నది. ప్రత్యేకించి జెన్‌జీ రివొల్యూషన్ తమిళనాడుతో మొదలైందన్న విశ్లేషణలు వెలువడుతున్నాయి.
నిజానికి చాలా సర్వేలు డీఎంకే రెండోసారి అధికారంలోకి వస్తుందని అంచనాలు వేశాయి. ఒక్క యాక్సిస్ మై ఇండియా మాత్రం టీవీకే మ్యాజిక్‌ను అంచనా వేయగలిగింది. 234 మంది సభ్యులున్న తమిళనాడు అసెంబ్లీలో ప్రభుత్వ ఏర్పాటుకు 118 మంది మద్దతు అవసరం. ఇందులో విజయ్ కనీసం 100 సీట్లు గెలిచి కింగ్ మేకర్ అవుతాడని యాక్సిస్ మై ఇండియా అంచనా వేసింది. ఆ అంచనాలను కూడా మించిపోతూ తాజా సమాచారం ప్రకారం. 111 సీట్లలో ఆధిక్యం/విజయంతో టీవీకే ఉన్నది.
ప్రభుత్వ ఏర్పాటుకు టీవీకేకు కేవలం 7 సీట్లు ఇంకా రావాల్సి ఉన్నది. ఇంకా కౌంటింగ్ కొనసాగుతూనే ఉన్నది. వీటిలో ఆ ఖాళీని టీవీకే భర్తీ చేసుకుంటుందా? లేక ఇతర చిన్నాచితక పార్టీల మద్దతు తీసుకుంటుందా? అనేది వేచి చూడాల్సి ఉంది. ఏది ఏమైనా విజయ్ ముఖ్యమంత్రి కావడానికి మెరుగైన అవకాశాలు కనిపిస్తున్నాయి. 1977లో అప్పటి వరకూ నటుడిగా ఉన్న ఎంజీ రామచంద్రన్.. తొలిసారి సీఎం పీఠం అధిష్ఠించారు. కరుణానిధి కూడా సినీ రంగం నుంచి వచ్చినవారైనప్పటికీ.. ఒక నటుడు సీఎం అవడం అదే తొలిసారి. తర్వాత జయలలిత, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ఎన్టీ రామారావు ముఖ్యమంత్రులు అయ్యారు. తమిళనాడులో అనేక మంది సినీ హీరోలు రాజకీయ ప్రయోగాలు చేసినప్పటికీ ఎవ్వరూ సక్సెస్ కాలేదు. జయలలిత ఎంజీఆర్ వారసురాలిగా రాజకీయాల్లోకి వచ్చి ముఖ్యమంత్రి అయ్యారు కానీ.. సొంతగా పార్టీ స్థాపించినవారు కాకపోవడం గమనార్హం. ఇప్పుడు మళ్లీ విజయ్ ఆ పాత్ర పోషించే అవకాశాలు కనిపిస్తున్నాయి.
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram