విప్స్ వందల కోట్ల చీటింగ్ కేసులో ఈడీ, ఐటీలు ఎక్కడా..?

విప్స్ స్కాం కేసులో వందల కోట్ల మోసం బయటపడగా ఈడీ, ఐటీ చర్యలపై ప్రశ్నలు వెల్లువెత్తుతున్నాయి. వినోద్ ఖుటే విదేశాలకు పారిపోవడంతో బాధితుల్లో ఆందోళన పెరిగింది.

vips-group-vinod-khute-fraud-case-ed-it-investigation-update-2026

విధాత: అధిక లాభాలు, క్యాష్ బ్యాక్ ఆఫర్ల పేరుతో మల్టీలెవల్ మార్కెటింగ్ అంటూ ప్రజలను వందల కోట్లు మోసం చేసిన విప్స్(విప్స్ గ్రూప్ ఆఫ్ కంపెనీ) అధినేత వినోద్ తుకారాం ఖుటే, ఆయన ఏజెంట్లు చేసిన మోసంపై కేసులు నమోదైనప్పటికి ఈ వ్యవహారంలో ఎన్ ఫోర్స్ మెంట్ డైరక్టరేట్(ఈడీ), ఐటీ  తీసుకున్న చర్యలు ఏమిటన్నది ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. 2025లో ఏప్రిల్ 14న విప్స్ కంపెనీ మోసాలపై నల్లగొండ రూరల్ పోలీస్ స్టేషన్ లో  కేసు నమోదవ్వగా..కంపెనీ నిర్వాహకులపై అప్పుడే సీరియస్ గా చట్టపరమైన చర్యలు తీసుకోవాల్సిన నల్లగొండ పోలీసులు నిర్లక్ష్యం ప్రదర్శించారు. అదే అలుసుగా తీసుకున్న విప్స్ కంపెనీ నిర్వహకులు ఈ జిల్లాతో పాటు దేశ వ్యాప్తంగా మరోసారి వేవ్ పేరుతో మళ్లీ రూ.లక్ష డిపాజిట్ చేస్తే పాత డబ్బులు కలిపి ఇస్తామంటూ మరో మోసానికి తెరతీశారు. ఈ క్రమంలో మేల్కొన్న పోలీసులు విప్స్ సంస్థకు చెందిన 15మందిపై కేసు నమోదు చేసి..10మందిని అరెస్టు చేసింది. అయితే ఆర్థిక చట్టాలు..రిజర్వ్ బ్యాంకు నిబంధనల ఉల్లంఘనలతో విప్స్ సంస్థ విచ్చలవిడిగా ప్రజల నుంచి వందల కోట్ల డిపాజిట్లు సేకరిస్తుంటే నిఘా సంస్థలు ఏం చేశాయన్నదానిపై ఇప్పుడు రకరకాల చర్చలు కొనసాగుతున్నాయి.

వందల కోట్ల డిపాజిట్లు..ఎక్కడికి పోయాయో?

తాజా అరెస్టులకంటే ముందే 2016నుంచి విప్స్ సంస్థ తెలుగు రాష్ట్రాల్లో ప్రజల నుంచి అధిక వడ్డీల ఆశ చూపి రూ.350కోట్లకు పైగా డిపాజిట్లు సేకరించి యాప్ ను మూసివేసి జనం నెత్తిన శఠగోపం పెట్టింది. డిపాజిట్ దారుల్లో భారీగా పోలీస్ ఉద్యోగులు, నల్లధనం వ్యాపారులతో పాటు సామాన్య ప్రజలు కూడా ఉన్నారు. వాస్తవానికి విప్స్ సేకరించిన డిపాజిట్లు దేశ వ్యాప్తంగా ప్రచారంలో ఉన్న మొత్తం కంటే ఎక్కువే… వందల కోట్లలో ఉంటాయని ఆ కంపెనీ డైరక్టర్లే చెబుతున్నారు. అన్నేసి.. వందల కోట్ల మోసానికి పాల్పడిన వినోద్ ఖుటేపై సైబర్ క్రైమ్ విభాగాలు, ఈడీ, ఐటీ శాఖలు ఎందుకు చట్టపరమైన  చర్యలు  లేదన్న ప్రశ్న ఇప్పుడు అందరిని ఆలోచింపచేస్తుంది. పైగా వినోద్ ఖుటే తను దేశంలో విప్స్ పేరుతో లూటీ చేసిన జనం డబ్బుతో దుబాయ్ పారిపోయి.. విదేశాల ఆన్ లైన్ కంపెనీలు, షెల్ కంపెనీలకు పెట్టుబడుల రూపంలో తరలించాడని ఈడీ సైతం గుర్తించింది.

ఈడీ కేసు తర్వాత కూడా విప్స్ నిర్వాహకులు మారుపేర్లతో డిపాజిట్ల సేకరణ చేస్తుంటే ఏసీబీ, ఈడీ, ఐటీ, సీబీఐ వంటి దర్యాప్తు సంస్థలు ఎందుకు విప్స్ కంపెనీ ఆర్థిక చట్టాల ఉల్లంఘనపై ప్రేక్షక పాత్ర పోషించాయన్నది ప్రశ్నార్ధకంగా మారింది. విప్స్ నిర్వాహకులు మనీలాండరింగ్ యాక్ట్, ఫెరా/ఫెమా నిబంధనలను, ఐటీ ఉల్లంఘనలు, డిపాజిట్ల సేకరణ నిబంధనల ఉల్లంఘన చేసినా..ఎందుకు ఆయా దర్యాప్తు సంస్థలు చట్టపరంగా అడ్డుకోలేకపోయాయన్న సందేహాలు సర్వత్రా వినిపిస్తున్నాయి. మహారాష్ట్రకు చెందిన విప్స్ అధినేత వినోద్ ఖుటే వెనుక కేంద్ర రాష్ట్రాల్లోని రాజకీయ పార్టీల ప్రమేయం ఉందన్న అనుమానాలు సైతం వినిపిస్తున్నాయి.

విప్స్ తరహాలో యస్ వరల్డ్ మరో భారీ మోసం

ఉమ్మడి నల్లగొండ జిల్లా సహా దేశ వ్యాప్తంగా విప్స్ కంపెనీ తరహాలోనే అదే కంపెనీ డైరక్లర్లు కొందరు యస్ వరల్డ్ అనే మరో ఆన్ లైన్ యాప్ ను కూడా ప్రమోట్ చేసి కోట్ల రూపాయాల డిపాజిట్లను సేకరించారు. యస్ వరల్డ్ కంపెనీ నిర్వాహకులపై ఇతర రాష్ట్రాలలో కేసు నమోదైనప్పటికి..తెలుగు రాష్ట్రాల్లోని ఆ కంపెనీ డైరక్టర్లు, ఏజెంట్లపై మాత్రం ఎలాంటి చట్టపర చర్యలు తీసుకోలేదు. దీంతో యస్ వరల్డ్ లో పెట్టుబడి పెట్టిన బాధితులకు చెందిన కోట్ల రూపాయల డిపాజిట్లను ఆ కంపెనీ నిర్వాహకులు కొల్లగొట్టారు. ఆ తర్వాతా అదే యస్ వరల్డ్ నిర్వాహకులు సేవ్ ఎర్త్ మిషన్ పేరుతో మరో కొత్త మోసానికి తెరలేపారు. విప్స్ కంపెనీ ప్రతినిధులను అరెస్టు చేసినట్లుగానే యస్ వరల్డ్ సంస్థ డైరక్టర్లను కూడా అరెస్టు చేసి చట్టపరమైన చర్యలు తీసుకుని మా డబ్బులు మాకు వచ్చేలా  న్యాయం చేయాలని బాధితులు కోరుతున్నారు.

అక్కడ వినోద్ ఖుటే ఆస్తుల ఆటాచ్ !

పూణేకు చెందిన వీఐపీఎస్ గ్రూప్ ఆఫ్ కంపెనీ, మెస్సర్స్ గ్లోబల్ అఫిలియేట్ బిజినెస్ కంపెనీ యజమాని అయిన వినోద్ ఖుటే కుటుంబ సభ్యులకు చెందిన రూ. రూ. 89.54 స్థిరాస్తులను, మనీలాండరింగ్ నిరోధక చట్టం (PMLA), 2002 నిబంధనల ప్రకారం జప్తు చేస్తూ, ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ED) ముంబై జోనల్ కార్యాలయం ఒక తాత్కాలిక జప్తు ఉత్తర్వును 2025 జూలైలో జారీ చేసింది. ఓవైపు ఈడీ కేసులు కొనసాగుతుండగానే..దుబాయ్ నుంచే భారత్ లో విప్స్ నిర్వాహకులు కొత్త డిపాజిట్ల సేకరణ కొనసాగిస్తుండటం సంచలనంగా మారింది.

రూ.100కోట్లపైగా డిపాజిట్ల గుర్తింపుపై ఈడీ ప్రకటన

సామాన్య ప్రజలను మోసం చేయడం, అధిక రాబడులు ఇస్తామనే నెపంతో పాంజీ స్కీమ్‌లు , ఫారెక్స్ ట్రేడింగ్‌లోకి సామాన్య ప్రజలను ఆకర్షించి నేరపూరిత కుట్ర పన్నడం, తద్వారా అనేక బూటకపు సంస్థలు/కంపెనీల బ్యాంకు ఖాతాలలో రూ. 100 కోట్లకు పైగా వసూలు చేశారనే ఆరోపణలపై వినోద్ తుకారాం ఖుటే, సంతోష్ ఖుటే, మంగేష్ ఖుటే, కిరణ్ పితాంబర్ అనరసే, అజింక్య బదాధే సహా మరికొందరిపై 2023లో పూణేలోని భారతీ విద్యాపీఠ్ పోలీస్ స్టేషన్‌లో 1860 భారత శిక్షాస్మృతిలోని వివిధ సెక్షన్ల కింద నమోదైన ఎఫ్‌ఐఆర్ ఆధారంగా దర్యాప్తు ప్రారంభించినట్లు ఈడీ తెలిపింది.

ప్రస్తుతం దుబాయ్‌లో నివసిస్తున్నట్లు అనుమానిస్తున్న, పరారీలో ఉన్న వినోద్ ఖుటే, దుబాయ్‌కు చెందిన ‘మెస్సర్స్ కానా క్యాపిటల్ లిమిటెడ్’ సంస్థ ద్వారా జరిగిన వివిధ అక్రమ వ్యాపారాలు, క్రిప్టో ఎక్స్ఛేంజ్, వాలెట్ సేవలు, ఫారెక్స్ ట్రేడింగ్ వెనుక సూత్రధారి అని దర్యాప్తులో వెల్లడైనట్లు ఈడీ పేర్కొంది.

వినోద్ ఖుటే అక్రమ ఆర్థిక కార్యకలాపాలు నిర్వహించడానికి మెస్సర్స్ వీఐపీఎస్‌వాలెట్ ప్రైవేట్ లిమిటెడ్, మెస్సర్స్ వీఐపీస్‌ట్రేడ్ ఫైనాన్స్ ప్రైవేట్ లిమిటెడ్ (మెస్సర్స్ వీటిఎఫ్‌పీఎల్), మెస్సర్స్ కానా క్యాపిటల్స్ లిమిటెడ్, మెస్సర్స్ గ్లోబల్ అఫిలియేట్ బిజినెస్ (జిఎబి), వీఐపీఎస్ సెక్యూరిటీస్, వీఐపీఎస్ ప్రాపర్టీస్ వంటి పలు కంపెనీలను స్థాపించినట్లు దర్యాప్తులో వెల్లడైంది.

ప్రజల డిపాజిట్లు..అక్రమ కంపెనీలలోకి మళ్లింపు

అంతేకాకుండా, లావాదేవీల అక్రమ స్వభావాన్ని దాచిపెట్టడానికి పెట్టుబడిదారుల నుండి నిధులను సేకరించి, వాటిని షెల్ కంపెనీలు మరియు బూటకపు ఖాతాల ద్వారా మళ్లించారని ఈడీ ఆరోపించింది. ఆ తర్వాత, నియంత్రణ సంస్థల పరిశీలన నుండి తప్పించుకోవడానికి, మనీలాండరింగ్‌కు వీలు కల్పించేందుకు, యూఎస్‌డీటీ వంటి క్రిప్టోకరెన్సీకి బదులుగా, హవాలా ఆపరేటర్ల ద్వారా భారతదేశం నుండి దుబాయ్‌కు నిధులు బదిలీ చేయబడ్డాయని ఆరోపించింది. ఇప్పటివరకు జరిపిన దర్యాప్తు ప్రకారం రూ. 125 కోట్లకు పైగా ఉన్న నేర ఆదాయాన్ని వినోద్ ఖుటే తన వ్యక్తిగత అవసరాల కోసం, తన కంపెనీల రోజువారీ వ్యవహారాలు నడపడానికి, దుబాయ్‌తో పాటు భారతదేశంలో ఆస్తులు కొనుగోలు చేయడానికి మొదలైన వాటికి వినియోగించుకున్నారని ఈడీ తెలిపింది.

రూ. 89.54 కోట్లకు చేరిన వినోద్ ఖుటే ఆస్తుల జప్తు

కేంద్ర ఎన్‌ఫోర్స్‌మెంట్ ఏజెన్సీ ప్రకారం, జప్తు చేయబడిన వినోద్ ఖుటే, అతని కుటుంబ సభ్యుల ఆస్తులలో పూణేలో ఉన్న 366.92 చదరపు మీటర్ల విస్తీర్ణం గల ఐదు నివాస ఫ్లాట్లు, 139.39 చదరపు మీటర్ల విస్తీర్ణం గల రెండు బహుళార్ధసాధక హాళ్లు, 366.92 చదరపు మీటర్ల విస్తీర్ణం గల రెండు కార్యాలయ స్థలాలు, మహారాష్ట్రలోని అహ్మద్‌నగర్ జిల్లాలో ఉన్న 2 హెక్టార్ల భూమి ఉన్నాయని ఈడీ పేర్కొంది. గతంలో, వీఐపీఎస్ గ్రూప్ ఆఫ్ కంపెనీస్, మెస్సర్స్ గ్లోబల్ అఫిలియేట్ బిజినెస్ కంపెనీ యజమాని అయిన వినోద్ ఖుటేకు చెందిన, దుబాయ్‌లో ఉన్న రూ. 37.50 కోట్ల విలువైన విదేశీ ఆస్తులను, రూ. 24.41 కోట్ల విలువైన చరాస్తులను పీఎంఎల్‌ఏ, 2002 నిబంధనల కింద ఈడీ తాత్కాలిక జప్తు ఉత్తర్వు జారీ చేసింది.

మహారాష్ట్రలోని పూణే, ధరాశివ్, కొల్హాపూర్, సాంగ్లీ జిల్లాలలో ఉన్న భూములు, ఫ్లాట్లతో సహా ఈ ఆస్తులను జప్తు చేసినట్లుగా 2025 జూలై 25న ఈడీ ముంబై జోనల్ కార్యాలయం జారీ చేసిన తాత్కాలిక జప్తు ఉత్తర్వులో పేర్కొంది. అప్పటివరకు ఈ కేసులో జప్తు చేసి, స్తంభింపజేసిన ఆస్తుల మొత్తం విలువ రూ. 89.54 కోట్లకు చేరింది. ఈ పరిణామం అనంతరం కూడా దేశ వ్యాప్తంగా విప్స్ డిపాజిట్ల సేకరణ పలు రకాల   మారు పేర్లతో కొనసాగడం దర్యాప్తు సంస్థల వైఫల్యాలకు నిదర్శనంగా కనిపిస్తుంది.

వినోద్ ఖుటే దొరికేది ఎట్లా….జనం సొమ్ము రికవరీ ఎలా ?

విప్స్ కంపెనీ చేసిన ఆన్ లైన్ ఆర్థిక మోసాలపై ఆలస్యంగా స్పందించి… 15మంది కంపెనీ ప్రతినిధులపై కేసు నమోదు చేసి చేతులు దులుపుకున్న నల్లగొండ పోలీసులకు..విదేశాల్లో ఉన్న ప్రధాన నిందితుడు వినోద్ ఖుటేను ఎలా అరెస్టు చేస్తారన్న ప్రశ్న ఇప్పుడు బాధితుల నుంచి ఎదురవుతుంది.  దుబాయ్ లో ఉన్న వినోద్ ఖుటేను స్వదేశానికి ఎలా రప్పిస్తారు ?..ఇందుకు ఎంతకాలం పడుతుందన్న? ప్రశ్న పోలీసులకు సైతం సవాల్ వంటిదే. ఇప్పుడు దుబాయ్ లో ఉన్న వినోద్ ఖుటే అరెస్టుకు లుక్ అవుట్ , రెడ్ కార్నర్ వంటి పద్దతులు అనుసరిస్తారా లేదా అన్నది తేలాల్సి ఉంది. విదేశాల్లో దాక్కుని ప్రజల డబ్బులతో వ్యాపారాలు, జల్సాలు చేస్తున్న వినోద్ ఖుటే సహా కీలక నిందితులందరిని అదుపులోకి తీసుకుంటేగాని ప్రజల డబ్బుల రికవరీ అంశంపై స్పష్టత రాదు.  వినోద్ ఖుటే నుంచి జప్తు చేసిన ఆస్తుల ద్వారా  మోసపోయిన డిపాజిటర్లకు కొంతవరకైనా డబ్బులు ఇచ్చి ప్రభుత్వాలు న్యాయం చేయాలని బాధితులు కోరుతున్నారు.

ఇవి కూడా చదవండి :

ఫోన్‌లో ఆరోగ్య సూచనలు.. స్వచ్ఛంద సంస్థకు టెమ్రీస్‌ చెల్లింపులు నెలకు ఆరు లక్షలు
కొత్త ఇళ్ల కొనుగోళ్లకు హైదరాబాదీల విముఖత.. కారణాలివే

Latest News