బెంగాల్‌లో రోగి భోజనానికి రూ.110.. ధనిక రాష్ట్రం తెలంగాణలో రూ.80 మాత్రమే

ప్రభుత్వ ఆసుపత్రులలో చికిత్స పొందుతున్న రోగుల భోజనం రేట్లను పెంచుతూ బెంగాల్ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. పెంచిన రేట్లు ఆగస్టు 1వ తేదీ నుంచి అమలుపరుచనున్నారు. ప్రస్తుతం ఒక రోగికి రోజుకు రూ.56.64 ఇస్తుండగా వచ్చే నెల 1వ తేదీ నుంచి రూ.110 చొప్పున ప్రభుత్వం చెల్లించనున్నది.

patient food rates west bengal vs telangana IMAGE GENERATED WITH AI HELP

విధాత, హైదరాబాద్:
ప్రభుత్వ ఆసుపత్రులలో చికిత్స పొందుతున్న రోగులకు ఇచ్చే భోజనం రేట్లను పెంచుతూ పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. పెంచిన రేట్లు ఆగస్టు 1వ తేదీ నుంచి అమలుపరుచనున్నారు. ప్రస్తుతం ఒక రోగికి రోజుకు రూ.56.64 ఇస్తుండగా వచ్చే నెల 1వ తేదీ నుంచి రూ.110 చొప్పున ప్రభుత్వం చెల్లించనున్నది. కోల్‌కతా హైకోర్టు ఆదేశాల మేరకు భోజనం రేట్లను సవరించారు. అలాగే ప్రభుత్వ పాఠశాలలో మధ్యాహ్నం భోజనం కోసం ప్రస్తుతం రూ.6.78 ఖర్చు చేస్తుండగా, ఆగస్టు 1వ తేదీ నుంచి రూ.10 చొప్పు వ్యయం చేయనున్నారు. ఈ మేరకు ముఖ్యమంత్రి సువేంధు అధికారి ఆదేశాలు జారీ చేశారు. పశ్చిమ బెంగాల్ లో రూ.110 చొప్పున ఒక రోగికి రోజుకు ఇస్తుండగా, ధనిక రాష్ట్రం తెలంగాణలో మాత్రం రూ.80 మాత్రమే చెల్లిస్తున్నారు.

ఇంధన ధరల పెరుగుదలతో

దేశంలో ఇంధన ధరలు పెరుగుతుండడంతో ఆ ప్రకారంగా నిత్యావసర ధరలు, మానవ వనరుల ధరలు కూడా పెరుగుతున్నాయి. అందుకు తగ్గట్టుగా ప్రభుత్వ ఆసుపత్రులలో భోజనం రేట్లను పెంచకపోవడం మూలగా నాణ్యమైన, పౌష్టికాహారం రోగులకు అందడం లేదు. దీంతో రోగులు సరైన భోజనం చేయలేకపోతున్నారంటూ పలువురు హైకోర్టును ఆశ్రయించగా, వాదోపవాదాల తరువాత ఉత్తర్వులు జారీ చేసింది. 2017 సంవత్సరం నుంచి ధరలు సవరించలేదని, ధరలు పెరుగుతున్నా ప్రభుత్వం పాత ధరల ప్రకారమే చెల్లింపులు చేస్తున్నదని కోర్టుకు తెలిపారు. రోగులకు పౌష్టికాహారం అందచేసేందుకు ధరలు సవరించాల్సిందిగా ఆదేశించడంతో ఆరోగ్య, కుటుంబ సంక్షేమ విభాగం కమిటీ ఏర్పాటు చేసింది. కమిటీ ప్రస్తుత మార్కెట్ ధరలను పరిగణనలోకి తీసుకుని ప్రతి రోజు ఒక రోగికి రూ.110 చొప్పున చెల్లించాలని తీర్మానం చేసింది. ఆగస్టు 1వ తేదీ నుంచి అమలు చేయాల్సిందిగా ప్రభుత్వాన్ని సూచించడంతో, అమలు చేస్తున్నట్లు ప్రకటన విడుదల చేసింది. ప్రభుత్వ ఆసుపత్రులు, పాఠశాలల్లో పౌష్టికాహారం అందించేందుకు తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని, ప్రజల సంక్షేమం కోసం ఎప్పుడూ ముందుంటామని ముఖ్యమంత్రి సువేంధు అధికారి ప్రకటించారు. చివరగా 2017 సంవత్సరంలో మమతా బెనర్జీ ప్రభుత్వం రేట్లను సవరించిందని, ఆ తరువాత సవరించకపోవడం మూలంగా ఈ సమస్యలు తలెత్తాయని, తాను అధికారంలోకి రాగానే రెండు నెలల్లో కొలకతా హైకోర్టు ఆదేశాలు అమలు చేశానని ఆయన వెల్లడించారు.

తెలంగాణలో డైట్ ఛార్జీ రోజుకు రూ.80…

తెలంగాణలోని ప్రభుత్వ ఆసుపత్రులలో రోగులకు ఇస్తున్న భోజనం లో పౌష్టిక విలువలు పూర్తిగా లోపించాయి. భోజనంలో నాణ్యతను పరిశీలించేందుకు ఉమ్మడి పది జిల్లాల్లో విజిలెన్స్ బృందాలు తనిఖీలు చేశాయి. అధికారుల తనిఖీల్లొ అనేక లోపాలు వెలుగు చూశాయి. కొలమానం ప్రకారం అహార పదార్థాలు ఇవ్వాల్సి ఉండగా ఎక్కడా పాటించడం లేదు. డైటీషియన్లు లేకపోవడం మూలంగా మెనూ అమలు కావడం లేదు. మెనూ లో ఏమేమి పాటించాలనేది డైటీషియన్లు నిత్యం పరిశీలించి, ఆమోదం తెలపాల్సి ఉండగా ఎక్కడా అమలైన దాఖలాలు విజిలెన్స్ తనిఖీల్లో స్పష్టమైంది. డైటీషియన్లు లేకపోవడంతో ఆ బాధ్యతలను ప్రధాన ఆసుపత్రులలో ఆర్ఎంఓ లకు అప్పగించారు. అయితే దీనిపై సరైన అవగాహన లేకపోవడం చూసిచూడనట్లుగా మమ అని వదిలేస్తున్నారు. ఇక్కడ పనిచేస్తున్న డైటీషియన్లను జిల్లాలకు బదిలీ చేయడం, వారి స్థానంలో కొత్తవారిని నియమించకపోవడం ప్రధాన సమస్యగా మారింది. దీంతో ప్రధాన ఆసుపత్రులలో ఆహార నాణ్యతా ప్రమాణాలు అమలు కావడం లేదు. వంట గదుల విస్తీర్ణం పెంచడంతో పాటు ప్రతి జిల్లాలో డైటీషియన్లు నియమించాలని సూచించారు. బిల్లులు సకాలంలో చెల్లించకపోవడం, పెరుగుతున్న ధరలకు అనుగుణంగా రేట్లను సవరించకపోవడం మూలంగా నాణ్యత లోపిస్తుందని వెలుగు చూసింది.

ఇదిలా ఉంటే ప్రభుత్వ ఆసుపత్రులలో ప్రతి రోగికి డైట్ ఛార్జీల కింద రూ.80 చొప్పున వైద్య, ఆరోగ్య శాఖ మంజూరు చేస్తున్నది. అయినా సరే నాణ్యత లో ఏమాత్రం మార్పు కన్పించకపోవడం గమనార్హం. ఉదాహారణ కు హైదరాబాద్ నగరంలో గాంధీ, ఉస్మానియా, ఎర్రగడ్డ ఛాతి వైద్యశాల, మానసిక వైద్యశాల, కోఠి ఈఎన్టీ, ఎర్రగడ్డ ఆయుర్వేద ఆసుపత్రి, సుల్తాన్ బజార్ ప్రసూతి ఆసుపత్రి, పెట్లబురుజు ప్రసూతి ఆసుపత్రులలో రోగుల తాకిడి వేల సంఖ్యలో ఉంటుంది. ప్రతి ఆసుపత్రిలో వందల సంఖ్యలో ఇన్ పేషెంట్లు చికిత్స పొందుతుంటారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం ప్రతి రెండు వారాలకు ఒకసారి కాంట్రాక్టర్ కు బిల్లులు చెల్లించాల్సిన వైద్య, ఆరోగ్య శాఖ ఆ ప్రకారం చెల్లింపులు చేయకపోవడం ప్రధాన సమస్యగా మారింది. ఆరు నెలలకు పైగా బకాయిలు ఉండడంతో కాంట్రాక్టర్లు అప్పులు చేసి ఆహారం సరఫరా చేస్తున్నారు. క్రమం తప్పకుండా బిల్లులు మంజూరు చేయకపోవడం తమకు తలకు మించిన భారంగా పరిణమించిందని లబోదిబోమంటున్నారు. నగరంలో ఏ ఆసుపత్రి తీసుకున్నా రూ.కోట్లలో బకాయిలు ఉన్నాయనేది స్పష్టమవుతున్నది. దీంతో రోగులకు నాసిరకం భోజనం సరఫరా చేయక తప్పని పరిస్థితులు వైద్య, ఆరోగ్య శాఖ కల్పిస్తున్నదనే విమర్శలున్నాయి. ఎర్రగడ్డ ఆయుర్వేద ఆసుపత్రిలో ఇన్ పేషెంట్లు లేనప్పటికీ, వారి పేరుతో వంటలు చేసి సొమ్ము చేసుకుంటుడడం శోచనీయం.

Latest News