Locsaba Polls |జలంధర్‌లో జండా ఎగరేసిది ఏ పార్టీ?

సార్వత్రిక ఎన్నికల సమరంలో భాగంగా చివరి దశలో పంజాబ్‌లోని మొత్తం 13 స్థానాలకు ఒకేసారి పోలింగ్‌ జరగనున్నది. ఇందులో అందరి దృష్టి జలంధర్‌ నియోజకవర్గంపై ఉన్నది

Locsaba Polls |జలంధర్‌లో జండా ఎగరేసిది ఏ పార్టీ?

విధాత ప్రత్యేకం)
సార్వత్రిక ఎన్నికల సమరంలో భాగంగా చివరి దశలో పంజాబ్‌లోని మొత్తం 13 స్థానాలకు ఒకేసారి పోలింగ్‌ జరగనున్నది. ఇందులో అందరి దృష్టి జలంధర్‌ నియోజకవర్గంపై ఉన్నది. ఎందుకంటే దళితుల ఓటర్ల ప్రాబల్యం ఇక్కడ ఎక్కువగా ఉంటుంది. ఈ నియోజకవర్గంలో సుమారు 30 శాతం ఎస్సీ ఓటర్లు ఉంటారు. 2014, 2019లో ఇక్కడ కాంగ్రెస్‌ గెలిచింది. అయితే కాంగ్రెస్‌ ఎంపీ సంతోఖ్ సింగ్ చౌదరి మరణంతో జరిగిన ఉప ఎన్నికల్లో ఆమ్‌ ఆద్మీ పార్టీ అభ్యర్థి సుశీల్‌ కుమార్‌ రింకూ విజయం సాధించారు. ఈసారి ఆప్‌ అక్కడ తన విజయాన్ని పునరావృతం చేస్తుందా? లేక కాంగ్రెస్‌ తన కంచుకోటపై పూర్వ వైభవం సాధిస్తుందా? అన్న ఆసక్తి రాజకీయవర్గాల్లో నెలకొన్నది. ఎస్సీ నియోజకవర్గమైన జలంధర్‌లో ఈసారి ఆప్‌, కాంగ్రెస్‌, శిరోమణి అకాలీదళ్‌, బీఎస్పీ బరిలో ఉన్నాయి. కాంగ్రెస్‌ తరఫున పంజాబ్‌ మాజీ సీఎం చరణ్‌జీత్‌ సింగ్‌ చన్నీ, ఉప ఎన్నికల్లో ఆప్‌ నుంచి గెలిచిన సుశీల్‌ కుమార్‌ రింకు బీజేపీ తరఫున, ఆప్‌ అభ్యర్థిగా పవన్‌కుమార్‌, అకాలీదళ్‌ నుంచి మొహిందర్ సింగ్, బీఎస్పీ తరఫున బల్వీందర్ కుమార్ బరిలో ఉన్నారు. గత ఎన్నికల్లో కలిసి పోటీ చేసిన బీజేపీ..అకాలీదళ్‌లు ఈసారి విడిగా పోటీ చేస్తున్నాయి. 2020లో కేంద్రం తెచ్చిన వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్తూ అకాలీదళ్‌ ఎన్డీఏ నుంచి వైదొలిగిన సంగతి తెలిసిందే.

కాంగ్రెస్‌ పార్టీకి ఈ నియోజకవర్గం కంచుకోట. 1999 నుంచి 2019 వరకు ఇక్కడ ఆ పార్టీ వరుస విజయాలు సాధిస్తూ వచ్చింది. అయితే 2023లో సంతోఖ్ చౌదరి మరణంతో ఉప ఎన్నిక జరిగింది. ఈ ఎన్నికలో సంతోఖ్‌ సింగ్ చౌదరి భార్య కరమ్‌జీత్ కౌర్ చౌదరిని ఆప్‌కు చెందిన సుశీల్ కుమార్ రింకూ ఓడించడంతో మొదటిసారి పెద్ద ఎదురుదెబ్బ తగిలింది. ఆ ఉప ఎన్నికల్లో రింకూకు 3,02,279 ఓట్లు వస్తే కరమ్‌జీత్‌ కౌర్‌కు 2,43, 588 ఓట్లు వచ్చాయి.

దేశంలోనే అత్యధికంగా దళిత ఓట్లు ఈ నియోజకవర్గంలోనే ఉంటాయంటారు. ఇక్కడ కాంగ్రెస్‌ నుంచి పోటీ చేస్తున్న మాజీ సీఎం చరణ్‌జిత్ సింగ్ చన్నీకి ఈ ఎన్నిక ప్రతిష్ఠాత్మకంగా మారింది. ఎందుకంటే 2022లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో చన్నీ తన సొంత గడ్డ అయిన చమ్‌కౌర్ సాహిబ్‌తోపాటు భదౌర్ నుంచి కూడా పోటీ చేశాడు. ఆయన రెండుచోట్లా ఆప్‌ అభ్యర్థుల చేతిలో ఓడిపోయారు. అందుకే ఈ నియోజకవర్గంలో ఆప్‌ను గెలిపించాలని పంజాబ్‌ సీఎం భగవంత్‌మాన్‌, కాంగ్రెస్‌ కంచుకోటను నిలబెట్టుకోవాలని మాజీ సీఎం చన్నీ చూస్తున్నారు. ఆప్‌ నుంచి గెలుపొందిన రింకూ బీజేపీలో చేరి ఆ పార్టీ తరఫున నిలబడటం, ఆప్‌ నుంచి పోటీలో ఉన్న పవన్‌కుమార్‌ బలమైన దళిత నేత కావటం, అకాలీదళ్‌ నుంచి మాజీ ఎంపీ మోహిందర్‌సింగ్‌ (2009లో ఆయన కాంగ్రెస్‌ నుంచి గెలుపొందారు) బరిలోకి దిగడంతో పోటీ ఆసక్తికరంగా మారింది. జలంధర్ పార్లమెంట్ స్థానంలో జలంధర్ సెంట్రల్, జలంధర్ కాంట్, జలంధర్ నార్త్, జలంధర్ వెస్ట్, అడంపూర్, కర్తార్‌పూర్, నకోదర్, షాకోట్, ఫిల్లౌర్ తొమ్మిది అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. క్రీడా సామాగ్రి, తోలు ఉత్పత్తుల తయారీ కేంద్రమైన జలంధర్‌లో జండా ఎగురవేసేది ఏ పార్టీ అనే చర్చ రాజకీయవర్గాల్లో జరుగుతున్నది