delhi new cm । ఢిల్లీ కొత్త ముఖ్యమంత్రి వీళ్లలో ఒకరే?

కేజ్రీవాల్‌ రాజీనామా నిర్ణయం నేపథ్యంలో ఆప్‌ నేతలు కొత్త ముఖ్యమంత్రి ఎంపికపై కసరత్తు చేస్తున్నారు. అతిశి, రాఘవ్‌ ఛద్దా, సంజయ్‌సింగ్‌, కైలాశ్‌ గెహ్లాట్‌, సౌరభ్‌ భరద్వాజ్‌లలో ఒకరిని సీఎం చేసే అవకాశాలు ఉన్నాయన్న చర్చ నడుస్తున్నది.

delhi new cm । ఢిల్లీ కొత్త ముఖ్యమంత్రి వీళ్లలో ఒకరే?

delhi new cm । బెయిల్‌పై విడుదలైనా.. ముఖ్యమంత్రిగా బాధ్యతలు నిర్వహించలేని షరతుల నేపథ్యంలో ఆ పదవికి రాజీనామా చేయనున్నట్టు కేజ్రీవాల్‌ (Arvind Kejriwal) సంచలన ప్రకటన చేసిన విషయం తెలిసిందే. దీంతో ఆయన స్థానాన్ని ఎవరు భర్తీ చేస్తారన్న విషయంలో పెద్ద ఎత్తున చర్చలు నడుస్తున్నాయి. ఉన్నవారిలో అత్యంత జనాదరణ ఉన్నవారిలో ఒకరిని ముఖ్యమంత్రిగా (Delhi Chief Minister) ఎంపిక చేయనున్నారు. కొత్త ముఖ్యమంత్రి ప్రజాదరణ పొందిన వ్యక్తిగానే కాకుండా.. పాలనను సమర్థంగా ముందుకు తీసుకుపోయే నేతగా ఉండాలని ఆప్‌ (Aam Aadmi Party) శ్రేణులు ఆశిస్తున్నాయి.

వాస్తవానికి కేజ్రీవాల్‌ తర్వాత పార్టీలో అంతటి గట్టి నాయకుడు మనీశ్‌ సిసోడియా (Manish Sisodia).  కొత్త ముఖ్యమంత్రి విషయంలో ఆయనతో కేజ్రీవాల్ చర్చలు జరుపుతున్నారు. ఢిల్లీ అసెంబ్లీకి వచ్చే ఏడాది ఫిబ్రవరిలో ఎన్నికలు (Assembly polls) నిర్వహించాల్సి ఉన్నది. అయితే.. నవంబర్‌లోనే మహారాష్ట్ర(Maharashtra)తోపాటు ఎన్నికలు నిర్వహించాలని కేజ్రీవాల్‌ డిమాండ్‌ చేసిన విషయం తెలిసిందే. మనీశ్‌ సిసోడియా సైతం తాను రాబోయే ఎన్నికల్లో మళ్లీ గెలిచిన తర్వాతే ప్రభుత్వంలో ఉంటానని ప్రకటించారు. దీంతో మిగిలిన ముఖ్య నాయకుల నుంచే సీఎం ఎంపిక ఉంటుందని తేలిపోయింది. కొత్త ముఖ్యమంత్రి పదవీకాలం కొంత సమయమే (few months) ఉన్నప్పటికీ.. సమర్థ నాయకుడిని ఎంపిక చేసేందుకు ఆప్‌ నాయకత్వం కసరత్తు చేస్తున్నది.

ప్రధానంగా ఐదుగురు ముఖ్య నేతలు ముఖ్యమంత్రి పదవికి రేసులో ఉన్నారనే చర్చ నడుస్తున్నది.

అతిశి : విద్య, ప్రజాపనులు శాఖ మంత్రిగా ఉన్న ఆప్‌ నేత అతిశి పేరు ప్రముఖంగా వినిపిస్తున్నది. కేజ్రీవాల్‌ అరెస్టు అనంతరం అతిశి ప్రభుత్వంలో, పార్టీలో ముఖ్యపాత్ర పోషించినవారిలో ఒకరు. ఆక్స్‌ఫర్డ్‌ యూనివర్సిటీలో చదివిన (Oxford University alumnus) అతిశి.. ఢిల్లీ విద్యావ్యవస్థలో విప్లవాత్మక మార్పుల కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించారు. కల్కాజీ నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన 43 ఏళ్ల అతిశి..  ఢిల్లీ మద్యం కేసులో మనీశ్‌ సిసోడియా (Sisodia) అరెస్టయిన అనంతరం మంత్రి అయ్యారు. ఇద్దరు కీలక నేతలు కేజ్రీవాల్‌, సిసోడియా జైల్లో ఉన్న కాలంలో పార్టీ బాధ్యతలతోపాటు ప్రభుత్వ బాధ్యతల్లోనూ కీలకంగా వ్యవహరించారు. స్వాంతంత్ర్య దినోత్సవ (Independence Day) వేడుకల సందర్భంగా  ఆగస్ట్‌ 15న త్రివర్ణ పతాకావిష్కరణకు ముఖ్యమంత్రి కేజ్రీవాల్‌.. మంత్రి అతిశిని ఎంచుకోగా.. దానికి గవర్నర్‌ తిరస్కరించడం ఆమె ప్రాధాన్యాన్ని చాటుతున్నది.

సౌరభ్‌ భరద్వాజ్‌ : గ్రేటర్‌ కైలాశ్‌ నుంచి మూడుసార్లు ఎన్నికైన సౌరభ్‌ భరద్వాజ్‌ (Saurabh Bharadwaj) విజిలెన్స్‌, హెల్త్‌ పోర్టుఫోలియోలను నిర్వహిస్తున్నారు. ఆయన కూడా సిసోడియా అరెస్టు అనంతరమే మంత్రివర్గంలోకి వచ్చారు. గతంలో సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌(software engineer)గా పనిచేసిన సౌరభ్‌.. కేజ్రీవాల్‌ 49 రోజుల ప్రభుత్వంలో కూడా మంత్రిగా పనిచేశారు. ఆప్‌ జాతీయ అధికార ప్రతినిధిగా ఉన్నారు. పార్టీ అగ్రనాయకత్వం జైల్లో ఉన్న సమయంలో పార్టీ  బాధ్యతలను సమన్వయం చేశారు.

రాఘవ్‌ ఛద్దా: ఆప్‌ జాతీయ కౌన్సిల్‌, రాజకీయ వ్యవహారాల కమిటీ సభ్యుడైన రాఘవ్‌ ఛద్దా (Raghav Chadha).. ప్రస్తుతం ఆప్‌ తరఫున రాజ్యసభ ఎంపీగా (Rajya Sabha MP) ఉన్నారు. పార్టీ ముఖ్యుల్లో ఒకరు. గతంలో చార్టెడ్‌ ఎక్కౌంటెంట్‌గా పనిచేసిన రాఘవ్‌.. ఆప్‌ ఆవిర్భావం నుంచీ పార్టీలో ఉన్నారు. రాజిందర్‌నగర్‌ ఎమ్మెల్యేగా కూడా గతంలో గెలుపొందారు. 2022 పంజాబ్‌ ఎన్నికల్లో (Punjab state polls) ఆప్‌ ఘన విజయంలో కీలక పాత్ర పోషించారు. 35 ఏళ్ల రాఘవ్‌ ఛద్దా.. దేశ యువ రాజకీయ నాయకుల్లో (young politicians) ఒక ప్రముఖుడిగా ఉన్నారు. రాజ్యసభలో అనేక కీలక అంశాలను లేవనెత్తారు.

కైలాశ్‌ గెహ్లాట్‌ : వృత్తిపరంగా న్యాయవాది అయిన కైలాశ్‌ గెహ్లాట్‌(Kailash Gahlot).. ఆప్‌ మంత్రివర్గంలోని సీనియర్లలో ఒకరిగా ఉన్నారు. హోం, ఆర్థిక, రవాణాశాఖల బాధ్యతలు నిర్వహిస్తున్నారు. 50 ఏళ్ల గెహ్లాట్‌.. 2015 నుంచీ ఢిల్లీలోని నజఫ్‌గఢ్‌ నియోజకవర్గం నుంచి గెలుస్తూ వచ్చారు. న్యాయవాదిగా (lawyer) ఢిల్లీ హైకోర్టు, సుప్రీంకోర్టులో ప్రాక్టిస్‌ చేశారు. 2005.. 2007 మధ్య కాలంలో హైకోర్టు బార్‌ అసోసియేషన్‌ ఎగ్జిక్యూటివ్‌ మెంబర్‌గానూ ఉన్నారు.

సంజయ్‌ సింగ్‌ : 2018 నుంచి రాజ్యసభ సభ్యుడిగా ఉన్న సంజయ్‌సింగ్‌.. ఆప్‌ కీలక నేతల్లో ఒకరు. పార్లమెంటులో అద్భుతమైన ప్రసంగాలు చేశారు. 52 ఏళ్ల సంజయ్‌సింగ్‌ (Sanjay Singh) మైనింగ్‌ ఇంజినీరింగ్‌లో డిప్లొమా చేశారు. పార్టీ వ్యవస్థాపక సభ్యుల్లో ఒకరు. పార్టీ జాతీయ కార్యవర్గం, రాజకీయ వ్యవహారాల కమిటీ(political affairs committee)ల్లో సభ్యుడిగా ఉన్నారు. నిత్యం పార్టీ తరఫున కీలక అంశాలపై మీడియా సమావేశాల్లో పాల్గొంటున్నారు. లిక్కర్‌ పాలసీ కేసులో అరెస్టయ.. ప్రస్తుతం బెయిల్‌పై ఉన్నారు.